43 రోజుల అనంతరం సందడి.. | Sakshi
Sakshi News home page

43 రోజుల అనంతరం సందడి..

Published Tue, May 5 2020 10:43 AM

Shops Open in Orange And Green Zones East Godavari - Sakshi

కరోనా... ఊహించని ప్రళయం...గత శతాబ్దంగా ఎన్నో ప్రళయాలు చవి చూసిన జనానికి కంటికి కనిపించని ఈ కరోనా నిలువునా వణికించింది. ఆరోగ్య పరంగానే కాదు ... ఆర్థిక పరంగానూ కుదేలు చేసింది. అందర్నీ గడపదాటనీయకుండా లక్ష్మణ రేఖ గీసి శాసించింది. 40 రోజులకుపైగా అష్ట దిగ్బంధం చేసి కొన్ని సడలింపులతో వెసులుబాటు కల్పించడంతో జనం బాహ్యప్రపంచంలోకి స్వేచ్ఛగా సోమవారం రాగలిగారు. కొత్త అనుభూతులను పొందారు.  

సాక్షి, కాకినాడ: కరోనా మాహమ్మారి దెబ్బకు గత 43 రోజులుగా ఉన్న లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి కొద్దిమేర సడలింపులు ఇవ్వడంతో జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరంతోపాటు  ప్రధాన పట్టణ వీధులన్నీ కళకళలాడాయి. ‘కోవిడ్‌–19’ వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. అది విజయవంతం కావడంతో మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకూ పొడిగించినా ఆదివారం నుంచి కొన్ని సడలింపులివ్వడంతో ఇన్నాళ్లూ మూత పడిన వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలతోపాటు చిన్న, మధ్య తరహా దుకాణాలు తెరుచుకోవడంతో ఉదయం 7 నుంచే  కొనుగోలుదారులతో నిండుగా దర్శనమిచ్చాయి. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో వస్త్ర, కిరాణా, మొబైల్, ఎలక్ట్రికల్, బంగారు దుకాణాలన్నీ తెరచుకున్నాయి. 

మద్యం ప్రియుల బారులు
జిల్లా వ్యాప్తంగా 370 మద్యం దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి మద్యం అమ్మకాలు నిర్వహించారు. సుమారు 43 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు ఉదయం నుంచి రాత్రి వరకు భారీ క్యూలైన్లలో నిలబడి మద్యాన్ని కొనుగోలు చేశారు. మద్యం చేతిలోకి రావడంతో వారి మోముల్లో ఆనందం తొణికిసలాడింది. 

ఓపీ సేవలు
కరోనా దెబ్బకు మూతపడిన ప్రైవేటు ఆస్పత్రులుకూడా తెరుచుకున్నాయి. అన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అవి అలాగే..
సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, క్రీడా మైదానాలు, ఈత కొలనులు, పార్కులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఆడిటోరియంలు గతంలోనే మూతపడ్డాయి. అంతరాష్ట్ర ప్రయాణాలు, విమాన, రైళ్ల ప్రయాణాలు స్తంభించాయి.

రిజిస్ట్రేషన్లు ప్రారంభం
గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరుచుకున్నాయి. తొలిరోజు అంతగా రిజిస్ట్రేషన్లు ఊపందుకోకపోయినా..కార్యాలయం కళకళలాడింది. జిల్లాలో 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకుగాను రాజమహేంద్రవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, తుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కంటైన్మెంట్‌ జోన్‌లో ఉండడంతో తెరుచుకోలేదు. మిగిలిన 30 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ప్రారంభమయాయ్యయి. రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయి. సుమారు 100 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం.

పువ్వులు నవ్వులు
కడియం మండలం కడియపులంకలో 43 రోజుల లాక్‌డౌన్‌ తరువాత సోమవారం పూలమార్కెట్‌ తెరుచుకుంది. మొదటిరోజు పూలమార్కెట్‌కు 20 శాతం పువ్వులు మాత్రమే వచ్చాయి. రేపటి నుంచి మార్కెట్‌ ఊపందుకుంటుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మూడు టన్నుల పువ్వులు సుమారు 1.50 లక్షల విలువైన పువ్వులు వచ్చాయి. సుమారు 60 వేల పువ్వులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. వివిధ దేవాలయాలకు మంగళవారం నుంచి టన్నున్నర పువ్వులు దేవాలయాలకు పంపించాలని ఆదేశాలు వచ్చాయి. 

కొ‘బ్బరి’లోకి...
కోనసీమలోని అంబాజీపేట కొబ్బరి  మార్కెట్‌ నుంచి కొబ్బరి ఎగుమతులు మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలకు రెండు లారీలు వెళ్తున్నాయి. 

రోడ్డుపైకి ఆటోలు
లాక్‌డౌన్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆటోల ప్రయా ణం స్తంభించింది. సడలింపులు ఇవ్వడంతో తిరిగి ప్రా రంభమైంది. ఆటోలో ఇద్దరికి మాత్రమే అనుమతిచ్చా రు. దీంతో నిబంధనలు పాటిస్తూ నడిచాయి. మాస్క్‌ ధరించకుండా డ్రైవింగ్‌ చేస్తున్న, ఇద్దరి కంటే ఎక్కువగా ప్రయాణిస్తున్న ఆటోలను పోలీసులు అదుపు చేశారు. 

బార్బర్‌ షాపులు
బార్బర్‌ షాపులు తెరుచుకోవడంతో యువకులు, ఉద్యోగులు తమ కురుల అందాలకు మెరుగులు దిద్దుకున్నారు. షేవింగ్, కటింగ్‌ చేయించుకునేందుకు ఎగబడ్డారు. అక్కడ కూడా భౌతిక దూరం పాటిస్తూ వచ్చారు. హ్యాండ్‌ శానిటైజర్, మాస్కులు ధరించారు. 

మెకానిక్‌ షాపు
ఇన్నాళ్లు మూతబడ్డ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల మెకానిక్‌ షాపులు తిరిగి ప్రారంభించడంతో వాహనదారులు తమ వాహనాలకు మరమ్మతులు, వాటర్‌ వాష్‌ తదితర పనుల్లో నిమగ్నమయ్యారు.

Advertisement
Advertisement