అబ్బురపరిచిన..సంబురం | Sakshi
Sakshi News home page

అబ్బురపరిచిన..సంబురం

Published Sun, Sep 29 2013 2:03 AM

science exhibition to 'Inspire'

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: సైన్స్ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు వేదికైంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరగనుంది. ఇందుకోసం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 550 మంది విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి సైన్స్ పండుగను ప్రారంభించారు. కలెక్టర్ దినకర్‌బాబు, ఎమ్మెల్సీ సుధాకర్, ఎన్‌సీఆర్‌టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
 
 విద్యార్థుల ఎగ్జిబిట్లు అతిథులను, సందర్శకులను అబ్బురపరిచాయి. ఎగ్జిబిషన్ ప్రాంగణం విద్యార్థులతో కోలాహలంగా మారింది. వినూత్న ప్రదర్శనలు అతిథులను, సందర్శకులను అబ్బురపరిచాయి. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కొండాపూర్ మండలం తొగర్‌పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి మాధురి ఆంగ్లంలో ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సంగారెడ్డి మండలం చెర్యాలకు చెందిన విద్యార్థులు ఆహూతులకు స్వాగతం పలుకుతూ, గణపతిని ప్రార్థిస్తూ ప్రదర్శించిన నృత్యరూపకం.. పాఠశాలకు చెందిన విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, చెట్ల పరిరక్షణను వివరిస్తూ ప్రదర్శించిన సందేశాత్మక నృత్యరూపకం ఆహుతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటలు, మిమిక్రీ విద్యార్థులను ఉత్సాహపరిచింది.
 
 కార్యక్రమం ఆలస్యంతో ఇబ్బందులు
 ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సైన్స్‌ఫెయిర్ మధ్యాహ్నం12.30గంటలకు ప్రారంభమైంది. దీంతో విద్యార్థులు ఇబ్బం దు లు పడాల్సి వచ్చింది. ముఖ్యఅతిథులు ప్రసంగాలను ప్రారంభించే సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా సభా స్థలం నుంచి భోజనానికి వెళ్లటం ఆరంభించారు. దీంతో ప్రసంగాలు సాగే సమయంలో విద్యార్థుల హాజరు పలుచగా కనిపించడంతో అతి థులు తమ ప్రసంగ సమయాన్ని కుదించుకోవాల్సి వచ్చింది. భోజన, బస సౌకర్యాలు సరిగ్గా లేవని కొంత మంది విద్యార్థులు తెలిపారు.

Advertisement
Advertisement