సంక్రాంతికి శ్రీకారం | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి శ్రీకారం

Published Tue, Jan 13 2015 11:47 PM

తప్పెటగుళ్లు కళాకారులతో సీఎం చంద్రబాబునాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ - Sakshi

సింగపూర్ మంత్రితో కలిసి {పారంభించిన చంద్రబాబు
కళాకారులతో కలిసి సంప్రదాయ, గిరిజన నృత్యాలు
విదేశీయులకు ఆంధ్ర పిండి వంటలు, స్థానిక పంటలు పరిచయం
పారిశ్రామిక వేత్తలతో సమావేశం
 

విశాఖపట్నం: సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖలోని కైలాసగిరిలో ఈ వేడుకలను ప్రారంభించారు. సింగపూర్ ప్రతినిధులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. పిండి వంటలను ఆరగించారు. అనంతరం సింగపూర్ ప్రతినిధులతో పాటు స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఉదయం 11.55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో సింగపూర్ బృందంతో కలిసి చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరికి వెళ్లే మార్గమధ్యలోని మాధవధారలో ఎమ్మె ల్యే విష్ణుకుమార్ రాజు,టీడీపీ నేత సనపల పాండు రంగారావులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కైలాసగిరి చేరుకున్నారు. సింగపూర్ మంత్రితో పాటు గాలిపటాలు ఎగురవేసి సంబరాలను ప్రారంభించారు. గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. కోలాటం ఆడారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. తప్పెటగూళ్లు, పులివేషాలు, హరిదాసుల కీర్తనలు వంటి వాటిని విదేశీయులకు పరిచయం చేశారు. మన ప్రాంతంలో పండిన చెరకు, అరటి, గుమ్మడికాయలు, కంద,క్యారెట్ వంటి పంటల వివరాలను వారికి వివరించారు. సింగపూర్ మంత్రి ఎస్. ఈశ్వరన్‌కు భారీ గుమ్మడికాయను సీఎం చంద్రబాబు బహూకరించారు.

సీఎం వెంట వచ్చిన సింగపూర్ మంత్రితో పాటు పారిశ్రామిక బృందం సంక్రాంతి సంబరాలను ఆసక్తిగా తిలకించారు. ప్రతి ప్రదర్శనను తమ కెమెరాల్లో బంధించడంతో పాటు ‘సెల్ఫీ’లు తీసుకున్నారు. విశాఖ వాసులు ఏర్పాటు చేసిన ఆంధ్ర పిండి వంటలను సీఎం చంద్రబాబు వారికి రుచి చూపించారు. ఈశ్వరన్‌కు స్వయంగా తినిపించారు. బీచ్ రోడ్డులో విశాఖ అందాలను, సముద్ర సోయగాలను విదేశీ బృందానికి చూపించారు. నొవాటెల్ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలు,సింగపూర్ బృందంతో సమావేశమయ్యారు. విశాఖకు భారీ పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడతానన్నారు. తాము కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సింగపూర్ మంత్రి, అతని బృందం హామీ ఇచ్చారు.

సమావేశం అనంతరం సీఎం కృష్ణా జిల్లా విజయవాడ పర్యటనకు విదేశీ బృందంతో కలిసి వెళ్లారు. సీఎం వెంట ఎంపీలు కంబంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు గంటా  శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నారాయణ, అచ్చెం నాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ నివాస్, ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజు, ఇన్‌చార్జ్ సీపీ అతుల్‌సింగ్, డిఐజీ పి.ఉమాపతి, వుడా వీసీ టి.బాబూరావునాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్,ఎస్పీ కోయ ప్రవీణ్, డీసీపీలు త్రివిక్రమ్‌వర్మ, రవికుమార్‌మూర్తి  ఉన్నారు.

Advertisement
Advertisement