గిరిజన బిడ్డల పరిహారం పచ్చనేతల ఫలహారం | Sakshi
Sakshi News home page

గిరిజన బిడ్డల పరిహారం పచ్చనేతల ఫలహారం

Published Tue, Mar 13 2018 4:20 AM

Sketch of TDP key vleaders for Tribal lands scam - Sakshi

కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010 కోట్ల నుంచి రూ. 58,319 కోట్లకు పెంచేశారు... అందులో భూసేకరణ పరిహారం సహాయ పునరావాసానికే రూ. 33,858 కోట్లు అంటున్నారు.. పరిహారం పెంచి గిరిజనులకు మేలు చేస్తున్నారనుకుంటే మనం పొరబడినట్లే.. వారి పొట్టకొట్టి పరిహారం మొత్తాన్ని ‘పచ్చ’చొక్కాలే పంచుకుతింటున్నాయి. తెలుగుదేశం ముఖ్యనేత కనుసన్నల్లో బినామీలు, బడానాయకులు.. ఉన్నతాధికారులు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు..  రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. లేని భూమి ఉన్నట్లుగా రికార్డులు సృష్టించారు.. గిరిజనుల భూములు గిరిజనేతరులవిగా మాయచేశారు.. చెరువులు, వాగులు, వంకలు, చివరకు రహదారులను కూడా సాగుభూములుగా పట్టాలు సృష్టించారు. గిరిజనులకు పూర్తిగా అన్యాయం చేశారు. 1/70 చట్టాన్ని అవహేళన చేశారు. ఊళ్లపై బంది పోటు ముఠాలు పడి దోచుకుతిన్నట్లుగా టీడీపీ నాయకులు గిరిజన గ్రామాలపై పడి అరాచకం సృష్టించారు..  పరిహారం కొట్టేయడానికి ఎన్ని మాయలు చేశారో సాక్ష్యాధారాలతో సహా ‘సాక్షి’ వెలికితీసింది. 
– సాక్షి, అమరావతి

(పోలవరం ముంపు గ్రామాల నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు) : రాష్ట్రంలో విలీనమైన పోలవరం ముంపు మండలాల్లో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. లేని భూమిని ఉన్నట్లుగా రికార్డులు సృష్టించారు. గిరిజనుల భూములను గిరిజనేతరులకు చెందినట్లుగా మాయ చేశారు. చెరువులు, వాగులు, వంకలు, చివరకు గ్రామీణ రహదారులను కూడా వదలకుండా అవన్నీ సాగు భూములేనంటూ పట్టాలు సృష్టించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ (డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌–డీఎన్‌)కూ పరిహారం మంజూరు (అవార్డు) జాబితాకూ పొంతనే లేదు. ఫోర్జరీ రికార్డుల ఆధారంగా భూసేకరణ చేసి పరిహారాన్ని కాజేస్తున్నారు. గతంలో సేకరించిన భూములను మళ్లీ కొత్తగా సేకరించినట్లుగా రికార్డులను ఫోర్జరీ చేశారు. ఇప్పుడా భూములను మళ్లీ సేకరించి పరిహారాన్ని కాజేస్తున్నారు. రాష్ట్రం నుంచి దుర్భిక్షాన్ని తరిమికొట్టేందుకు గిరిజనులు చేసిన త్యాగాల పునాదులపై టీడీపీ నేతలు అక్రమార్జనకు వేసుకున్న రాచబాట ఇది.

టీడీపీ ముఖ్యనేతల కనుసన్నల్లో ఉన్నతాధికారుల వెన్నుదన్నుతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన అధికార పార్టీ నేతలు.. బినామీలను ముందు పెట్టి ఇప్పటికే కోట్లు కొల్లగొట్టారు. గిరిజనుల జీవితాలను అంధకారమయం చేసి.. వారికి దక్కాల్సిన వేలాది కోట్ల రూపాయాలను కాజేసేందుకు స్కెచ్‌ వేశారు. ఈ దోపిడీకి పోలవరం ప్రాజెక్టు వేదికైంది. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా భాసిల్లేలా చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గోదావరిపై 194.6 టీఎంసీల సామర్థ్యంతో 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టులో 287 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 1,05,601 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారు. 1,39,859.68 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. కుడి, ఎడమ కాలువల తవ్వకానికి, హెడ్‌ వర్క్స్‌ నిర్మాణానికి, ముంపునకు గురయ్యే భూమితో కలిపి 1,61,857.01 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో సుమారు లక్ష ఎకరాలకుపైగా భూమిని 2014కు ముందే ప్రభుత్వం సేకరించింది. కానీ.. అప్పట్లో సేకరించిన భూముల లెక్కలను తారుమారు చేశారు. 

నోటిఫికేషన్‌లో ఒకలా.. డిక్లరేషన్‌లో మరోలా.. 
పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ఏడు మండలాల పరిధిలోని గ్రామాలను తెలంగాణ నుంచి ఏపీలోకి 2014లో కేంద్రం విలీనం చేసింది. అదే సమయంలో టీడీపీ కీలక నేతల దన్నుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు దోపిడీకి స్కెచ్‌ వేశారు. ముంపు మండలాల్లో తమకు అనుకూలురైన తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను నియమించుకుని.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. ఫోర్జరీ చేసిన రికార్డుల ఆధారంగానే భూములను సేకరించి పరిహారాన్ని కాజేయడానికి పథకం వేశారు. అక్రమాలు బహిర్గతం కాకుండా చేసే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించారు. అసలైన రికార్డుల ఆధారంగా భూసేకరణ చేయడానికి డీఎన్‌ను జారీచేసిన అధికారులు, వాటిని ఖరారు చేసేందుకు జారీచేసే డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ (డీడీ)లో మాత్రం ఫోర్జీరీ రికార్డులను ఆధారం చేసుకున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని నష్టపరిహారం చెల్లించారు. తమ బినామీలను ముందు పెట్టి.. వారి పేర్లతోనే పరిహారం నిధులను మంజూరు చేయించి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో భూ బదలాయింపు నిషేధ చట్టం (ఎల్‌టీఆర్‌)–1970ను తుంగలో తొక్కారు. గిరిజనుల భూములను గిరిజనేతరులకు చెందినట్లుగా చూపి పరిహారం మంజూరు చేయడం గమనార్హం. ఇప్పటివరకూ 1,02,480.90 ఎకరాలను సేకరించినట్లు చెబుతున్న సర్కార్‌.. పరిహారం రూపంలో రూ.4,922.6 కోట్లను మంజూరు చేసినట్లు ప్రకటించింది. ఇందులో అధిక శాతం నిధులను గిరిజనుల పొట్టకొట్టి బినామీ పేర్లతో టీడీపీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు స్వాహా చేశారు. ఈ బాగోతంలో ఒక జూనియర్‌ ఐఏఎస్‌.. మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు, స్థానిక రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఫోర్జరీలో ‘రికార్డు’లు 
అధికార పార్టీ కీలక నేత సారథ్యంలో.. ఉన్నతాధికారుల నేతృత్వంలో కుకునూరు మండలంలో టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను తిరగరాశారు. అసైన్డు భూములను పట్టా భూములుగానూ.. లేని భూమిని ఉన్నట్లుగానూ.. చెరువులు, కుంటలు, వాగులు వంకలు, రహదారి ఉన్న భూములను సైతం సాగు భూములుగా  చిత్రీకరించి పరిహారం రూపంలో రూ.140 కోట్లకు పైగా స్వాహా చేశారు. ఒక్క ఉప్పేరులోనే రూ.20 కోట్లకు పైగా కాజేశారు.  

సేకరించిన భూమినే మళ్లీ సేకరించి.. 
ముంపు గ్రామాల్లో గతంలో సేకరించిన భూమి ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టు పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ.. 2014 తర్వాత రికార్డులను తారుమారు చేశారు. ఆ భూమిని సేకరించనట్లుగా చూపారు. దాన్ని కొత్తగా సేకరించాలని ప్రతిపాదించి.. పరిహారాన్ని కాజేశారు. వేలేరుపాడు మండలంలో గతంలో సేకరించిన 500 ఎకరాలకు పైగా భూమిని మళ్లీ సేకరించినట్లు చూపి రూ.50 కోట్లకు పైగా కొల్లగొట్టారు.

అందుకు సాక్ష్యాలు ఇవిగో.. 
- వేలేరుపాడు మండలం కాచారంలో సర్వే నెంబరు 26లో 3.22 ఎకరాల భూమిని గతంలోనే సేకరించారు. ఈ భూమి ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టుకు చెందినట్లుగా రికార్డులు ఉన్నాయి. కానీ, రికార్డులను తారుమారు చేసి వాటిని సేకరించనట్లుగా చూపారు. తాజాగా ఆ భూమి ముగ్గురికి చెందినట్లుగా చూపి రూ.40.21 లక్షలను కాజేశారు. 
వేలేరుపాడు మండలం కొత్తూరులో సర్వే నెంబరు 45లో 4.59 ఎకరాల భూమిని గతంలోనే సేకరించారు. ఆ భూమి కూడా ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టుకు చెందినట్లుగా రికార్డులు ఉన్నాయి. కానీ.. వాటినీ తారుమారు చేసి ఆ భూమి ఇద్దరికి చెందినట్లుగా చూపి మళ్లీ సేకరించారు. రూ.51లక్షలను స్వాహా చేశారు.

గిరిజనుల పొట్ట కొట్టి.. 
భూ బదలాయింపు నిషేధ చట్టం–1970 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములను ఇతరుల పేర్లతో బదలాయింపు చేయకూడదు. కానీ, కొందరు రెవెన్యూ అధికారులు టీడీపీ నేతల పేర్లతో గిరిజనుల భూములను మార్చేసి పరిహారం ఇచ్చేశారు. అందుకూ ఆధారాలు ఇవే.. 
కుకునూరు మండలం వంజం వారి గుంపులో సర్వే నెంబరు 305లో 27.90 ఎకరాల భూమి ఉంది. ఇందులో 19 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఇందులో కుర్వాసి రాజులు అనే గిరిజనుడికి చెందిన ఐదు ఎకరాల భూమిని ఐత సురేష్‌కు చెందినట్లుగా చూపి రూ.54 లక్షలను కాజేశారు. సర్వే నెంబరు 229/6/1లో 2.07, 305/7లో 1.22 ఎకరాలు వెరసి 3.29 ఎకరాల భూమి తెల్లం గుజ్జయ్యకు ఉంది. ఈ భూమి పరిహారాన్ని కూడా కాజేశారు.  
కుకునూరు మండలం గుంపెనపల్లిలో సర్వే నెంబరు 24లో 12.24 ఎకరాల భూమి సూరి పురుషోత్తం అనే గిరిజనుడికి ఉన్నట్లు డీఎన్‌లో చూపారు. కానీ.. పరిహారం మంజూరుకు వచ్చేసరికి సూరి పురుషోత్తంకు కేవలం 5.15 ఎకరాలే ఉన్నట్లు చూపి మిగిలిన 7.09 ఎకరాల భూమికి చెందిన రూ.76.98 లక్షలను నలుగురి పేర్లతో కాజేశారు. 
వింజరంలో 131 సర్వే నెంబరులో రూ.138.17 ఎకరాల భూమి ఉంటే.. 195 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించి రూ.5.02 కోట్లను స్వాహా చేశారు. సీతారామనగరంలోని మరో సర్వే నెంబరులో 129 ఎకరాల భూమి ఉంటే.. 165 ఎకరాల ఉన్నట్లు రికార్డులను ఫోర్జరీ చేసి పరిహారం రూపంలో రూ.3.97 కోట్లను మింగేశారు. 

ఇదే మండలం ఇబ్రహీంపేటలో సర్వే నెంబరు 35/2లో జెల్ల లక్ష్మయ్యకు 1.04 ఎకరాల భూమి ఉన్నట్లు డీఎన్‌లో ప్రకటించిన అధికారులు.. పరిహారం మంజూరు చేసేటపుడు మాత్రం ఎల్లంకి వెంకటరత్నంకు ఆ సర్వే నెంబరులో 2.21 ఎకరాలు ఉన్నట్లు చూపి రూ.26.51 లక్షలను జేబులో వేసుకున్నారు. 

కౌలుకు తీసుకుని మోసం చేశారు  
నాకు ఉన్న ఐదు ఎకరాల భూమిని ఐత సురేష్‌కు కౌలుకు ఇచ్చిన. జామాయిల్‌ పంట వేశాడు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నా భూమిని ప్రభుత్వం సేకరించింది. కానీ, పట్టాదారుడైన నాకు పరిహారం ఇవ్వలేదు. ఐత సురేష్‌కు పరిహారం మంజూరు చేసి నా పొట్ట కొట్టారు. రెవెన్యూ అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై నాకు అన్యాయం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. 
– తెల్లం గుజ్జయ్య, గిరిజనుడు, వంజం వారి గుంపు 

ఉప్పేరులో సర్వే నెంబరు 16లో 0.34, సర్వే నెంబరు 17లో 0.33, సర్వే నెంబరు 18లో 0.32, సర్వే నెంబరు 19లో 1.24 ఎకరాల చొప్పున ఉన్న అసైన్డ్‌ భూమిని పోలవరం ప్రాజెక్టు కోసం సేకరిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన (పీఎన్‌) ఇచ్చారు. కానీ, పరిహారం మంజూరు (అవార్డు) చేసేటప్పుడు మాత్రం సర్వే నెంబరు 16లో 23.01, సర్వే నెంబరు 17లో 15.4, సర్వే నెంబరు 18లో 3.38 ఎకరాలు, సర్వే నెంబరు 19లో 5.02 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు చూపి, 14 మంది పేర్లతో రూ.5.07 కోట్ల పరిహారాన్ని స్వాహా చేశారు.  


గణపవరంలో సర్వే నెంబరు 17లో 35.21 ఎకరాల భూమి ఉంది. ఇందులో 30.11 ఎకరాలు ప్రభుత్వ భూమే. కానీ.. 17/1లో 5, 17/1/1లో 4.20 వెరసి 9.20 ఎకరాలు కాకర్ల కొమరయ్యకు ఉన్నట్లు పట్టా సృష్టించారు. సర్వే నెంబరు 17/2లో నాలుగు ఎకరాల భూమి తోట పున్నయ్యకు ఉన్నట్లు రికార్డులు తయారుచేశారు. ఆ ఇద్దరి పేర్లతో భూమి లేకపోయినా 13.20 ఎకరాల ఉన్నట్లు సృష్టించి రూ.52.50 లక్షలు స్వాహా చేశారు. పెదరావిగూడెంలో సర్వే నెంబరు 211లో 0.32 ఎకరాల విస్తీర్ణంలో కుంట ఉంది. కానీ, ఆ సర్వే నెంబరులో గణప రమణయ్యకు 1.11 ఎకరాల ఉన్నట్లు చూపి రూ.13.38 లక్షలు, అగ్నిపర్తి నాగయ్యకు 0.32 ఎకరాల ఉన్నట్లు చూపి రూ.8.4 లక్షలు స్వాహా చేశారు.  

కుటుంబాన్ని రోడ్డున వేశారు  
మా కుటుంబానికి ఉన్న 3.29 ఎకరాల పొలాన్ని ఐత సురేష్‌కు కౌలుకు ఇచ్చిన. జామాయిల్‌ పంట వేశాడు. పోలవరం ప్రాజెక్టులో మా భూమి ముంపునకు గురౌతుందని అధికారులు చెప్పారు. పరిహారం మంజూరైతే మరోచోట పొలం కొనుక్కుని బతుకుదామని ఆశ పెట్టుకున్నాం. కానీ.. పరిహారాన్ని ఐత సురేష్‌కు మంజూరు చేసి మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఐటీడీఏ అధికారులకు, తహసీల్దార్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు.
– మిచ్చి రాజులు కుటుంబం, వంజం వారి గుంపు 

రికార్డులు తారుమారు చేసి పొట్టకొట్టారు
కుకునూరు మండలం ఉప్పేరు పంచాయతీ పరిధిలోని ఆంబోతులగూడెంలో సర్వే నెంబర్‌ 80, 85, 91లలో నా తండ్రి ఇల్లంగి ఇమాన్యుయేలుకు  12.09ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్‌ 80లో ఉన్న 3.13 ఎకరాల భూమి వివాదంలో ఉందని చూపారు. సర్వే నెంబర్‌ 85లో ఉన్న 4.27 ఎకరాల భూమి నా పేరుపై ఉన్నట్లు చూపారు. సర్వే నెంబర్‌ 91లో భూమి లేదన్నారు. కోర్టులో కేసు వేస్తే భూసేకరణ అధికారివద్ద తేల్చుకోవాలని సూచించింది. అక్కడా అన్యా యం చేశారు. నాకు దక్కాల్సిన రూ.90 లక్షల పరిహారాన్ని కాజేశారు. 
– ఇల్లంగి పుల్లారావు, ఆంబోతులగూడెం, కుకునూరు మండలం 

గిరిజనులను ముంచేశారు  
పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో రెవెన్యూ అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై గిరిజనులకు తీరని ద్రోహం చేశారు. రికార్డులను తారుమారు చేసి.. గిరిజనేతరులకు పరిహారం ఇచ్చి, గిరిజనులను ముంచేశారు. గతంలో సేకరించిన భూము లనే మళ్లీ సేకరించి పరిహారం కాజేశారు. భూసేకరణలో అక్రమాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరినా స్పందించలేదు.             
 – ఎస్కే గౌస్‌ పాషా, మండల కార్యదర్శి, సీపీఎంఎల్‌ న్యూడెమొక్రసీ 

Advertisement
Advertisement