శాస్త్రీయ పరిష్కారం చూపండి | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ పరిష్కారం చూపండి

Published Sat, Sep 13 2014 12:46 AM

శాస్త్రీయ పరిష్కారం చూపండి - Sakshi

* 14వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్‌సీపీ వినతి
* నివేదిక సమర్పించిన సోమయాజులు, మిథున్‌రెడ్డి
* విభజన బిల్లులో పేర్కొన్న హామీలను కేంద్రం అమలు చేయాలి
* పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌లకు జాతీయ హోదా ఇవ్వాలి
* రాయలసీమ, ఉత్తరాంధ్రలకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
* నిధులను సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అశాస్త్రీయ విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ.సోమయాజులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చడంతోపాటు విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను నిలుపుకోవడానికి అవసరమైన నిధులను కేటాయించాలని, కేంద్రానికి ప్రతిపాదనలు చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని వారు కోరారు. వైవీ రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది.

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమావేశంలో పాల్గొని ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్థిక సంఘానికి తాము విన్నవించిన అంశాలను డీఏ సోమయాజులు, మిథున్‌రెడ్డి వివరించారు.

ఆ అంశాలిలా ఉన్నాయి...
* ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 56 ఏళ్లపాటు ఉన్న హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. రక్షణశాఖ పరిశోధన కేంద్రాలు, అత్యున్నత జాతీయ విద్యాసంస్థలు, వైద్యారోగ్య సంస్థలు, ఐటీ పరిశ్రమ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యాయి. దీనివల్ల వ్యాట్ రూపంలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 60 శాతం ఆదాయం వచ్చేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చేందుకు రూ.15,600 కోట్లను కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా అందించేలా సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరాం.

* గత పదేళ్లలో సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏడాదికి సగటున 33 నుంచి 35 శాతం ప్రణాళిక వ్యయం, 65 శాతం ప్రణాళికేతర వ్యయం ఉండేవి. మొత్తం అంచనా వ్యయంలో పెట్టుబడి వ్యయం 12 శాతంగా ఉండేది. కానీ.. 2014-15 బడ్జెట్లో ప్రణాళిక వ్యయం 23 శాతంగానూ.. ప్రణాళికేతర వ్యయం 77 శాతంగానూ పేర్కొన్నారు. ఇదే రీతిలో పెట్టుబడి 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది. బడ్జెట్లో లోటుపాట్లను సరిదిద్దాలి.

* రాష్ట్రంలో రూ.1.02 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు రూ.వెయ్యి కోట్లే కేటాయించింది. నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు రూ.రెండు వేల చొప్పున ఇచ్చే హామీ అమలుచేస్తే ప్రణాళికేతర వ్యయం మరింత పెరుగుతుంది. కానీ.. ఆ హామీలను అమలుచేయకుండా ప్రణాళికేతర వ్యయం ఎలా పెరిగింది?

 రాజధానికి నిధులు సమకూర్చాలి..
రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే సమకూర్చేలా చూడాలని ఆర్థిక సంఘాన్ని కోరాం. రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి వంటి భవనాల నిర్మాణానికి నిధులను కేంద్రమే సమకూర్చాలి. కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైతే అటవీశాఖ భూములను డీ-నోటిఫై చేసి ఇవ్వాలి.

* కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రం వాటాగా 50 శాతం నిధులివ్వాలి. ఆ నిధుల కేటాయింపునకు ఇచ్చే ప్రాధాన్యత లో జనాభా(1971 లెక్కల ప్రకారం)కు 30 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, సొం త పన్నుల రాబడికి 20 శాతం, ప్రణాళిక వ్యయానికి 25 శాతం, ఆహారభద్రతకు రాష్ట్రం సమకూర్చే ధాన్యానికి ఐదు శాతం, పరిపాలన సంస్కరణకు ఐదు శాతం ఇవ్వాలి.

* రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సంఘానికి చేసిన ప్రతిపాదనలను మేము బలపరుస్తున్నాం. కొత్త రాజధాని నిర్మాణానికి, జాతీయ విద్యా, వైద్యారోగ్య సంస్థల ఏర్పాటుకు, పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం.

* రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలి. కేంద్రం హామీ ఇచ్చినట్లుగా తక్షణమే రాష్ట్రానికి పదేళ్లపాటూ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించేలా సిఫార్సు చేయాలి. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే.. విభజన బిల్లులోని 13వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు కేంద్రం రాయితీలు ఇవ్వాలి.
 
వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలివ్వాలి
రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. విభజన బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేసేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టులను కేంద్రమే చేపట్టి.. పూర్తిచేసి దుర్భిక్ష రాయలసీమకు గోదావరి జలాలను అందించి సుభిక్షం చేయాలని విన్నవించారు.

‘‘మీరు రాయలసీమ వాసే. నా నియోజకవర్గమైన రాజంపేటలోనే మీ సొంతూరు ఉంది. ఇక్కడి ప్రజల ఇబ్బందులు మీకు తెలియనివి కావు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీళ్లు అందాలంటే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. కేబీకే(కోరాపూట్-బోలంగీర్-కలహండి) ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్‌ఖండ్ ప్యాకేజీల తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’’ అని కోరారు. ఇందుకు వైవీ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేలా కేంద్రానికి ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement