Sakshi News home page

‘మార్పు’.. వేగిరం

Published Sun, Jan 26 2014 11:52 PM

smitha sabarwal in republicday celebrations

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయనున్నట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. మాతా శిశు సంరక్షణ, గర్భిణులకు పౌష్టికాహార సేవలు అందించే మార్పు కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆదివారం 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జాతీయజెండాను ఎగురవేశారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చేనెల నుంచి ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ‘మార్పు’ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా సిద్దిపేటలో మార్పు అమలుకు హైరిస్క్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్, పటాన్‌చెరు, గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్‌లో కూడా దశల వారీగా  హైరిస్క్ కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు.  రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా రైతుహిత సదస్సులు నిర్వహించామన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. రబీలో రైతులు 94వేల హెక్టార్లలో వివిధ పంటుల సాగు చేశారన్నారు. రైతులకు వచ్చేనెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రూ.1,134 కోట్ల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పశుసంవర్ధకశాఖ ద్వారా సునందిని పథకంలో భాగంగా రైతులకు 3,961 మేలుజాతి దూడల పోషణకు 75 శాతం సబ్సిడీపై దాణ, మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 కలెక్టర్ ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఆమె మాటల్లో..
  మార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 1600 నుంచి 2100 వరకు పెరిగాయి. కొత్తగా 18 పీహెచ్‌సీలో ప్రసవాల సేవలు ప్రారంభిస్తున్నాం. పది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెలాఖరులోగా మార్పు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నాం.

  జిల్లాలో 219,033 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ ఏడాది కొత్తగా 4,763 ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. సదాశివపేటలో 220/132 కేవీ. సబ్‌స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి. ఇందిర జలప్రభ ద్వారా 1,764 బోర్లు, సీఎల్‌డీపీ పథకం ద్వారా 862 బోర్లకు రూ.11 కోట్లతో విద్యుద్దీకరణ పనులు చేపడుతున్నాం.
     ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 11,865 కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాం. రూ.354 కోట్లతో 72,763 పనులు పూర్తి చేశాము. ఈ ఆర్థిక సంవత్సరంలో 86,458 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా 17,685 పూర్తి కాగా 31వేల మరుగుదొడ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి.

     జిల్లాలోని 36,623 స్వయం సహాయక సంఘాలకు రూ.37 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశాం. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 3,738 సంఘాలకు రూ.25 కోట్ల రుణాలు మంజూరు చేశాం. రాజీవ్ యువకిర ణాలు పథకం ద్వారా 7,939 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాం. బంగారుతల్లి పథకం ద్వారా 8,125 మంది అడపిల్లల వివరాలు నమోదు చేసుకోగా 6వేల మంది పిల్లలు లబ్ధిపొందారు.  

     జడ్పీ ద్వారా జిల్లాలో ఈ ఏడాది రూ.11.98 కోట్లతో 2,593 పనులు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. జడ్పీ సాధారణ నిధుల కింద నియోజకవర్గానికి రూ.10 లక్షల చొప్పున రూ.3 కోట్లు విడుదల చేశాం.
     ఏడవ విడత భూ పంపిణీలో భాగంగా 1192 మంది లబ్ధిదారులకు 1249 ఎకరాల భూమి పంపిణీ చేశాం. జిల్లాలో 238 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ.2.38 కోట్ల ఆర్థిక సహాయం అందజేశాం.
 కాగా అంతకు ముందు కలెక్టర్ స్మితా సబర్వాల్, ఎస్పీ విజయ్‌కుమార్‌తో కలిసి వాహనంలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. గణతంత్ర వేడుకల్లో విప్ జయప్రకాశ్‌రెడ్డి, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్‌ఓ సాయిలు, ఆర్డీవో ధర్మారావు, హౌజింగ్ పీడీ బాల్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ లక్ష్మారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎస్‌ఓ ఏసురత్నం, డ్వామా పీడీ రవీందర్, ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, వికలాంగుల సంక్షేమశాఖ జేడీ లక్ష్మణచారి, ఐసీడీపీఎస్ పీడీ శైలజ, సంక్షేమశాఖ జిల్లా అధికారులు కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, చరణ్‌దాస్, రశీద్, బాల్‌చందర్, అదనపు ఎస్పీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement