సిక్కుల నిరసన.. ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

సిక్కుల నిరసన.. ఉద్రిక్తత

Published Tue, Oct 8 2013 1:30 AM

Sikh agitations

హైదరాబాద్, న్యూస్‌లైన్:  విజయనగరంలోని ఓ గురుద్వారాపై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం నాంపల్లి గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నగరానికి చెందిన సిక్కులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కోవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీ ఉపాధ్యక్షుడు వేద కుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సిక్కు మతపెద్దలతో పాటు తెలంగాణవాదులూ హాజరయ్యారు. అశోక్‌బాబు రాకపై పలువురు తెలంగాణవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
 
  సిక్కు మతపెద్దలు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు. అదే సమయంలో గురుద్వారాపై దాడి జరిగి రెండురోజులు కావస్తున్నా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఖండించలేదని కొందరు సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అశోక్‌బాబు ప్రసంగం ముగించి వెళుతుండగా జై తెలంగాణ నినాదాలు చేసిన తెలంగాణవాదులు, సిక్కుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు. నిరసన కార్యక్రమంలో కోవా ప్రతినిధులు, గురుద్వార శిక్షాని బరమ్‌బాల అధ్యక్షుడు హర్భజన్ సింగ్, సంయుక్త కార్యదర్శి ఇక్బాల్ సింగ్ తదితర సిక్కు మతపెద్దలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement