తమ్ముళ్లే స్మగ్లర్లు | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లే స్మగ్లర్లు

Published Sat, Nov 22 2014 2:16 AM

తమ్ముళ్లే స్మగ్లర్లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కంచే చేను మేస్తుందన్న చందంగా ఎర్రచందనం అక్రమరవాణాలో అధికారపార్టీ నేతలే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. మరో జెడ్పీటీసీ సభ్యుడు ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. వీరికి ఓ గ్రామం గ్రామమే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు జిల్లాలో శేషాచలం, వైఎస్సార్ కడప జిల్లాలో లంకమల, ప్రకాశంలో నల్లమల, నెల్లూరు జిల్లాలో వెలుగొండ అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి.

అత్యంత విలువైన ఎర్రచందనం సంపదకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో తెలుగుతమ్ముళ్లు వాటిపై దృష్టిపెట్టారు. అధికార బలంతో కొందరు పోలీసులు, మరి కొందరు అటవీ, ఇంకొందరు చెక్‌పోస్టు అధికారులను బెదిరించి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. వారి సహకారంతో ఎర్ర బంగారాన్ని కొల్లగొడుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణే లక్ష్యంగా తమ్ముళ్లు, తమిళనాడుకు చెందిన కొందరు స్మగ్లర్లు బరితెగించారు.

చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. నెల్లూరు జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవలకాలంలో నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం అక్రమరవాణా అధికమైందని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరికి జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో జెడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్‌లు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది.

స్మగ్లర్లకు సహకరించటంతో పాటు జిల్లాపరిధిలోని వెంకటగిరి, రాపూరు, సోమశిల, సీతారామపురం, ఉదయగిరి అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రచందనం చెట్లను నరకటం ప్రారంభించారు. విచ్చలవిడిగా నరికిన ఎర్రచందనం దుంగలను రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అలా దాచి ఉంచిన ఎర్రబంగారాన్ని సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.

అధికార బలంతో అక్రమరవాణా
టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే కొందరు ఎర్రచందనం అక్రమరవాణాపై దృష్టిసారించి నట్లు తెలుస్తోంది. ఓ గ్రామం మొత్తం ఎర్రచందనం అక్రమరవాణాపైనే ఆధారపడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరంతా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుచుకుంటారని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ డంప్ చేసిన దుంగలతో పాటు వీరు నరికి దాచి ఉంచిన ఎర్రందనం దుంగలను కలిపి అధికార బలంతో సరిహద్దులు దాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అక్రమ రవాణాలో అధికారపార్టీ ఎమ్మెల్యేకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నట్లు అటవీశాఖలో పనిచేసే ఓ అధికారి స్పష్టం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేం దుకు అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేనే ఎర్రచందనం దుంగలను తన వాహనంలో ఉంచుకుని అనుకున్న స్థావరానికి చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి.

అలా పలుమార్లు ఎమ్మెల్యేనే తాను ప్రయాణించే కారులోనే ఎర్రచందనం దుంగలను తరలించినట్లు ఓ అటవీ అధికారి వెల్లడిం చటం గమనార్హం. ఎమ్మెల్యే ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం సీఎం వద్దకు కూడా చేరింది. దీనిపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

 అరెస్టులైనా బయటకు వస్తారు..
 రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులైన ఇద్దరు ప్రధాన స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఎమ్మెల్యే తన అధికార బలం ఉపయోగించి బయటకు రప్పించారు. ప్రస్తుతం వారు అడవుల్లోనే ఉంటూ స్మగ్లింగ్ పనిలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరుడైన జెడ్పీటీసీ సభ్యుడు ఒకరు తడ పరిధిలోని ఓ మెడికల్ షాపు యజమానికి ఎర్రచందనం సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ మేరకు కొంత మొత్తాన్ని కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో మొత్తం 374 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement