హలో.. ‘హోలోగ్రామ్’లు ఏవీ? | Sakshi
Sakshi News home page

హలో.. ‘హోలోగ్రామ్’లు ఏవీ?

Published Sat, Nov 23 2013 3:31 AM

Shortage of holograms hits issue in Medak district

సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: ‘బాధ్యతగల పౌరులు ఓటర్లుగా నమోదవ్వాలి.. ఇందుకోసం మీకు అన్ని ఏర్పాట్లూ అందుబాటులో ఉన్నాయి..’ అంటూ అధికార యంత్రాంగం ఊరూ వాడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఉన్నతాధికారులూ అదే స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. కానీ.. తమ పక్షాన బాధ్యతల్ని మాత్రం నెరవేర్చడంలేదు. దాంతో జిల్లాలో హోలోగ్రామ్‌ల కొరత నెలకొంది. ఫలితంగా కార్డుల జారీ నిలిచిపోయింది.
 
 రానున్న సార్వత్రిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం జిల్లా పాలనా యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఎంపీడీఓ, తహశీల్దారు, ఆర్‌డీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ దరఖాస్తుల సమర్పణకు బాక్సులను ఏర్పాటు చేశారు. అలాగే డిగ్రీ కాలేజీలో సిబ్బందిని సైతం ఉంచారు. మరోవైపు ఈ/మీసేవా కేంద్రాల్లో కూడా ఆన్‌లైన్ విధానంలో స్వల్ప చార్జీలతో దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. అంతేకాదు.. కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న వాళ్లూ ఈసీకి నేరుగా అర్జీ పెట్టుకోవచ్చు. ఇంత లా సౌలభ్యాలిచ్చిన అధికారులు అసలు విషయానికొచ్చేసరికి వెనుకబడుతున్నారు.
 
 అమల్లో ఎన్ని ఆటంకాలో!
 వేలల్లో యువతీ యువకులు ఈ మధ్య ఫారం-6(నూతన ఓటర్లుగా నమోదు) భర్తీ చేసి దరఖాస్తులు సమర్పించారు. వారి అర్జీలను ఆమోదించినట్లు ఆన్‌లైన్‌లో ఈసీ పొందుపర్చింది. తీరా...భారత ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు మాత్రం పౌరులకు దక్కడంలేదు. వాటిని మీ సేవా కేంద్రాల్లో తీసుకోవచ్చు. అక్కడ ప్రింట్లు తీసి ఇస్తారు. కానీ...అవి చెల్లుబాటు అయ్యేందుకు కీలకమైన ‘హోలోగ్రామ్’లు మీ/ఈ సేవా సెంటర్లలో లేవు. దాంతో కార్డుల జారీ ప్రక్రియ ఆగింది. సిద్దిపేటలో దాదాపు మూడు వేల మంది కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.


  హోలోగ్రామ్‌ల కొరతకు కారణంగా ఓ విషయం ప్రచారంలో ఉంది. గతంలో తాము కేటాయించిన హోలోగ్రామ్‌ల వినియోగం వివరాలు నివేదిస్తేనే కొత్తవి ఇస్తామని ఎన్నికల సంఘం అధికారులు షరతు విధించారని తెలుస్తోంది.

Advertisement
Advertisement