కదంతొక్కిన విద్యార్థులు | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన విద్యార్థులు

Published Thu, Jan 30 2014 3:08 AM

Seeking the support of private educational institutions samaikyandhra

 తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోరుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు కదం తొక్కారు. విభజనతో ఇరు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ బిల్లును తిప్పి పం పాలంటూ నినాదాలు చేశారు. తణుకులో 60 బస్సుల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేంద్ర సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల నాయకులు బసవ రామకృష్ణ, అనపర్తి ప్రకాశరావు మాట్లాడుతూ విభజనతో విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వెంటనే బిల్లును వెనక్కి పంపించాలని కోరారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులు మేకా నరేంద్రకృష్ణ, ఎన్.రాజేంద్రప్రసాద్, అనపర్తి ఉమ, జి.సత్యనారాయణ, ఎం.సుబ్బారావు, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 
 భీమవరంలో...
 భీమవరం : ఇంజినీరింగ్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీలో ఓటింగ్ పెట్టి ఎమ్మెల్యేలంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి సమైక్యవాదాన్ని చాటిచెప్పాలని విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్రం కలిసి ఉంటే విద్యార్థి, యువకులకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందువలన యువత ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించి సమైక్యాంధ్ర సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల జేఏసీ నేతలు ఉద్దరాజు వేణుగోపాలరాజు, సీతా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బీవీ సుబ్బారావు, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఎన్‌వీఆర్ దాసు, గంటా సుందరకుమార్, వడ్డి సుబ్బారావు, కోళ్ళ నాగేశ్వరరావు, నల్లం గంగాధరరావు, సయ్యద్ నసీమా బేగం, బోడపాటి పెదబాబు, జంపన ఫణిబాబు, వేగి రాము, టీవీవీ ప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, కమ్మంపాటి బాబ్జీ పాల్గొన్నారు. 
 
 నేడు ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా 
 తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ గురువారం భీమవరం, ఉండి ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. 
 

Advertisement
Advertisement