అట్టుడికిన సీమాంధ్ర | Sakshi
Sakshi News home page

అట్టుడికిన సీమాంధ్ర

Published Sun, Oct 6 2013 2:01 AM

Seemandhra stir: Central establishments not spared

సాక్షినెట్‌వర్క్: మలిరోజూ సీమాంధ్ర అట్టుడికింది. రాష్ర్ట విభజనపై కేంద్రమంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 72గంటల బంద్‌ పిలుపు మేరకు శనివారం సీమాంధ్ర జిల్లాలు స్తంభించాయి. ఏపీఎన్‌జీవోల సంఘం చేపట్టిన బంద్‌ కూడా తోడవడంతో సకలం మూతపడ్డాయి. ప్రైవేటు ఆస్పత్రుల జేఏసీ పిలుపుమేరకు అన్ని ఆస్పత్రులూ మూసివేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఎన్జీవోలు రోడ్‌ కం రైలు వంతెనను దిగ్బంధించారు. ఏలూరు ఆశ్రం కళాశాల జాతీయ రహదారిపై రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని తాటిపాక గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌ (జీసీఎస్‌)ను ఉద్యోగ జేఏసీ ముట్టడించింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ దగ్గర జాతీయ రహదారిని సమైక్యవాదులు రోజంతా దిగ్బంధించారు. చిత్తూరు జిల్లా పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు హెరిటేజ్‌ డెయిరీని ముట్టడించారు. డెయిరీపై రాళ్లు రువ్వి అద్దాలను, బయట సెక్యూరిటీ ఔట్‌ పోస్‌‌టను ధ్వంసం చేశారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు సమీపంలో కేంద్ర మంత్రి శరద్‌పవార్‌కు చెందిన బారామతి ఆగ్రోఫ్యాక్టరీని ముట్టడించారు. రాళ్లు రువ్వి ఫ్యాక్టరీ భవనం, సెక్యూరిటీ పోస్‌‌ట కార్యాలయాల అద్దాలను పగులగొట్టారు. మదనపల్లెలో విద్యార్థులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాన్ని ముట్టడించి అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలనుతిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో అడ్డుకున్నారు. దీంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు.

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టును 72గంటలపాటు సమైక్యవాదులు మూసివేయించారు. కర్నూలులోని అన్ని ప్రధాన రహదారుల్లో టైర్లను అంటించి రాకపోకలను స్తంభింపజేశారు. ఉద్యోగ జేఏసీ నేత హెచ్‌.తిమ్మన్నను శనివారం తెల్లవారుజామున కోడుమూరు పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ, జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఆత్మకూరులో సీపీఐ కార్యాలయం వద్ద ఫర్నిచర్‌ను తగులబెట్టారు. ఒంగోలులో విద్యుత్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌ జయాకర్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో విద్యుత్‌ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. నగరంలో కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలోని వందలాది గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మరో పదిమంది మృత్యువాత


విభజన కలతతో శనివారం మరో పదిమంది మృత్యువాత పడ్డారు. గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండం పమిడిపాడుకు చెందిన రామకోటయ్య(32) సమైక్యర్యాలీలో కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణిం చాడు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మం డలం ఎస్‌.యానాంకు చెందిన శేషగిరిరావు (46), కర్నూలు జిల్లా సి.బెళగల్‌కు చెందిన కౌలుట్ల(35), అబ్దుల్లా(33), వైఎస్సార్‌ జిల్లా కడపలోని అక్కాయపల్లెకు చెందినƒ శ్రీనివాసులరెడ్డి(35), రైల్వేకోడూరు మం డలం తుంగావాండ్లపల్లెకు చెందిన యల్లమ్మ(60) మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి కి చెందిన సోమరాజు (50), గణపవరం మండలం సరిపల్లెకు చెం దిన నాగేశ్వరావు (52), కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన దేవానందం (45) మృతిచెందారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామానికి చెందిన గొల్లపల్లి కోటేశ్వరరావు (65) విపరీతమైన రక్తపోటుతో మృతిచెందాడు.
 

Advertisement
Advertisement