సన్నబియ్యం పేరుతో ఘరానా మోసం | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం పేరుతో ఘరానా మోసం

Published Tue, Nov 18 2014 3:11 AM

Small rice under the Gharana fraud

గుడివాడ : ‘మేం నాగాయలంక, అవనిగడ్డకు చెందిన రైతులం’ అంటూ మీవద్దకు వస్తున్నారా..? మోపెడ్‌లపై బియ్యం మూటలతో వచ్చి తక్కువ ధరకు సన్నబియ్యం ఇచ్చేస్తున్నామని చెప్పారా..? వారి మాటాలు నమ్మి ఆ బియ్యం కొన్నారంటే మోసపోయినట్లే.. జిల్లాలోని కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇలా అంటగట్టేస్తున్నారు. తీరా ఆ బియ్యం వండి చూస్తే రేషన్ సరుకని తేలి లబోదిబోమనాల్సిందే. గత వారం రోజులుగా గుడివాడ ప్రాంతంలో ఇటువంటి వారు నకిలీ బియ్యాన్ని అమ్మటంతో అనేక మంది మోసపోయారు. కంకిపాడు ప్రాంతంలో ఆ వ్యక్తుల్ని గుర్తించిన సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంకిపాడు పోలీసులు కూపీ లాగకుండానే పెట్టీ కేసు నమోదు చేసి వదిలేశారు. గుడివాడలో వీరి బారినపడి మోసపోయిన వారు ‘సాక్షి’కి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...
 
విత్తనాలకు డబ్బులేక దాచుకున్నవి అమ్ముకుంటున్నాం...
జిల్లాలోని నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో పండే బీపీటీ సన్నబియ్యం బాగుంటాయని పేరుంది. ఈ బియ్యానికి మంచి గిరాకీ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఘరానా మోసగాళ్లు ఆప్రాంత రైతులమని చెప్పి సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిలువునా ముంచేస్తున్నారు. గుడివాడలోని శ్రీరామ్‌పురంలోకి నాలుగు రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు మోపెడ్‌లపై బియ్యం మూటలతో వచ్చారు. తాము అవనిగడ్డ ప్రాంతానికి చెందిన రైతులమని, విత్తనాలకు డబ్బులేక, తినటానికి దాచుకున్న బియ్యాన్ని అమ్ముకుంటున్నామని తెలిపారు. సన్నబియ్యం తక్కువ రేటుకు అందిస్తున్నామని చెప్పారు. శాంపిల్‌గా వారి వద్ద ఉన్న ఒక సంచిలో ఉంచిన మంచి బియ్యాన్ని చూపించారు.

ఇవన్నీ ఒకే పొలంలోవని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో 25 కేజీల బస్తా ధర రూ.1,300 ఉందని, రూ.900కే అమ్ముకుంటున్నామని దీనంగా చెప్పారు. ఇళ్లవద్ద ఉండే మధ్యతరగతి మహిళలు వీరి మాటలు నమ్మి, తక్కువ ధరకు బియ్యం వస్తున్నాయని కొన్నారు. తీరా వండిన తరువాత అవి రేషన్‌బియ్యం అని తేలింది. ఈనెల 13న సత్యనారాయణపురంలో కూడా ఇదే తరహాలో బియ్యం అమ్మారు. ఇలా గుడివాడలోనూ, పరిసరాల్లోని పల్లెల్లో మధ్యతరగతి వర్గాలు ఉండే ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిసింది.
 
మినీ వ్యాన్‌లో తీసుకొచ్చి.. మోపెడ్‌లపై అమ్ముతూ..
వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి అమ్ముతున్నట్లు సమాచారం. నలుగురైదుగురు మోపెడ్‌లతో వస్తారు. వీరితోపాటు బియ్యం బస్తాలు మినీ వ్యాన్‌లో వస్తాయి. వ్యాన్‌ను గ్రామం చివర్లో ఉంచి బస్తాలను మోపెడ్‌లపై ఇళ్లవద్దకు తీసుకెళతారు. అమ్మకం పూర్తి కాగానే ఆ ప్రాంతం నుంచి మాయమవుతారు. ఇలా జిల్లాలో కొందరు రేషన్, ముతక బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి అమాయకులకు అంటగట్టి మోసం చేస్తున్నట్లు తెలిసింది.
 
పట్టిస్తే పెట్టీ కేసు పెట్టారు...
గుడివాడలో పలువురిని మోసం చేసిన వారిలో ఇద్దరు కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల సమీపంలో మోపెడ్‌పై బియ్యం పెట్టుకుని ప్రధాన రహదారిపై వెళ్లే వారికి అమ్ముతున్నారు. వీరి మోసానికి బలైన గుడివాడ వాసి వీరిని గుర్తించి కంకిపాడు పోలీసులకు ఉప్పందించారు. వారు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.   వీరు కంకిపాడు మండలం కోలవెన్ను శివారు మాదాసువారి పాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, సూరిబాబుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పెట్టీ కేసు నమోదు చేశారు.

వీరిని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే నకిలీ బియ్యం ముఠా గుట్టు రట్టయ్యేదని పలువురు చెబుతున్నారు. కాగా గుడివాడలో వీరి మోసానికి బలైన వ్యక్తి కంకిపాడు పోలీసు స్టేషన్‌లో ఉన్న వారివద్దకు వెళ్లారు. నకిలీ బియ్యం అంటగట్టి తీసుకున్న రూ.3,500ను నిందితులు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్మే ముఠా గుట్టు రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి వ్యాపారుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement