ఆంధ్రా ‘మండలి’ విపక్ష నేతగా సీఆర్

4 Jun, 2014 02:35 IST|Sakshi
ఆంధ్రా ‘మండలి’ విపక్ష నేతగా సీఆర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీల అభిప్రాయం మేరకే: దిగ్విజయ్
11 మంది ఎమ్మెల్సీలతో ఢిల్లీ పెద్దల భేటీ
సీఆర్ ఎంపికలో తెర వెనక చిరంజీవి ఒత్తిళ్లు!


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (కౌన్సిల్) ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఏపీసీసీ కార్యాలయం ఇందిరాభవన్‌లో జరిగిన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కార్యక్రమం ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఢిల్లీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, కుంతియా, తిరునావక్కరుసు తదితరులు సాయంత్రం 4 గంటలకు.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్ర కౌన్సిల్‌లో మొత్తం 90 మంది ఎమ్మెల్సీలుండేవారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు 40 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 50 మందిగా ఎమ్మెల్సీల విభజన జరిగింది. ఈ 50 మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు 14 మంది ఉండగా.. వారిలో సింగం బసవపున్నయ్య, ఎ.లక్ష్మీ శివకుమారి, బాలసాలి ఇందిరలు మంగళవారం నాటి సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన 11 మంది పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరితో ఏకాంతంగా సమావేశమైన దిగ్విజయ్, వయలార్ తదితర నేతలు వారి అభిప్రాయాలు అడిగారు. ఓటింగ్ నిర్వహించాలా, సీక్రెట్ ఓటింగ్ పెట్టాలా, అందరి అభిప్రాయాలు, తీర్మానం మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు అంగీక రిస్తారా? అని కోరారు. అయితే తెలంగాణ శాసనసమండలిలో పార్టీ ఎమ్మెల్సీల అభిప్రాయల మేరకు తీర్మానం చేసి నేతను నిర్ణయించడంతో ఇక్కడా అలాగే చేయాలని మెజారిటీ సభ్యులు చెప్పటంతో.. సోనియా నిర్ణయానికి తామంతా కట్టుబడే ఉంటామని ఎమ్మెల్సీలు చేసిన తీర్మానం ప్రతిని ఢిల్లీ పెద్దలు తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీకి సమాచారం అందించారు.

దీనిపై సోనియా నిర్ణయం కోసం అంతా దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. దిగ్విజయ్ ఐదు నిమిషాలకో మారు ఢిల్లీకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సోనియా అందుబాటులోకి రాలేదు. చాలా సేపటి తరువాత ఆమె అందుబాటులోకి రావడంతో సీఆర్‌ను ఎంపిక చేసిన విషయాన్ని ఆమెకు తెలియజేసి ఆమోదం తీసుకున్నారు. అనంతరం ఏపీ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా సి.రామచంద్రయ్యను ఎంపిక చేసినట్టు దిగ్విజయ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకే సి.రామచంద్రయ్యను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఆయన ఇప్పటికే శాసనమండలి నాయకుడిగా వ్యవహరిస్తున్నందున ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకే ఆయనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశామని తెలిపారు.

నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం: సీఆర్

కాంగ్రెస్ ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఎమ్మెల్సీలంతా సహకరిస్తే కౌన్సిల్‌లో నిర్మాణాత్మకంగా వ్యవహరించి తమ వాణిని వినిపిస్తామని మండలి ప్రతిపక్ష నేతగా ఎంపికైన సీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను సక్రమంగా అమలుచేసేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, మండలిలో ప్రతిపక్ష నేతగా రుద్రరాజు పద్మరాజుకే అవకాశం ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా అనూహ్యంగా రామచంద్రయ్యను ఎంపిక చేయడం వెనుక మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఒత్తిళ్లు పనిచేసినట్టు పార్టీలో బలంగా వినిపిస్తోంది.
 
 

మరిన్ని వార్తలు