Sakshi News home page

శివరాత్రి బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్

Published Tue, Mar 8 2016 3:18 AM

శివరాత్రి బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్ - Sakshi

 శ్రీశైలానికి తగ్గిన భక్తజనం  తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ఇంటర్ పరీక్షల ప్రభావం

ఆత్మకూరు: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై  తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇంటర్ పరీక్షల ప్రభావం కనిపించింది. దీంతో ఈ సారి ఉత్సవాలకు భక్తజనం తగ్గారు.   బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఫిబ్రవరి 29వ తేదీ  నుంచి ఈ నెల 6వ తేదీ సాయంత్రం వరకు శ్రీశైలంలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే కనిపించింది. ఆదివారం నుంచి క్యూలలో రద్దీ  కొంత పెరిగింది. గత ఏడాది స్వైన్ ఫ్లూ, అంతకు మునుపు ఏడాది రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో భక్తుల రద్దీ తగ ్గగా ఈసారి తీవ్రవర్షాభావం, ఇంటర్ పరీక్షల  ప్రభావం కనిపించింది. శనివారం వరకు భక్తులు  రెండు,మూడు గంటల వ్యవధిల్లోనే మల్లన్న దర్శనాలు ముగించుకుని బయటకు వచ్చారంటే వాటి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు.  భక్తుల రద్దీ  తగ్గడానికి గల కారణంపై శివస్వాములను ఆరా తీయగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలతో కుటుంబసమేతంగా శ్రీశైలానికి రాలేకపోయామని చెప్పుకొచ్చారు.
 
 ఎప్పుడూ కుటుంబంతో వచ్చేవాళ్లం
:  
శివరాత్రి సందర్భంగా  శ్రీశైలక్షేత్రానికి రావడం ఇది  ఎనిమిదోసారి. ఏడుసార్లు కుటుంబసభ్యులతో వచ్చాను. ఈ ఏడాది కొంత ఇబ్బందులు ఉండడంతో అందరం రాలేకపోయాం.ఒక్కడినే వచ్చాను.ఈ సంవత్సరం వర్షాలు కురవక  పంటలు చేతికి రాలేదు. దేవుడు కరుణిస్తే వచ్చేసారి అందరం కలిసి వస్తాం. - శేషిరెడ్డి, మైదుకూరు
  

 ఒక్కడినే వచ్చాను:
శివమాలతో శ్రీశైల క్షేత్రానికి ఒక్కడినే వచ్చాను. గతంలో కుటుంబ సమేతంగా వచ్చి మూడు,నాలుగు రోజులు ఇక్కడే ఉండేవాళ్లం. పాగాలంకరణ అనంతరం మాలను తొలగించి మొక్కులను చెల్లించి స్వగ్రామాలకు వెళ్లేవాళ్లం.ఈ ఏడాది సరైన పంటలు పండకపోవడంతో  ఒక్కడిని రావడం కూడా ఇబ్బందిగా మారింది.  - పోలయ్య, గుడిపాడు,

Advertisement
Advertisement