క్షమాభిక్షకు నోచుకోని 'జైలు పక్షులు' | Sakshi
Sakshi News home page

క్షమాభిక్షకు నోచుకోని 'జైలు పక్షులు'

Published Tue, Jun 17 2014 8:47 AM

క్షమాభిక్షకు నోచుకోని 'జైలు పక్షులు'

ఈమె గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రుక్మిణమ్మ. వయస్సు 85 ఏళ్లు. మనమలు, మనమరాళ్లను ఆడిస్తూ హాయిగా శేషజీవితం గడపాల్సిన వయస్సది. కానీ క్షణికావేశంలో చేసిన తప్పునకు 15 ఏళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో మగ్గిపోతోంది. ఈమె కోడలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ఆమె కొడుకు ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నాన్నమ్మా...అమ్మమ్మ పిలుపులకు నోచుకోకుండా బాధను దిగమింగుతూ ప్రభుత్వ క్షమాభిక్ష కోసం ఆశగా రుక్మిణమ్మ ఎదురుచూస్తోంది. జైలుకొచ్చిన ప్రతి అధికారిని క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంటున్నా కరికరించడం లేదు. రుక్మిణమ్మలాగే మరో నలుగురు మహిళలు,  పురుషుల కారాగారంలో దాదాపు 60 మంది వరకూ ఇలాంటి కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. తెలిసో, తెలియకో తప్పుచేశాం... వృద్ధాప్యంలోనైనా కుటుంబ సభ్యులతో కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
 
 కోటగుమ్మం : ఖైదీల పాలిట 498(ఎ) శాపంగా మారుతోంది. మహిళలకు రక్షణగా ఉండాల్సిన చట్టం కొన్ని సందర్భాలలో దుర్వినియోగం అవుతోందని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకున్న మహిళను వేధింపులకు గురిచేసినా, వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలలో భర్తతో పాటు అతని తరఫు వారిపై 498(ఎ) కేసులు నమోదు అవుతున్నాయి. ఏడు సంవత్సరాలు నిండకుండా భార్య అత్తవారింట్లో ఆత్మహత్యకు పాల్పడితే 498(ఎ) కేసుగా నమోదు చేస్తారు.
 
 దీనిలో అమ్మాయి తరఫు వారు, భర్తతో పాటు, అత్త,మామా, ఆడపడుచులు, మరుదులు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కేసులో నేరం రుజువైతే జీవిత ఖైదీ విధిస్తారు. అయితే జైల్ నిబంధనల ప్రకారం  ఖైదీలు ఏడు సంవత్సరాలు కఠిన శిక్ష అనుభవిస్తే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మూడేళ్లు రెమ్యూషన్ కలిపి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించినట్టుగా పరిగణించి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. అయితే 498(ఏ) కేసుల్లో శిక్ష పడ్డ ఖైదీలకు ప్రభుత్వ క్షమా భిక్ష ప్రసాదించకపోవడం వలన ఏళ్ల తరబడి ఖైదీలు జైల్లోనే మగ్గిపోతున్నారు.
 
 రాజమండ్రి మహిళా కారాగారంలో వివిధ కేసుల్లో శిక్ష పడ్డవారికి ప్రభుత్వాలు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నప్పటికీ 498(ఏ) కేసుల్లో శిక్ష పొందుతున్నవారు క్షమాభిక్షకు నోచుకోవడం లేదు. కరుడు కట్టిన నేరస్తులను, బాంబ్ బ్లాస్టింగ్ కేసులలో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రభుత్వం వరకట్నం వేధింపుల కేసులలో శిక్షపడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని పేర్కొంటున్నారు.
 
 జైల్‌లోనే మగ్గిపోతున్న కుటుంబాలు
 వరకట్నం వేధింపుల కేసులో మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేయడంతో అందరూ జైల్లోనే మగ్గిపోతున్నారు. ఈ లాంటి కేసులలో శిక్ష పడిన ఖైదీలకు తిరిగి నేరం చేయడని నిర్ధారణకు వచ్చిన ఖైదీలకు, వృద్ధాప్యంలో ఉన్న ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించాలని మానవ హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో వ్యాధులతో ఉన్న వారిని జైల్‌లోనే మృతి చెందేవరకూ ఉంచే కంటే మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతున్నారు.
 
 
 సీనియర్ సిటిజన్స్‌ను విడుదల చేయాలి
 ప్రభుత్వం రెండు దఫాలుగా ఖైదీల విడుదలలో నిబంధనలు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను హత్య చేసిన కేసులలోను, మహిళా వేధింపుల కేసులో శిక్షపడిన ఖైదీలను విడుదల చేయడంలేదు. మానసిక పరివర్తన చెందిన ఖైదీలను రూ.25 వేల బాండ్  తీసుకొని వదిలే ప్రభుత్వం మహిళా వేధింపుల కేసులలో కూడా వృద్ధులపై సానుభూతితో వ్యవహరించాలి. మానసిక పరివర్తన చెందిన సీనియర్ సిటిజన్స్ విడుదల చేయాలి.
 - ముప్పాళ్ల సుబ్బారావు, మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు,
 రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు.

Advertisement
Advertisement