‘సీమ రాజధాని’కి చిక్కుసమస్య | Sakshi
Sakshi News home page

‘సీమ రాజధాని’కి చిక్కుసమస్య

Published Sun, Dec 15 2013 11:55 PM

shortage of compost yard to amalapuram

అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :  కోనసీమ రాజధాని వంటి అమలాపురంలో రెండు దశాబ్దాలుగా ‘చెత్త సమస్య’ తిష్ట వేసింది. 7.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం,  54 వేల మంది జనాభాతో, గ్రేడ్-1 మున్సిపాలిటీ అయిన పట్టణంలో ఈ సమస్యను విరగడ చేయడంలో ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారు. 11 వేల నివాస గృహాల నుంచి రోజూ సేకరించే 40 టన్నుల చెత్తను పోయడానికి అవసరమైన కంపోస్టు యార్డుకు జాగాయే గగనమైంది. చెత్త డంపిం గ్‌కు అవసరమైన స్థలం లేక పట్టణవాసులు ఎదుర్కొంటున్న అసౌకర్యం అంతా ఇంతా కాదు.

 ఈ సమస్య ఇంత జటిలంగా మారడానికి మున్సిపాలిటీ అధికారులే కాక.. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎన్నికవుతూ వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా బాధ్యులే. మున్సిపాలిటీకి పలు చోట్ల సొంత స్థలాలు ఉన్నా చాలీచాలని పరాయి స్థలాన్ని కంపోస్టు యార్డుగా ఉపయోగిస్తూ చెత్త సమస్యను సాగదీస్తూ వస్తోంది. సొంత స్థలంలోకి వెళ్లేందుకు మున్సిపల్ అధికారులు చొరవ చూపరు. ఒకవేళ చొరవ చూపినా రాజకీయ నాయకులు అవాంతరాలు సృష్టించి, సమస్యను ‘చివికిపోని ప్లాస్టిక్ వ్యర్థం’లా మిగుల్చుతున్నారు.
 చాలీచాలని జాగాలో..
 మున్సిపాలిటీ ప్రస్తుతం బైపాస్ రోడ్డు వద్ద, శ్మశానం చెంతన, పంట కాల్వ పక్కనున్న నీటి పారుదల శాఖ స్థలంలో కంపోస్టు యార్డు నిర్వహిస్తోంది.  రోజూ సేకరించే 40 టన్నుల చెత్త తెచ్చి పోసేందుకు ఈ కొద్దిపాటి స్థలం మాత్రం సరిపోవటంలేదు. దీంతో చెత్త కుప్పలుకుప్పలుగా బైపాస్ రోడ్డు మార్జిన్ వరకు, యార్డును ఆనుకుని ఉన్న శ్మశానంలోకి విస్తరిస్తోంది. ఓపక్క నీటిపారుదల శాఖ తమ స్థలాన్ని ఇచ్చేయమని డిమాండ్ చేస్తుండగా మరోపక్క ప్రజలు శ్మశానం చెంత నుంచి డంపింగ్ యార్డును వేరొక చోటకు తరలించాలంటూ నిరసనలకు దిగుతున్నారు. స్థానిక గోశాల ప్రతినిధి పోతురాజు రామకృష్ణ ఈ సమస్యపై నిరవధిక దీక్ష చేయగా ప్రజలు రాస్తారోకో చేశారు. ఈ ఒత్తిడితో మున్సిపాలిటీ గతంలో పట్టణ సమీపంలోని రూరల్ మండల పరిధిలోకి వచ్చే భట్లపాలెంలో పదెకరాల భూమిని సేకరించి అక్కడికి డంపింగ్‌యార్డును తరలించాలనుకుంది. అయితే కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రయత్నానికి గండి పడింది.
 వెనక్కు పోయిన రూ.అరకోటి నిధులు :
 డంపింగ్‌యార్డు నిమిత్తం మరోచోట భూమి సేకరణకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరైనా సకాలంలో వాటిని ఖర్చుచేయకపోవడం వల్ల వెనక్కు పోయాయి. మున్సిపాలిటీ మళ్లీ డంపింగ్ యార్డు స్థల సేకరణ ఊసే మరిచింది. సమస్య మాత్రం రోజురోజుకూ తీవ్రతరమవుతూనే ఉంది. గతంతో పోలిస్తే పట్టణ జనాభాతోపాటు విస్తీర్ణం కూడా 30 శాతం వరకు పెరిగింది. కంపోస్టు యార్డుగా కనీసం ఐదెకరాల భూమి ఉంటేనే చెత్త సమస్యకు పరిష్కారం దొరకదు.
 జవాబు లేని ప్రశ్న..
 మున్సిపాలిటీకి వడ్డిగూడెం శివారులో ఉన్న రెండెకరాల సొంత స్థలాన్నే ఏడేళ్ల క్రితం వరకు కంపోస్టుయార్డుగా ఉపయోగించే వారు. మున్సిపాలిటీకి మరికొన్ని చోట్ల స్థలాలున్నా అవి జనావాసాలకు చేరువలో ఉన్నాయి. కాగా వడ్డిగూడెంలోని స్థలంలో చెత్త వేయడంపై అక్కడి ప్రజలు అభ్యంతరం చెప్పడంతో పాటు రాజకీయ నాయకుల ఒత్తిడితో తప్పనిసరై కంపోస్టుయార్డును ప్రస్తుతమున్న నీటిపారుదల శాఖ జాగాలోకి తరలించారు. అప్పటి నుంచీ సమస్య జవాబు దొరకని ప్రశ్నలా వేధిస్తూనే ఉంది. అయినా సొంతస్థలాల్లో ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ చొరవ చూపలేకపోతోంది. కాగా వడ్డిగూడెంలోని రెండెకరాల్లో ప్రభుత్వం బాలికల హాస్టల్ భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అసలే చెత్తను ఎక్కడకు తరలించాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా మున్సిపాలిటీకి ఉన్న కోట్ల విలువైన జాగాకు కూడా ఎసరు పెట్టినట్టయింది.  ఆ స్థలాన్ని కాపాడుకుని, ఎలాగైనా కంపోస్టు యార్డు అక్కడ పెట్టాలని అధికారులు భావిస్తున్నా రాజకీయ వర్గాల నుంచి సరైన మద్దతు లభించడం లేదు. ‘చెత్త’ సమస్య నుంచి విముక్తమయ్యే సుదినం అమలాపురానికి ఎప్పుడు వస్తుందో?

Advertisement
Advertisement