హైకోర్టు ఆదేశాలతో హైరానా | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలతో హైరానా

Published Sat, Nov 10 2018 6:50 AM

SIT Officials Tension On Murder Attempt On YS Jagan Case Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిట్‌ అధికారుల్లో హడావుడి మొదలైంది. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో గత నెల 25న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి హైకోర్టులో వేసిన రిట్‌ పిటీషన్లపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇప్పటివరకు సాగిన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టును సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో సిట్‌ అధికారులు హైరానా పడుతున్నారు. మధ్యాహ్నం వరకు సిట్‌ కార్యాలయం వైపు కన్నెత్తి చూడని అధికారులు సాయంత్రం సిట్‌ చీఫ్‌ బీవీఎస్‌ నాగేశ్వరరావుతో సహా కార్యాలయానికి చేరుకుని దర్యాప్తు రిపోర్టు తయారీ పనిలో నిమగ్నమయ్యారు. ఓ వైపు విచారణను కొనసాగిస్తూనే మరో వైపు ఇప్పటివరకు సాగిన దర్యాప్తుపై ఓ నివేదికను తయారు చేసి హైకోర్టు ముందుంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 72 మందిని విచారించారు. పదివేలకు పైగా కాల్‌ డేటాలో 321 మందితో మాట్లాడినట్టుగా నిర్థారించిన సిట్‌ అధికారులు వారి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేసే పనిలో పడ్డారు.

మేజిస్ట్రేట్‌ సమక్షంలో సాక్షుల వాంగ్మూలానికి పిటిషన్‌ : మరోవైపు సీఆర్‌పీసీ 160 కింద ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా సిట్‌ విచారణ తీరును నిరసిస్తూ వాంగ్మూలం ఇచ్చేందుకు ప్రత్యక్ష సాక్షులు ముందుకు రాలేదు. మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం నమోదు చేసేందుకు వీలుగా సీఆర్‌పీసీ 164 కింద కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు పిటీషన్‌ వేశారు. 13 మంది ప్రత్యక్ష సాక్షులతో పాటు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మరో 20మంది కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా మేజిస్ట్రేట్‌ సమక్షంలో సేకరించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. వారికి కూడా కోర్టు అనుమతితో సీఆర్‌సీపీ 164 కింద నోటీసులు జారీ చేయనున్నారు.

నిందితుని తరఫున పిటిషన్లు తోసిపుచ్చిన కోర్టు : నిందితుని మానసిక పరిస్థితి బాగాలేదని, మానసిక వైద్యులతో పరీక్ష చేయించేందుకు అనుమతి కోరుతూ నిందితుని తరఫున సీఆర్‌పీసీ 328 కింద న్యాయవాది సలీం వేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. నిందితుడే స్వయంగా వేస్తే పరిశీలిస్తాం తప్ప అతని తరఫున ఎవరు వేసినా పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. అలాగే వారం రోజుల పాటు కస్టడీ పొడిగింపు కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఏ కేసులోనైనా తొలి 14రోజుల రిమాండ్‌ సమయంలోనే పోలీస్‌ కస్టడీకి ఇస్తారు. తొలి రిమాండ్‌ గడువు ముగిసిన తర్వాత రిమాండ్‌ పొడిగిస్తారే తప్ప మళ్లీ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉండవు.

అంతటా ఉత్కంఠ
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో అటు హైకోర్టు.. ఇటు జిల్లా కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు జిల్లావాసుల్లో ఉత్కంఠను రేపాయి. బాధితుడు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తరఫున వేసిన పిటీషన్లు హైకోర్టులో విచారణకు రాగా.. ఇటు రిమాండ్‌ ముగియడంతో నిందితుడిని జిల్లా కోర్టులో హాజరు పరచడం, బెయిల్‌ పిటీషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్సుకత నెలకొంది. ప్రజలు టీవీలకు అతుక్కుపోవడమే కాదు.. ఏ నలుగురు కలిసినా ఈ కేసులో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? జిల్లాకోర్టులో మళ్లీ కస్టడీకి అప్పగిస్తారా? బెయిల్‌ పిటీషన్‌ ఏమవుతుందో అనే ఆత్రుత కన్పించింది.

బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ?
జ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు ముగియడంతో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును శుక్రవారం విశాఖ మూడో మెట్రో పాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట హాజరు పర్చారు. ఉదయం 11 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు పోలీసులు నిందితుడిని భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకురాగా, కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నిందితుడి తరపున న్యాయవాది అబ్దుల్‌ సలీం దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌ను జిల్లా కోర్టు నుంచి మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు.అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బీవీఎన్‌ జయలక్ష్మి నోటీసులు తీసుకున్నారు. ఈ పిటీషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు తాము జరిపిన విచారణ నివేదికను బెయిల్‌ పిటీషన్‌కు సంబంధించి ఏపీపీకి అందజేయాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement