జలయజ్ఞం వేగవంతం చేయండి | Sakshi
Sakshi News home page

జలయజ్ఞం వేగవంతం చేయండి

Published Sun, Nov 2 2014 1:58 AM

జలయజ్ఞం వేగవంతం చేయండి

అనంతపురం సెంట్రల్ :
 జలయజ్ఞం పథకం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను పరిశీలన బృందం ఆదేశించింది. జలయజ్ఞం పనులను పరిశీలించేందుకు  విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు రెహ్మాన్, అబ్దుల్‌బషీర్, బీఎస్‌ఎన్‌రెడ్డిను ఓ బృందంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం అనంతపురానికి చేరుకున్న బృందం సభ్యులు హెచ్చెల్సీ కాలనీలోని సీఈ కార్యాలయంలో అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జలయజ్ఞం పనులు నత్తనడక సాగుతున్నాయని ఈ సందర్భంగా వారు అసహనం వ్యక్తం చేశారు.

హంద్రీనీవా పథకానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని, స్టేజ్ 1, 2 పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పనుల్లో ఎదురవుతున్న అవాంతరాలపై వెంటనే నివేదికలు తయారు చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలోగా పెండింగ్ పనులను పూర్తి చేసి నీటిని తీసుకు రావడానికి ఇబ్బందులు లేకుండా  చూడాలని అన్నారు. ఈ సందర్భంగా సీఈ మనోహర్ మాట్లాడుతూ... 2004, 2005 మధ్య ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారని, పెరిగిన మెటీరియల్, కూలి వలన కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేకపోతున్నారని వివరించారు.

ఇప్పటి వరకూ చేసిన పనులను ముగించి, ఇక నుంచి చేపట్టే పనులకు కొత్త ధర వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెండేళ్ళ నుంచి హంద్రీనీవా  ద్వారా నీటిని తీసుకుంటున్నామని, దీని వలన కొన్ని ప్యాకేజీల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముఖ్యంగా 13, 33వ ప్యాకేజీ పనుల్లో నీటిని తోడించి మిగిలిన పనులు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్చెల్సీలో డిస్ట్రిబ్యూటరీ కాలువలను అభివృద్ది చేయాలని, దీని వలన తొలుత రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. సమగ్ర నివేదికలను త్వరలో తయారు చేసి, అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ మురళీనాథ్‌రెడ్డి, హంద్రీనీవా ఎస్‌ఈ సుధాకర్‌బాబు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement