డిగ్రీలోనూ సెమిస్టర్ పరీక్షలు | Sakshi
Sakshi News home page

డిగ్రీలోనూ సెమిస్టర్ పరీక్షలు

Published Thu, Apr 30 2015 4:10 AM

semester examinations as in degree

యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లోని కోర్సులకు ఆధునిక హంగులతో సరి కొత్త విధానాలను రూపొందించనున్నారు. సాంప్రదాయ కోర్సులకు విద్యా సంవత్సరం ముగింపున రాత, ప్రాక్టికల్ పరీక్షల ద్వారా ప్రతిభను గుర్తించేవారు. ఇక నుంచి ఈ విధానాలకు స్వస్తి పలికి సెమిస్టర్ విధానాన్ని అమలుపరచనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి సీడీసీ (కళాశాల అభివృద్ధి కమిటీ) కసరత్తు చేస్తోంది. బుధవారం ఎస్కేయూలోని సీడీసీ కార్యాలయంలో జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశాన్ని సీడీసీ డీన్ ఆచార్య ఎంసీఎస్ శుభ అధ్యక్షతన జరిగింది.  

సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ , రాష్ర్ట ఉన్నత విద్యా మండలి  ఆదేశాల మేరకు రాష్ర్ట వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో నూతన విధానాన్ని అవలంబించనున్నారు. నిన్న ఎస్వీ యూనివర్సిటీలో 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాల సీడీసీ డీన్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
 
గ్రేడింగ్‌తో పాటు మార్కులు : నూతన సెమిస్టర్ విధానం 2015-16 విద్యా సంవత్సరంలో మెదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయిస్తారు. 75 మార్కులు రాత పరీక్షలు, 25 మార్కులు సైన్స్ వారికి  ప్రాక్టికల్స్ . ఆర్ట్స్ వారికి 25 మార్కులు ఇంటర్నల్ మార్కులు కేటాయించారు. మాదిరి ప్రశ్నాపత్రాలు కూడా  ఎస్కేయూలో జరిగిన సమావేశంలో ఆమోదించారు. సిలబస్ రూపకల్పన పూర్తి అయింది. సెమిస్టర్ విధానానికి తగ్గట్టుగా రూపొందించారు. సైన్స్ సబ్జెక్టులలో కొన్ని ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. ఆంత్రోపాలజీ, జియాగ్రఫి, జియాలజీ వంటి సబ్జెక్టుల సిలబస్ రూపకల్పన  చేయనున్నారు.  కార్యక్రమంలో యూజీ డీన్ ఆచార్య ఎ.మల్లి ఖార్జున రెడ్డి, జువాలజీ బీఓఎస్ చైర్మన్ నాగలింగ రెడ్డి, జ్ఞానేశ్వర్ ,బోజప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement