కరువు ఛాయలు | Sakshi
Sakshi News home page

కరువు ఛాయలు

Published Tue, Aug 26 2014 1:09 AM

కరువు ఛాయలు - Sakshi

  •      38 మండలాల్లో వర్షాభావం
  •      1,11,401 హెక్టార్లలోనే పంటలు
  •      ప్రత్యామ్నాయానికి ప్రతిపాదనలు
  • జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఈసురోమంటున్నారు. 38 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సాధారణంలో సగం కూడా వర్షం పడలేదు. సెప్టెంబర్ 15వ తేదీనాటికి వర్షాలు పుంజుకుంటేనే పరిస్థితి మెరుగవుతుంది. లేదంటే కరువుగా పరిగణించాల్సి ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జిల్లా రైతుల పాలిట శాపమవుతున్నాయి.
     
    విశాఖ రూరల్: వరుణుడు ముఖం చా టేశాడు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కేవలం 39శాతమే పంటలు సాగయ్యాయి. నీటి వనరులు ఉన్న మండలాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,80,783 హెక్టార్లు. ఇంతవరకు కేవలం 1,11,401 హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. జిల్లాలో ఈ నెల లో సాధారణ వర్షపాతం 196.5 మిల్లీమీటర్లు. 66 శాతం తక్కువగా కేవలం 68.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. వర్షాలు లేకపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఏజెన్సీ మినహా అన్ని మండలాల్లో పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా లేదని అధికారులే చెబుతున్నారు.
     
    సెప్టెంబర్ 15 తరువాత కరువే
     
    జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు వేచి చూడాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మూడేళ్లుగా సెప్టెంబర్ తరువాతే భారీగా వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్‌లో వర్షాలు పడితే సాగు విస్తీర్ణం 1.70 లక్షలకు చేరుకొనే అవకాశముంటుందని, యా జమాన్య పద్ధతులు పాటించడం ద్వా రా నాట్లు చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 15 వరకు వర్షాలు పడనిపక్షంలో జిల్లాలో కరువుగా పరిగణించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామంటున్నారు.

    ఇటీవల అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధాన స్థానంలో జరిగిన జిల్లా టీఅండ్‌వీ సమావేశంలోనూ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నిర్ధారించారు. ఇక్కడ ఇంకో మెలిక ఉంది.ఆలస్యంగా నాట్లుతో నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల కారణంగా పంటలు నీటిపాలయ్యే ప్రమాదం తప్పదు. గతేడాది ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో కూడా సెప్టెంబర్ వరకు వర్షాలు పడకపోవడంతో 30 మండలాల్లో కరువు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు.

    అయితే ప్రభుత్వ నిబంధనలు కారణంగా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదేమైనా వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయలేని ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి రెండు వారాల వరకూ వర్షాల కోసం వేచి చూసి, ఆపై ప్రత్యామ్నాయ ప్రణాళిక మేరకు అపరాల సాగుకు వెళ్లాలని వ్యవసాయ శాఖ ఒక అంచనాకు వచ్చింది.
     
    38 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు
     
    వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలో 38 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు నిర్ణయించారు. 19,700 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించారు.
     
    వరి, మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, రాజ్‌మా పంటలకు సంబంధించి స్వల్పకాలిక విత్తనాల అవసరాలను గుర్తించారు. ఇందులో తక్కువ కాల పరిమితి వరి విత్తనాలు 4700 క్వింటాళ్లు, అలాగే ఇతర పంటలకు సంబంధించి 8800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదించి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపారు. ఈ వారంలో వీటి కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
     
     ఈ ఏడాదికి నాట్లు లేనట్టే..

    నాది చీడికాడ మండలం అర్జునగిరి. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో వరి సాగుకు నారు పోశాను. వర్షాభావంతో అది ఎర్రబడిపోయింది. చిగుర్లు ఎం డిపోయి గిడసబారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నారు బతికినా నాట్లుకు పనికిరాదు. మళ్లీ నారు పోద్దామన్నా..వరుణుడు కరుణిస్తాడో లేదో..?. ఈ ఏడాదికి నాట్లు పడే అవకాశం లేనట్టే. ఇప్పటికే రూ.6వేలు వరకు నష్టపోయాను. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నాలాంటి రైతులను ఆదుకోవాలి.         
     - పరవాడ నాయుడు
     

Advertisement
Advertisement