Sakshi News home page

గుట్టు రట్టు

Published Thu, Oct 9 2014 12:49 AM

గుట్టు రట్టు

ఆత్మకూరు రూరల్
 అధికారులు, అధికార పార్టీ నేతల అండదండలతో స్వయం సహాయక సంఘాల నాయకులు అక్రమాలకు తెరలేపారు. సభ్యులందరికీ మంజూరైన నిధులను కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఎగనామం పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాల్సిన ఐకేపీ కార్యాలయం అక్రమార్కులకు అడ్డాగా మారింది. గుట్టుగా సాగుతున్న వీరి అవినీతి బాగోతం సమాచార హక్కు చట్టంతో రట్టు అయింది. వెంటనే బాధితులు అక్రమార్కులపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారులు, గ్రామైక్య సంఘ లీడర్లు కేసును నీరుగార్చేందుకు బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామంలో భవానీ, అపరంజీ, సమీర అనే మూడు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. దళిత, గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా దళిత, గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గ్రామంలోనీ భవానీ గ్రామైక్య సంఘంలో  34 మందికి రూ.10.50 లక్షలు మంజూరయ్యాయి. అయితే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు సరళమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు అధికారులతో కుమ్మక్కై లబ్ధిదారులకు ఆ రుణాలు ఇవ్వకుండా తమకు అనుకూలమైన వారికి కొంతమేర రుణాలు అందజేశారు.

రూ.40 వేలు వచ్చిన వారికి రూ.20 వేలు, రూ.30 వేలు వచ్చిన వారికి రూ.15 వేల చొప్పున కేవలం 14 మందికి మాత్రమే ఇచ్చారు. అయితే రికార్డుల్లో, బాండు పేపర్లలో మాత్రం లబ్ధిదారులకు మాత్రమే రుణాలు ఇచ్చినట్లు రాసుకున్నారు. రుణాల విషయాలను నిలదీసిన వారికి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రూ.10 వేల చొప్పున ఇద్దరికి ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో కొందరికి మాత్రమే రుణాలు రావడంతో కొన్ని సందర్భాల్లో రుణాల విషయాలను తమకు తెలపాలంటూ అధికారులను, గ్రామైక్య సంఘాల లీడర్లను, సభ్యులను అడిగినా వారు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు సమాచార హక్కు చట్టంతో అక్రమాలను బయటకు తీశారు.

వెంటనే తమకు న్యాయం చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అక్రమాలు బయట పడడంతో అవినీతికి పాల్పడిన గ్రామైక్య సంఘ లీడర్లు, సంబంధిత అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో వారు కేసును నీరుగార్చేందుకు బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులు నరసింహుడు, బాలనాగమ్మ, మహానంది, సామేలు, శేఖర్, ప్రభుదాసు, పక్కీరయ్య, జయపాల్, నాగేశ్వరరావు అక్రమార్కులపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సమాచార హక్కు చట్టం లేకుంటే తమను పట్టించుకునే వారు కాదని, ఆ నిధుల గురించి తెలిసేది కాదని బాధితులు వాపోతున్నారు. ఇవే కాకుండా గ్రామంలోని మూడు గ్రామైక్య సంఘాల్లో అభయహస్తం, ఆమ్‌ఆద్మీ, విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, జీవనోపాదుల కింద గొర్రెలు, బర్రెల కోసం మంజూరు చేసిన నిధులలో దాదాపు రూ.40 లక్షల మేర అవినీతి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అందువల్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన గ్రామైక్య, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

 అక్రమార్కులకు అధికార టీడీపీ అండ
 గ్రామంలో అక్రమార్కులకు, అధికారులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో వారిని ఎదురించేందుకు ఎవ్వరూ సాహసించడంలేదు. ఫలితంగా వచ్చిన డబ్బునంతా నేతలు, వారి బంధువులు, అధికారులు మాత్రమే పంచుకుంటున్నారు. ఈ విధంగా వారి అక్రమాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరానికి గ్రామైక్య, గ్రూపు లీడర్ల మార్పు జరగాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. గ్రామైక్య సంఘ లీడర్లుగా వారే గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. గతంలో మాజీ మంత్రి ఏరాసు అనుచరులుగా, ప్రస్తుతం శిల్పా అనుచరులుగా ఉంటున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

 రుణాలతో వడ్డీ వ్యాపారం
 బ్యాంకుల ద్వారా, జీవనోపాదుల కింద, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, ఐకేపీ ప్రత్యేక నిధులు మంజూరైతే అటు గ్రామైక్య సంఘ లీడర్లు, ఇటు అధికారులు కొందరికి మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా వీరు అక్రమంగా సంపాదిస్తూ అందరికీ అన్యాయం చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.

జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్న బాధితులు
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా  బాధితులకు న్యాయం జరగడంలేదు. నాలుగు రోజులుగా విచారిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement