అందరికీ ‘రీచ్‌’ అయ్యేలా!

20 Sep, 2019 12:44 IST|Sakshi
శనగపాడు రీచ్‌ వద్ద ఇసుక లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

అందుబాటులో ఇసుక

ప్రస్తుతం అందుబాటులో ఆరు ఇసుక రీచ్‌లు

వరద తగ్గితే మరో పది రీచ్‌లకు అనుమతి

త్వరలో పట్టణాల్లోనూ స్టాక్‌ పాయింట్ల ఏర్పాటుకు సన్నాహాలు

సాక్షి, మచిలీపట్నం: ఇసుక కష్టాలకు ఇక చెక్‌ పడనుంది. కృష్ణా నది వరద కారణంగా నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చినా.. రీచ్‌ల నుంచి ఇసుకను తరలించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు రీచ్‌లను తెరచినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో రెండు రీచ్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇసుక కొరత వేధిస్తోంది. రీచ్‌ల్లోకి వరదనీరు చేరడంతో గడిచిన 15 రోజులుగా డిమాండ్‌ మేరకు ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి అనుకూలిస్తుండటంతో ఇప్పటికే తెరచిన ఆరు రీచ్‌లకు తోడు మరో పది రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

గతంలో లూటీ..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితం మాటున ఇసుకాసురులు లూటీ చేసారు. సరిహద్దులు దాటించి ఇష్టమొచ్చిన రీతిలో అమ్మకాలు సాగించి కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. కొత్త ఇసుక పాలసీతో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు కళ్లెం వేశారు. కొత్త పాలసీ ప్రకారం ప్రస్తుతం జిల్లాలో కంచెల, కాసరబాద, శనగపాడు, చెవిటికల్లు, శ్రీకాకుళం, తోట్లవల్లూరు రీచ్‌లను ఈ నెల 5వ తేదీన ప్రారంభించారు. కానీ వరదల కారణంగా నాలుగు రీచ్‌లు ప్రారంభించిన ఒకటి రెండు రోజుల్లోనే ఆపాల్సిన వచ్చింది. ప్రస్తుతం కంచెల, శనగపాడు రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు సాగు తున్నాయి.

కొత్తగా అందుబాటులోకి 10 రీచ్‌లు
వరదలు తగ్గుముఖం పడితే మిగిలిన నాలుగు రీచ్‌లతో పాటు మరో పది రీచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వీటిలో ప్రధానంగా కంచికచర్ల మండలం మున్నలూరు, కునికెనపాడు, చందర్లపాడు మండలం ఏటూరు, ఉస్తేపల్లి, పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం, శనగపాడు–2, కంకిపాడు మండలం మద్దూరు–1, 2, పమిడిముక్కల మండలం లంకపల్లి– 1, 2 రీచ్‌ల్లో తవ్వకాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

కావల్సినంత ఇసుక..
జిల్లాలో ఏటా పదిలక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం ఉంది. ప్రస్తుతం కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా నదీపరివాహక ప్రాంతంలో లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక పేరుకుపోయింది. ప్రస్తుతం జిల్లా డిమాండ్‌కు మించే ఇసుక అందుబాటులో ఉంది. కనీసం మరో ఐదారేళ్ల అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం వెలికి తీసేందుకు సానుకూల పరిస్థితులు లేకపోవడం వల్లే ఇసుక కొరత నెలకొందని వివరిస్తున్నారు. వరద నీరు కాస్త తెరిపినిస్తే రీచ్‌లు çపూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కావాల్సిన వారికి కావాల్సినంత ఇసుక సరఫరా చేసే అవకాశం ఉంది. 

ఇంటికే ఇసుక..
ప్రస్తుతం రీచ్‌ల వద్దే స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేయగా, భవిష్యత్‌లో విజయవాడతో సహా ప్రధాన పట్టణాల్లో స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. అదే కనుక జరిగితే ఇసుక కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఇలా బుక్‌ చేయగానే అలా ఇంటికి చేరుతుంది.

ఇసుక కొరత రానీయం
జిల్లాలో ఇసుక కొరత రానీయం. డిమాండ్‌ మేరకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని రీచ్‌లను కూడా తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. సామాన్యులకు సైతం చౌకగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆలోచన. భవిష్యత్‌లో స్టాక్‌ యార్డులు పెంచే ఆలోచనలో ఉన్నాం.
– సుబ్రహ్మణ్యం, ఏడీ, మైనింగ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా