స్పందిస్తారా? | Sakshi
Sakshi News home page

స్పందిస్తారా?

Published Sun, Aug 10 2014 2:49 AM

స్పందిస్తారా? - Sakshi

సాక్షి, ప్రతినిధి, ఒంగోలు : రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఎట్టకేలకు ఆదివారం ఒంగోలు రానుంది. ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమాజ వేదిక నేతలు, ప్రజలతో సమావేశం అవుతుంది.

ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించేందుకు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు సన్నద్ధమవుతున్నారు.  ఈ కమిటీ ప్రతినిధులు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్తపట్నంలోని వాన్‌పిక్ భూములు, దొనకొండలోని ప్రభుత్వ భూములను సందర్శిస్తారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి రావడం వల్ల ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఈ కమిటీ ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా రాష్ట్రానికి కేటాయించిన 11 జాతీయ సంస్థల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  
 
 రాజధాని నిర్మాణానికి జిల్లాలో ఉన్న అనుకూలతలివీ..
* జిల్లాలోని దొనకొండ దగ్గర మొత్తం 54,483 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో 34 వేల ఎకరాలు యధాతథంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 వేల ఎకరాలు అటవీ భూమి. దీన్ని డీ-నోటిఫై చేస్తే సరిపోతుంది.
* దొనకొండకు పది కిలోమీటర్ల దూరంలోనే సాగర్ కాలువ ప్రవహిస్తుండటంతో, ఇక్కడ తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదు.
* దొనకొండలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 1939వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ సమాచార వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. అయితే మిగిలిన భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.
 
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ఇంధనం నింపుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించారు. ఇటీవల ఈ శిథిల భవనానికి కంచె కూడా వేశారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఆధీనంలో 136 ఎకరాల భూములున్నాయి. శిథిల భవనాలను వాడుకలోకి తీసుకురావడంతో పాటు, ఈ భూములను అభివృద్ధి చేస్తే విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుంది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే.
 
* దొనకొండ  ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
* ఈ ప్రాంతం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో ఉన్నా రాజధాని నిర్మాణంపై ఆయన స్పందించలేదు.
* ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకుని ఢిల్లీలో ఈ కమిటీని కలిసి ప్రకాశం జిల్లా పర్యటనకు రావాలని కోరడం, రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతుండటంతో దొనకొండను రాజధానిని చేయాలంటూ మంత్రివర్యులు ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా రాజధానిని ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని జిల్లా ప్రజలు తమ వాదన వినిపించనున్నారు.
 
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల పర్యటన సాగేదిలా..
ఒంగోలు టౌన్: శివరామకృష్ణ కమిటీ సభ్యులు ఆదివారం జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ శనివారం తెలిపారు. కమిటీ సభ్యుల పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు.
 
* ఉదయం 10 గంటలకు ఒంగోలు చేరుకుంటారు.
* 10.30 గంటలకు స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సమావేశమవుతారు.
* 11.30 గంటలకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సివిల్ సొసైటీస్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
* మధ్యాహ్నం 12 గంటలకు సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు.
* 12.30 గంటలకు కొత్తపట్నంలోని వాన్‌పిక్ భూములను కమిటీ పరిశీలిస్తుంది.
* 1.30 నుంచి 2.30 గంటల వరకు స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథిగృహంలో లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
* 2.30 గంటలకు దొనకొండకు ఒంగోలు నుంచి బయలుదేరతారు.
* సాయంత్రం 4 గంటలకు దొనకొండలోని భూములను పరిశీలిస్తారు.
* 5 గంటలకు అక్కడ నుంచి కడపకు వెళతారు.

Advertisement
Advertisement