వేర్పాటుపై మండిపాటు | Sakshi
Sakshi News home page

వేర్పాటుపై మండిపాటు

Published Sat, Dec 7 2013 3:11 AM

seemandhra peoples fire on bifurcation

 జనాగ్రహం పెల్లుబికింది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై జిల్లా ప్రజానీకం మండిపడింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ సాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాలూ బాసటగా నిలిచాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకొని ప్రతి ఒక్కరూ బంద్ పాటించారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యాన బంద్, వివిధ నిరసన కార్యక్రమాలు అశేష ప్రజానీకం మద్దతుతో కొనసాగాయి.
 
 సాక్షి, కాకినాడ :
 టి-బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీమాంధ్ర బంద్ పిలుపు జిల్లాలో పూర్తిగా విజయవంతమైంది. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సమైక్యనాదం నినదించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి కదం తొక్కారు. ఏపీ ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాల సమైక్యవాదులు బంద్‌లో పాల్గొన్నారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లా అట్టుడికింది. కొన్నిచోట్ల రహదారులపై టైర్లకు నిప్పుపెట్టడంతో నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాకపోకలు స్తంభించి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
 
  జిల్లావ్యాప్తంగా వర్తక వ్యాపార వాణిజ్యసముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను తెరవలేదు. బంద్‌తో రూ. కోట్ల లావాదేవీలు స్తంభించిపోయాయి. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. సమైక్య వాదానికి చిత్తశుద్ధితో కట్టుబడిన వైఎస్సార్ సీపీకి తామంతా అండగా ఉన్నామని బంద్ విజయవంతం చేయడం ద్వారా ప్రజలు మరోసారి చాటిచెప్పారు. మెజార్టీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ విభజనకు పాల్పడడం దారుణమని,సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రెండునాల్కల ధోరణితో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలను తరిమికొడతామని హెచ్చరించారు.ఔ
 
 విభజన పాపం బాబుదే
 విభజన పాపం ముమ్మాటికీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుదేనని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ధ్వజమెత్తారు. అమలాపురంలో పార్టీ శ్రేణులతో కలసి వారు బంద్ నిర్వహణలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులందరూ సోనియాకు అమ్ముడుపోయారన్నారు. తెలుగు జాతి వీరిని ఎన్నటికీ క్షమించదని వారు స్పష్టం చేశారు. హైస్కూల్ సెంటర్ నుంచి గడియారస్తంభం సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. బస్సులను అడ్డుకున్నారు. తదుపురి ఈదరపల్లి వంతెన చేరుకొని ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పార్టీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 జగన్ ఒక్కరే సమైక్యవాది
 సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమేనని  ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాజమండ్రి నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ పేర్కొన్నారు.  పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టి.కె. విశ్వేశ్వర రెడ్డి, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ర్ట కమిటీ సభ్యులు మాసా రామ్‌జోగ్, ఎన్. వసుంధరతో పాటు వందలాది మందితో నగర వీధుల్లో బైక్ ర్యాలీ చేశారు. బంద్ నిర్వహించారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికింది. యువజన విభాగం నగర కన్వీనర్ గుర్రం గౌతమ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బైక్ ర్యాలీ చేసి బంద్ నిర్వహించారు. గోకవరం బస్టాండ్, నందం గనిరాజుసెంటర్, పేపరుమిల్లురోడ్, కోటగుమ్మం, కోటిపల్లి బస్టాండ్, కంబాల చెరువు కూడళ్లలో టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
 
 వారంతా ద్రోహులే
 సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. రామచంద్రపురం, ద్రాక్షారామల్లో పార్టీ శ్రేణులతో పాదయాత్రగా వెళ్లి బంద్  పాటించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ర్ట ప్రజలను మోసగిస్తున్నారన్నారు.
 
 అభివృద్ధికి గొడ్డలిపెట్టు
 విభజన నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తుందని పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ తదితరులతో ఆయన జగ్గంపేట పురవీధుల్లో ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు. విభజనతో సీమాంధ్రకంటే తెలంగాణా ఎక్కువ నష్టపోతుందని నెహ్రూ అన్నారు. కిర్లంపూడిలో పార్టీ నాయకుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ర్యాలీచేశారు.
 
 విభజిస్తే అధోగతే
 రాష్ట్రాన్ని విభజిస్తే అన్నిరంగాల్లోనూ అధోగతి తప్పదని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. సీతానగరంలో పార్టీ శ్రేణులతో పాదయాత్రగా వెళ్లి బంద్ చేయించారు. విభజన వల్ల సీమాంధ్ర ఎడారి అవుతుందన్నారు.
 
 జగన్‌ను ఎదుర్కొనలేకే..
 రాష్ర్టంలో బలీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేకనే విభజన చిచ్చు రగిలించారని పార్టీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్ తదితరులు కొత్తపేట నుంచి రావులపాలెం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
 
 వారి ఉద్యమాలు విడ్డూరం
 విభజించాలని లేఖలిచ్చిన టీడీపీ, విభజించిన కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఉద్యమాలుచేయడం విడ్డూరంగా ఉందని తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. నగర కన్వీనర్ ఆర్‌విజేఆర్ కుమార్, యువజన నేత అనంత ఉదయభాస్కర్ తదితరులతో కలసి ఆయన కాకినాడలో బైక్ ర్యాలీ చేశారు. .
 
 టైర్లకు నిప్పు పెట్టి...
 కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది సర్పవరం, ఇంద్రపాలెంలలో బంద్ పాటించి రాస్తారోకో చేశారు. సర్పవరం జంక్షన్, తహశీల్దార్ కార్యాలయం, ఇంద్రపాలెంలో పెద్ద సంఖ్యలో టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్‌లో రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కో-ఆర్డినేటర్ రెడ్డి ప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణల ఆధ్వర్యంలో మండపేట లో ర్యాలీ, బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు.  ముమ్మిడివరం కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజుల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో జరిగింది.
 
  సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ,  కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, కొండేటి చిట్టిబాబులు ఆధ్వర్యంలో మామిడికుదురులో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేశారు. పి.గన్నవరంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి పోలీస్ స్టేషన్ ఎదుట మానవహారం, రాస్తారోకో చేశారు. కో ఆర్డినేటర్లు మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, బొంతు రాజేశ్వరరావులు ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో బంద్ జరిపారు. రాజోలులో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న పార్టీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. తునిలో కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఆర్టీసీ గ్యారేజీ వద్ద ధర్నా, హైవేపై రాస్తారోకో చేశారు. కో ఆర్డినేటర్ తోటసుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో బైక్ ర్యాలీలు చేసి బంద్ చేయించారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ అడ్డతీగల వద్ద రాస్తారోకో చేసి రాజమండ్రి- భద్రాచలం రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు.
 
 టీడీపీ నేతల దౌర్జన్యం
 పిఠాపురం వై జంక్షన్ వద్ద రాస్తారోకో చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో గొల్లప్రోలు నుంచి పిఠాపురం వస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్ వర్మ వాగ్వాదానికి దిగారు. తమకు దారివ్వాలని వారు కోరగా, వైఎస్సార్ సీపీ శ్రేణులు కొద్దిసేపు ఆగమన్నాయి. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమించి తోపులాటకు దారి తీయడంతో పోలీసులు ఇరువర్గాలనూ శాంతింపజేశారు. ఉప్పాడ మండలం కొత్తపల్లిలో పార్టీ సీజీసీ సభ్యుడు గంపల వెంకట రమణ, ఉప్పలగుప్తంలో పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు బంద్ జరిపించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బా రావు ఆధ్వర్యంలో వందలాది మంది ఏలేశ్వరంలో బంద్ నిర్వహించారు. బాలాజీచౌక్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
 
 పళ్లంరాజు ఇంటి వద్ద నిరసన
 సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీఒలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, న్యాయవాదులు నిరసనలతో హోరెత్తించారు. జేఏసీ జిల్లా ఛైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథరావు, ఏపీ ఆర్‌ఎస్‌ఎ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు సుబ్బారావుల నేతృత్వంలో కలెక్టరేట్‌తో సహా వివిధ శాఖల ఉద్యోగులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటి గేటు వద్ద వారు బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు టైర్లకు నిప్పంటించి, సీమాంధ్ర మంత్రులు తీరుపై మండిపడ్డారు. మహిళా ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష చేపట్టారు. జెడ్పీ సెంటర్‌లో కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. సీమాంధ్ర క్రై స్తవ జేఏసీై చెర్మన్, సీబిసీఎన్‌సీ అధ్యక్షులు ముత్తాబత్తుల రత్నకుమార్ ఆధ్వర్యంలో సీబీసీఎన్‌సీ హైస్కూల్, కళాశాల విద్యార్థినులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇంద్రపాలెం వంతెన,  కలెక్టరేట్ ల వద్ద మానవహారంగా నిరసన తెలిపారు. అమలాపురంలో జేఏసీ కోనసీమ కన్వీనర్ ఆర్‌ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement