నినాదాలతో హోరెత్తిన సాగరం | Sakshi
Sakshi News home page

నినాదాలతో హోరెత్తిన సాగరం

Published Sun, Sep 22 2013 1:47 AM

Slogans blustery ocean

 సాగర ఘోషతో నిరంతరం హోరెత్తే ఆర్కే బీచ్‌ను శనివారం జన సాగరం ముంచెత్తింది. వేలాదిగా తరలి వచ్చిన సమైక్యవాదులతో హోరెత్తింది. రాజకీయేతర ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య గర్జన విజయవంతమయింది. జనమంతా ముక్తకంఠంతో సమైక్యాంధ్ర కోసం నినదించారు. రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్న నేతల తీరును ఎండగట్టారు. పదవులు వీడకుండా నడి వీధుల్లో తిరిగితే సముద్రంలో కలిపేస్తామంటూ హెచ్చరించారు.
 
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సాగరతీరం శనివారం హోరెత్తి పోయింది. రాజకీయ నాయకులు రాజీనామాలు చేయకుండా నడి వీధుల్లో తిరిగితే సముద్రంలో కలిపేస్తామంటూ సమైక్యవా దులు హెచ్చరించారు. నాలుగు మాసాల అధికార దాహం కోసం శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావొద్దని హితవు పలికారు. మాట్లాడిన ప్రతి ఒక్కరూ.. యూపీఏ ప్రభుత్వ తీరును, కేసీఆర్ దోపిడీ తనాన్ని, సీమాంధ్ర నేతల చేతకాని తనాన్ని తూర్పారబట్టారు. 8వ తరగతి చదువుతున్న హేమమాలిని రాజకీయ నేతల తీరును ఎండగట్టింది.

తన ప్రసంగం, కవితలతో ఆహూతుల్లో ఉద్యమాగ్ని రగిలించింది. అప్పటి వరకు లేని మంత్రి గంటా శ్రీనివాసరావు ఫ్లెక్సీని సభ జరుగుతున్న సమయంలో ఎదురుగా వేలాడదీయడంపై సమైక్యవాదులు మండిపడ్డారు. ఆ ఫ్లెక్సీని తొలగించేంత వరకు సభను జరగనీయలేదు. కొందరు సమైక్యవాదులు ఫ్లెక్సీ వేలాడదీసిన హోర్డింగ్‌పైకి ఎక్కి చించేంత వరకు శాంతించలేదు. ఇది జరుగుతున్న సమయంలోనే దీన్ని ఏర్పాటు చేసిన కాశీ అసోసియేట్స్ ప్రతినిధి కాశీనాథ్ సభ  నుంచి జారుకున్నారు.

 నేతల తీరును ఎండగట్టారు

 సభలో ప్రసంగించిన వారంతా రెండు అంశాలపైనే దృష్టి సారించారు. ఒకటి సమైక్య వాదమైతే..రెండోది రాజకీయ నేతల బూటకపు రాజీనామాలు. రాజకీయ నేతల చేతకాని తనం వల్లే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందని, పదవుల్ని పట్టుకుని వేళ్లాడుతున్న నేతలకు ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల వరకు అంతా సమైక్యాంధ్ర కోసం రోడ్డెక్కుతుంటే.. నేతలు మాత్రం రాజీనామాలు చేస్తే.. రాష్ట్రం విడిపోదన్న గ్యారంటీ ఇస్తే తక్షణమే రాజీనామాలిచ్చేస్తామంటూ.. అతి తెలివి ప్రదర్శిస్తున్నారని రెవెన్యూ సంఘ నేత బి.వెం కట్వేరరావు మండిపడ్డారు.

ఆర్టీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, నేతలంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశా రు. వెంటిలేటర్‌పైనున్న కేంద్ర ప్రభుత్వానికి సీమాంధ్రలో ఉన్న ఎంపీలంతా రాజీనామా చేస్తే తక్షణమే కూలిపోతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బదరీనాథ్ అన్నారు.
 
 కడుపు కట్టుకుని ఉద్యమం : జీతాల కోసమో.. అదనపు సౌకర్యాల కోసమో గతంలో ఎందరో.. ఎన్నిసార్లో ఉద్యమించారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టే కుహనా రాజకీయ నేతల విభజన కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమం జరగడం ఇదే తొలిసారేమో..! గత రెండు మాసాలుగా జీతాల్లేకపోయినా.. కడుపు కట్టుకుని ఉద్యమించిన వైనం ఏ చరిత్రా రాయనిది.. అంటూ ఉద్యోగ, కార్మిక సంఘాల సమ్మెను వక్తలు వేనోళ్ల పొగిడారు. అరకొర జీతాలతో నె ట్టుకొచ్చే ఆర్టీసీ కార్మికుల స్థైర్యాన్ని ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు అభినందించారు.

నిజాం కాలం తర్వాత నుంచి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో సీమాంధ్రుల పాత్రను విస్మరించి, కనీస సంప్రదింపుల్లేకుండా విభజనకు దిగడంపై ముస్లిం జేఏసీ నేత ఫరూకీధ్వజమెత్తారు.  సోనియా గాంధీకి తన కొడుకు రాహుల్ గాంధీని పీఎంగా చూడాలనుకుంటే.. తాము అదనపు స్థానాలు గెలిపిస్తాం తప్ప, విభజనకు దిగొద్దంటూ  ప్రయివేటు స్కూళ్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ఎన్.మూర్తి హితవు పలికారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించారు.
 
 మా అమ్మానాన్నలకు ఏమని చెప్పాలి?

 సిరిపురం : ‘మీరు చిన్న పిల్లలు. ఇప్పుడు బాగా చదువుకోవాలి. పెద్దయ్యాక హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగాలు చేయాలి. ఇంట్లో అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి’ అంటూ ఇంట్లో పెద్దోళ్లు మాకు ఎప్పుడూ మంచి మాటలు చెబుతారు. ఇప్పుడు హైదరాబాద్‌ను విడదీస్తున్నారు. మన సీమాంధ్రులను అక్కడి నుంచి దూరం చేస్తున్నారు. మరి మేం పెద్దయ్యాక హైదరాబాద్ ఎలా వెళ్లాలి. అక్కడ మాకు ఉద్యోగాలేం దొరుకుతాయి? మా పెద్దలకు, అమ్మానాన్నలకు ఏం సమాధానం చెప్పాలి.. అంటూ ప్రశ్నించింది ఎనిమిదేళ్ల హేమమాలిని.

విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన సమైక్య గర్జన సభలో ఈ చిన్నారి సమైక్యాంధ్ర ఉద్యమంలో తానూ భాగమేనంటూ ముందుకు వచ్చింది. ఆకట్టుకునే ప్రసంగంతో ఆవేదనగా మాట్లాడి అందరినీ కదిలించింది. ‘హైదరాబాద్ మనది. మన తెలుగు వాళ్లందరిది. రాజధాని అభివృద్ధిలో సీమాంధ్ర ప్రజల కష్టముంది. మన కృషి లేకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందా? అరవై ఏళ్లుగా రెక్కలుముక్కలు చేసుకుని వృద్ధిలోకి తెచ్చిన  హైదరాబాద్‌ను తెలంగాణ వాళ్లకు ఇచ్చేద్దామా? మన అనుమతి లేకుండానే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చేస్తామని ప్రకటించిన కేంద్రప్రభుత్వ పెద్దలను ఏం చేద్దాం అంటూ గద్గద స్వరంతో ప్రశ్నిం చింది.

ఇదంతా జరగడానికి కారణమైన కేసీఆర్‌ను ఏం చేయా లి. భరతమాతను బలిపశువును చేయాలని చూస్తున్న కేసీఆర్‌కు తెలుగు ప్రజలందరూ బుద్ధి చెప్పాలని లేదూ’ అంటూ ప్రశ్నించింది. ‘ఆంధ్ర రాష్ట్రంపై కేసీఆర్ కక్ష కట్టాడు...అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడు. నీకెందుకు పదవీ దాహం... తల్లడిల్లుతోంది తెలుగుతల్లి... జోరు తగ్గదని చాటిచెప్పండి’ అంటూ ప్రసంగించింది. తాను కూడా కవిత రాశాను అంటూ తెలుగుతల్లిని ఉద్దేశించి ‘‘వింటాములే..వింటాములే..కలిసికట్టుగా ఉంటాములే’’అంటూ చదివి వినిపించి అందరితో శభాష్ అనిపించుకుంది. ఆమె ప్రసంగం ముగిశాక సభికులంతా చప్పట్లతో ఆమెను దీవించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement