బంద్ సక్సెస్ | Sakshi
Sakshi News home page

బంద్ సక్సెస్

Published Tue, Sep 24 2013 1:02 AM

Schools closed across the district

సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. అత్యధిక విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. ఎన్‌జీవో జేఏసీ నేతలు ఉదయం నుంచే ర్యాలీగా తిరిగి పలుచోట్ల తెరిచిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూయించివేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు కొన్ని కళాశాలల బస్సులకు గాలి తీసివేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సీతారామపురంలోని పార్టీ కార్యాలయం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు పాదయాత్ర, చుట్టుగుంట సెంటర్‌లో రాస్తారోకో జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి, జలీల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం సోమవారం నాటికి 55వ రోజుకు చేరింది. ఇరిగేషన్ ఇంజనీర్లు సోమవారం ఉదయం మచిలీపట్నంలో కలెక్టర్‌ను కలిసి సమ్మె నోటీసు అందచేశారు. చల్లపల్లిలో దీక్షలు 45, అవనిగడ్డలో 33వ రోజుకు చేరుకున్నాయి.

ఘంటసాల, మోపిదేవి, కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు కొనసాగాయి. చల్లపల్లి మండలం మాజేరులో రైతులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో మేకావారిపాలేనికి చెందిన రైతులు దీక్ష చేపట్టారు. అవనిగడ్డలో పవనిజం యూత్ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి సమీపంలో దీక్ష శిబిరంలో కాకతీయ సేవా సమితి సభ్యులు కూర్చున్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, సీనియర్ రాజకీయ నాయకులు సామినేని విశ్వనాథం, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావ్‌లు సంఘీభావం తెలిపారు.

రోడ్డుపై వ్యాయామ ఉపాధ్యాయులు ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలో పాల్గొన్నారు. మునిసిపల్ సిబ్బంది, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు తాడులాగుడు పోటీ నిర్వహించిన తమ నిరసన తెలిపారు. పామర్రులో ఏపీ ఎన్‌జీవోస్, జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 48వ రోజుకు చేరాయి.

ఈ దీక్షలలో కుమార్ స్కూల్ విద్యార్థులు, చెవిటి, మూగవారు కూర్చున్నారు. మచిలీపట్నం ఎనిమిదో వార్డు ప్రజలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఓ చిన్నారి వినతిపత్రాన్ని అందించింది. కంభంపాడులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. పెడనలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరాయి. కృత్తివెన్నులోని 216 జాతీయ రహదారిపై మహిళలు కుర్చీలాట, ఒప్పులకుప్ప ఆడారు. కేసీఆర్ చేస్తున్న లొల్లి ఉల్లిఘాటును తలపిస్తోందనిఅర్థం వచ్చేలా సమైక్యవాదులు కృత్తివెన్ను జాతీయ రహదారిపై ఉల్లి విక్రయాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. 216 జాతీయ రహదారిపై సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు.
 
వ్యవసాయ కార్మికుల వంటావార్పు..

 తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెంలో వ్యవసాయ కార్మికులు, కూలీల ఆధ్వర్యంలో కృష్ణా కరకట్టపై నిరశన శిబిరం ఏర్పాటు చేసి, వంటావార్పు జరిపారు. తోట్లవల్లూరులో  జేఏసీ నాయకులు, గొర్రెల కాపరులు గొర్రెలతో నిరసన తెలిపారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నందిగామ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుపేట వద్ద రాస్తారోకో చేసి, మానవహారం ఏర్పాటు చేశారు.

 న్యాయవాదుల వినూత్న నిరసన..

 న్యాయవాదులు నందిగామలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కొందరు న్యాయవాదులు కేసీఆర్ మాస్కులు ధరించి గాంధీ సెంటర్‌లో కనక తప్పెట్ల మోతలతో చిందేసి నిరసన తెలిపారు. నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలకు చెందిన విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. గాంధీ సెంటర్‌లో పలువురు వడ్రంగి వృత్తిదారులు బాడిసలు పట్టుకుని మొద్దులను చెక్కుతూ నిరసన తెలిపారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు, వీఆర్వోలు రిలే దీక్ష చేశారు. మండవల్లిలో ఐఎన్‌టీయూసీ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. కత్తిపూడి-పామర్రు 214 జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు.

 ఎమ్మెల్యే జయమంగళకు సమైక్య సెగ..

 మండవల్లిలో దీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలపటానికి వచ్చిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను విద్యార్థులు చుట్టుముట్టి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలల వ్యాయామోపాధ్యాయులు రహదారిపై షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్, టెన్నీకాయిట్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల రెవెన్యూ ఉద్యోగ జేఏసీ నాయకులు నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పామర్రులో జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
 

Advertisement
Advertisement