బడి బస్సులు భద్రమేనా.! | Sakshi
Sakshi News home page

బడి బస్సులు భద్రమేనా.!

Published Wed, Jun 11 2014 1:29 AM

బడి బస్సులు భద్రమేనా.! - Sakshi

 ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సైతం చాలా బస్సుల్లో కానరావడంలేదు. వాహన ఫిట్‌నెస్ సరిగా లేకనో, డ్రైవర్, సిబ్బంది నిర్లక్ష్యంతోనో తరచూ స్కూల్ బస్సులు ప్రమాదాలకుగురవుతున్నా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలేదు. రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు జరిపి అయ్యిందనిపిస్తున్నా రనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూల్ బస్సులను నడిపించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమవు తున్న నేపథ్యంలో పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.  పాఠశాలల యాజమాన్యాలు కూడా మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.                 
 
 జిల్లాలో చాలా వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల నియామకంలో తగిన శ్రద్ధ చూపడంలేదు. కండీషన్ కలిగిన బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను కొన్ని యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి. పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం వరకే శ్రద్ధ చూపిస్తున్న తల్లితండ్రులు బస్సుల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం యాజమాన్యాలకు కలిసి వస్తుంది.
 
 వివరాలు పొందుపరచాల్సిందే
 పాఠశాల బస్సుపై తప్పనిసరిగా తగిన వివరాలు పొందుపర్చాలి. బస్సును ఫలానా పాఠశాల అవసరాలకు ఉపయోగిస్తున్నట్టు బస్సు ముందు భాగంపై 400 ఎంఎం పొడవు, 400 ఎంఎం వెడల్పు పరిమాణంలో స్పష్టంగా కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డుపై 250 ఎంఎంకు తగ్గని ఎత్తులో బాలిక, బాలుడి చిత్రాలు నల్ల రంగులో చిత్రీకరించాలి. ఆ చిత్రాల కింద స్కూల్, కళాశాల బస్సు అని కనీసం 100 ఎంఎం సైజు అక్షరాల్లో రాయించాలి. పాఠశాల బస్సుకు నాలుగు వైపులా పైభాగం మూలల్లో బయట వైపు పసుపు పచ్చని రంగుతో ఫ్లాషింగ్ లైట్లు బిగించాలి. విద్యార్థులు బస్సులో నుంచి కిందికి దిగేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు ఆ లైట్లను తప్పనిసరిగా వెలిగించాలి. బస్సు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో అనివార్యంగా ఒక అగ్నిమాపక యంత్రాన్ని, పొడిని రోజువారీగా అందుబాటులో ఉంచుకోవాలి.
 
 ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరి
 విద్యాసంస్థల బస్సుల్లో చాలా వరకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కనిపించడంలేదు. అత్యవసర మందులు, పరికరాలు బస్సుల్లో అందుబాటులో ఉండటంలేదు. ప్రథమ చికిత్స పెట్టె (ఫస్ట్ ఎయిడ్ బాక్స్)ను బస్సులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ప్రతి పాఠశాల యాజమాన్యం రవాణా, పోలీస్, విద్యా శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏడాదిలో కొన్ని సార్లు రహదారి భద్రతపై తరగతులు నిర్వహించాలి. ప్రమాదాలు జరిగే తీరు, నివారణ, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.
 
 రెండు వైపులా అద్దాలు : విద్యార్థులను తీసుకెళ్లే పాఠశాల బస్సులు తగిన సదుపాయాలతో ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు విద్యార్థులు డ్రైవర్‌కు కనిపించేలా బస్సుకు రెండు వైపులా అద్దాలు అమర్చాలి. బస్సు అంతర్భాగంలోనూ భారీ సైజు అద్దాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా నివారించడానికి వీలుంటుంది. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఉంటుంది.
 పటిష్టంగా ఫుట్‌బోర్డు : బస్సు ఫుట్‌బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 ఎంఎం ఎత్తుకు మించకుండా చూసుకోవాలి. ఫుట్‌బోర్డును లోహంతో పటిష్టంగా తయారు చేయించాలి.
 
 విద్యార్థులను తీసుకెళ్లే బస్సుకు రవాణా కమిషనర్ జారీ చేసిన విద్యాసంస్థ బస్సు పర్మిట్, ఆ బస్సు జీవిత కాలం తేదీ తప్పనిసరిగా పొందుపర్చాలి. విద్యాసంస్థకు చెందిన బస్సు డ్రైవర్ ఏడాదిలో ఒకేసారి జేటీసీ/డీటీసీ/ఆర్టీవో ద్వారా నిర్వహించే ప్రత్యేక శిక్షణకు హాజరవ్వాలి. బస్సు సైడ్ విండోలకు అడ్డంగా మూడు లోహపు కడ్డీలు ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. ఎమర్జెన్సీ ద్వారం ఏర్పాటు చేయాలి. దానిపై అత్యవసర ద్వారమని ప్రత్యేకంగా కనిపించేలా రాయించాలి. విద్యార్థుల బ్యాగ్‌లను బస్సులో భద్రపరుచుకోవడానికి సీట్ల కింద అరలు ఏర్పాటు చేయాలి.
 
 ఇవి తప్పక పాటించాలి
 స్కూల్ బస్సు ముందు భాగంలో ఎడమవైపున పాఠశాల పేరు, ఫోన్ నంబర్, ఇతర పూర్తి వివరాలు పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపించేలా పెయింటింగ్‌తో రాయించాలి.


 పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి వయసు 60 ఏళ్లకు మించరాదు.
 డ్రైవర్‌కు రక్తపోటు, మధుమేహం, కంటి చూపు వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ప్రతి మూడు నెలలకోసారి సదరు పాఠశాల యాజమాన్యం చేయించాలి. ఆ రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి.


 డ్రైవర్ మత్తుపానీయాలు సేవించి డ్రైవింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
 బస్సు డ్రైవర్ ను నియమించే ముందు అతడి డ్రైవింగ్ లెసైన్స్ సరైనదో.. లేదో నిర్ధారించుకోవాలి.
 బస్సు బాహ్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేవో నెలకోసారి వాటి పనితీరును యాజమాన్యం, డ్రైవర్, విద్యార్థుల తల్లితండ్రులు తెలుసుకోవాలి.


 విండ్ స్క్రీన్, వైఫర్స్, లైటింగ్, హారన్ తదితర భాగాల పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
 పిల్లలు పట్టుకునేందుకు వీలుగా బస్సులో అక్కడక్కడ లోహపు స్తంభాలు అమర్చాలి.
 బస్సులలో ఫిర్యాదుల పుస్తకాన్ని ఏర్పాటు చేయాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే పాఠశాల ప్రిన్సిపాల్ పరిశీలించి పరిష్కరించేందుకు పాటుపడాలి.


 బస్సుల పార్కింగ్ కోసం పాఠశాల, కళాశాల ఆవరణలో తగిన స్థలం కేటాయించాలి.
 విద్యార్థుల పేర్లు, తరగతి, ఇంటి చిరునామా, తల్లితండ్రుల ఫోన్ నంబర్లు, విద్యార్థి దిగాల్సిన స్థలం వంటి వివరాలు నమోదుచేసుకోవాలి. విద్యార్థుల పేరుకు ఎదుట ఆయా వివరాలు సూచిస్తూ రూట్‌ప్లాన్ బస్సులో ఏర్పాటు చేసుకోవాలి.
 

Advertisement
Advertisement