ఒకే భాష... ఒక్కటే రాష్ట్రం | Sakshi
Sakshi News home page

ఒకే భాష... ఒక్కటే రాష్ట్రం

Published Wed, Sep 18 2013 2:32 AM

ఒకే భాష... ఒక్కటే రాష్ట్రం - Sakshi

సాక్షి నెట్‌వర్క్ : సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమం సీమాంధ్రలో పతాకస్థాయికి చేరుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాజిల్లా విజయవాడలో వైద్యులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని సుమారు 500లకు పైగా ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలోనూ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ వైద్యసేవలు నిలిపివేశాయి. ఒంగోలులో, గుంటూరు జిల్లా తాడికొండలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఆర్‌టీసీ ఉద్యోగులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు టవర్‌క్లాక్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. అనంతపురంలో విద్యుత్ ఉద్యోగులు ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందితో పాటు, ల్యాబ్ టెక్నీషియన్లు ల్యాబ్‌లు మూసేసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.    
 
 కర్నూలులో ఈనెల 29న  బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు, ఉద్యోగులు ఈనెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వైద్యులు ఆస్పత్రులకు తాళాలు వేసి, నిరసన తెలియజేశారు. వైఎస్సార్ జిల్లా  పోరుమామిళ్లలో పశువైద్యాధికారులు ఎడ్లబండ్లతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
 
 రాజంపేటలో ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు బోధించి నిరసన తెలిపారు. జమ్మలమడుగులో డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ర్యాలీ నిర్వహించి అనంతరం పిడతలతో ‘సమైక్యభజన’ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రిలోని మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి నోట్లో పాల పీకలతో నిరసన తెలిపారు. కోనసీమలో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.  రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ పాటించాయి. జగ్గంపేటలో సుమారు అయిదు వేల మందితో సమైక్య సింహగర్జన నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో 600మంది ఉద్యోగులు సామూహికంగా నిరశన దీక్షలో పాల్గొన్నారు. గాజువాకలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. వంగపండు తన ఆటాపాటలతో అలరించారు.   
 
 రాష్ట్రంలో అందరి బతుకుబాగుండాలని బతుకమ్మలతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. పాలకుల మనసు మార్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మహిళలు ఘటాలతో కోటదుర్గమ్మ ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు చేశారు. నివగాం గ్రామస్తులు అమ్మవారికి ముర్రాటలు సమర్పించారు. కవిటి మండలంలో సుమారు 200 మంది రైతులు ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు.  సీతంపేట మండలం గొయిది గ్రామస్తులు వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలోని శాంతి ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బ్రాహ్మణులు రాష్ట్రంలో సుఖశాంతులు వృద్ధి చెందాలని కోరుతూ రోడ్డుపై కూర్చొని అష్టోత్తర శతనామాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.  నెల్లిమర్లలో విజయనగరం- పాలకొండ రహదారిని మెడికల్ కళాశాల విద్యార్థులు  దిగ్బంధించారు.  
 
 విభజన భయంతో ఒంటికి నిప్పంటించుకుని...
 రాష్ట్ర విభజన భయంతో ఓ యువకుడు బలిదానానికి యత్నించాడు. విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి తీవ్ర మానసిక వేదనకు గురైన కర్నూలు నగరంలోని వడ్డేగేరి కాలనికి చెందిన  షేక్ అబ్దుల్‌ఖాన్(30) మంగళవారం టీవీలో వార్తలు చూస్తూ ఒంటిపై నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు..   విభజన ప్రకటన వెలువడి 50 రోజులవుతున్నా  కేంద్రం స్పందించకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తెలంగాణ కోసం అక్కడి ప్రజలు ఆత్మాహుతి చేసుకున్నారు. అలాగే తానూ చేసుకుంటే తప్పేంటని కుటుంబసభ్యులతో తరచూ చెప్పేవాడు. అన్నట్లుగానే మంగళవారం మధ్యాహ్నం మిద్దెపెకైక్కి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement