Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్‌ ద్వారా సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌

Published Tue, Feb 28 2017 11:22 AM

ఆంధ్రాబ్యాంక్‌ ద్వారా సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ - Sakshi

విజయవాడ (వన్‌టౌన్‌) : భారత రిజర్వు బ్యాంక్‌  2016–2017 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన నాలుగో సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఆంధ్రాబ్యాంక్‌ తన అన్ని శాఖల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని బ్యాంక్‌ విజయవాడ జోనల్‌ మేనేజర్‌ డి.చంద్రమోహన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెల 27 నుంచి మార్చి మూడో తేదీ వరకూ ఆంధ్రాబ్యాంకుకు చెందిన 2872 శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ బాండ్లను దేశీయులైన వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు మాత్రమే కొనుగోలు చేయుటకు అర్హులని తెలిపారు.

ఒకటి నుంచి 500 గ్రాముల వరకూ ఈ పథకంలో బాండ్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. గ్రాము ఖరీదును రూ.2,893గా , బాండ్‌ కాలపరిమితిని ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత ముందస్తుగా రద్దు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకంలో  బంగారాన్ని కొనకుండానే బంగారం మీద పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని ప్రజలు పొందుతారని తెలిపారు. బాండ్‌ నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఎవరైతే బాండ్‌లో పెట్టుబడి పెట్టారో వారు అంతే బంగారపు విలువను రిజర్వుబ్యాంక్‌ నిర్దేశించిన మార్కెట్‌ రేటుకు అనుగుణంగా రూపాయల్లో పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఆరు మాసాలకొకసారి పెట్టుబడి మీద 2.5శాతం వడ్డీని పొందగలిగే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడి కాలవ్యవధిలో బంగారపు ధరల హెచ్చు తగ్గుల నుంచి ఈ పథకం సరైన రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

Advertisement
Advertisement