వసూల్ రాజా..!

22 Dec, 2014 02:55 IST|Sakshi
వసూల్ రాజా..!

అందరినీ బెదిరిస్తూ.. వ్యాపారుల దగ్గర వసూలు చేస్తూ..సెటిల్‌మెంట్లు చేస్తూ..సూపర్ పోలీస్‌గా చలామణి అవుతున్నాడో వ్యక్తి. చివరికి పోలీస్ సిబ్బందిలో కూడా తన మాట వినని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తూ దారికి తెచ్చుకుంటున్నాడు. తమ కళ్లముందే ఇంత జరుగుతున్నా..పలువురు ఫిర్యాదులు చేస్తున్నా తమకేమీ పట్టనట్టు పోలీసులు వ్యవహరిస్తుండడం విశేషం.
 
* గజపతినగరంలో అనధికార పోలీస్ ఇన్‌ఫార్మర్?
* కేసులున్నా..చర్యలు నిల్..?  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం పట్టణంలోని పలు బంగారు దుకాణాలు, ఇతర వ్యాపారస్తులను బెదిరిస్తూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌నని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ వ్యక్తి పట్టణానికే సమస్యగా తయారయ్యాడు. ఏ విధమైన ఉపాధి లేకపోయినా పట్టణంలో దర్జాగా పోలీసుల సహకారంతో తనపని తాను చేసుకుపోతున్నాడు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా చెప్పుకుంటున్న ఆ  వ్యక్తి పట్టణంలో అనేక మంది వ్యాపారస్తులను,ఉద్యోగులను,ప్రజలను అన్యాయంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే అతను  పలు నేరాలకు పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఇదేమని అడిగితే బెదిరింపులకు దిగుతు న్నాడని వాపోతున్నారు. ఆ వ్యక్తిపై పలు కేసులు నమోదవుతున్నా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తిరిగి అతన్నే పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నియమించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో ఏమైనా సంఘటనలు జరిగితే పోలీసులను అడ్డం పెట్టుకుని వసూలు చేస్తున్నాడు.ఈ మొత్తంలో పోలీసులకు కొంత  ముట్టజెప్పడంతో వారు కూడా ఇతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎస్సీ ,ఎట్రాసిటీ కేసుతో పాటు, బెల్టు షాపుకేసుల్లో ముద్దాయిగా  నమోదై ఉన్నాడు..
 
ఆ మధ్య పట్టణంలో ధర్నా జరుగుతుండగా పురిటిపెంట గ్రామానికి చెందిన సుజన అనే  నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా దారి ఇవ్వాలని వేడుకున్న ఆమె భర్త, బంధువులపై దాడికి దిగాడు.   దీంతో ఆమె తీవ్ర రక్త స్రావానికి గుైరె   ఇబ్బందుల పాలైంది. ఈ సంఘటనపై పట్టణానికి చెందిన పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేసినా పోలీసులకేమీ పట్టకపోవడం విచారకరం. ఇటీవల  బొండపల్లి మండలానికి చెందిన బోడసింగి పేట గ్రామంలో మైనర్‌పై లైంగికదాడి కేసుకు సంబంధించి సుమారు రూ.60వేలకు మధ్యవర్తిత్వం వహించి పోలీసులద్వారా  కేసును మాఫీ చేయించినట్లు ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు