సౌదీలో చిక్కుకుపోయిన పదహారు మంది | Sakshi
Sakshi News home page

సౌదీలో చిక్కుకుపోయిన పదహారు మంది

Published Wed, Nov 13 2013 6:20 AM

Sixteen people Trapped in Saudi Arabia

వేములవాడ, న్యూస్‌లైన్ : ఎడారి దేశంలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లినవారు అక్కడి ఓ కంపెనీ వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఒప్పంద గడువు ముగిసినా వీరిని వదలకుండా పనులు చేయించిన కంపెనీ ఇప్పుడు స్వదేశానికి  వెళ్లాలంటే ఒక్కొక ్కరు రూ. 20 వేల చొప్పున చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. మరోచోట పనిచేసే వీల్లేక, తిరిగివచ్చేందుకు డబ్బులేక బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌదీ అరేబియాలోని జిద్దాన్ బల్దియాలో పనిచేసేందుకు యువకులు కావాలన్న ప్రకటనతో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు చెం దిన 16 మంది యువకులు ఒక్కొక్కరు రూ. లక్షకు పైగా చెల్లించి ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా వెళ్లారు. తీరా అక్కడికి చేరుకున్నాక అసలు విషయం తెలిసి కంగు తిన్నారు.
 
 ఒకచోట పని కల్పిస్తామని చెప్పిన కంపెనీవారు మరోచోట పనికి కుదిర్చారు. ఉత్తచేతులతో తిరిగి వెళ్తే అప్పులు తీర్చడం ఎలా అని కంపెనీవారు చూపిన పనులు చేశారు. గతేడాది డిసెంబర్‌లో వీరి ఒప్పంద గడువు ముగిసింది.  ఇక తామే  వెళ్తామని కంపెనీకి చెప్పడంతో ఇంకా కొద్ది రోజులు పనిచేయాలని కంపెనీ కోరింది. అలా రెండు నెలల క్రితం వరకు పని చేయించుకుని ఇక పనులు చూపడం మానేసింది. కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. ఆ మొత్తం ఇవ్వకపోవడంతో పాటు కార్మికులు ఒక్కక్కరు రూ. 20వేల చొప్పున కంపెనీకి కడితేనే అక్కడినుంచి పంపిస్తామని వేధింపులకు గురి చేస్తోంది. బాధితుల్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన బాల్‌సింగ్, గోపాల్, గంగారాం, జలేందర్, రామ్‌సింగ్ తదితరులున్నారు. వీరంతా జిద్దాన్‌లోలో చెట్ల కింద తలదాచుకుంటున్నామని, రోడ్డుపై తిరిగితే అక్కడి పోలీసులు అకామా కోసం ప్రశ్నిస్తారన్న భయంతో ఎటూ కదలాలేక, ఆకలికి తాళలేకపోతున్నారని మారుపాకకు చెందిన కంది రాజయ్య ఫోన్‌లో చెప్పినట్టు ఆయన బంధువొకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రజాప్రతినిధులు స్పందించి తమ వారు స్వదేశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.

Advertisement
Advertisement