‘సమైక్యంగా’..సామాజిక సేవ | Sakshi
Sakshi News home page

‘సమైక్యంగా’..సామాజిక సేవ

Published Mon, Aug 17 2015 2:25 AM

Social service

 బాలాజీచెరువు(కాకినాడ):కాకినాడలో ఆదిత్య, జేఎన్టీయూకే కళాశాలల్లో 2006లో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసిన విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరంతా 2008లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆ సందర్భంగా సామాజిక సేవలో భాగస్వాములవ్వాలని తలంచారు. అనుకున్నదే తడవుగా 2008 ఆగస్టు 16న సమైక్య చారిటబుల్ ట్రస్టు పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ స్థాపనకు తొలుత  ఎ.సురేష్(సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇన్ బుష్), పీఎస్‌వీ తేజస్వి(ఇంజనీర్ ఇన్ వైజాగ్ స్టీల్‌ప్లాంట్), పీ జగదీష్‌కుమార్(ఎం.టెక్ ఇన్ జేఎన్‌టీయూకే) ముందుకు వచ్చారు. ప్రణాళిక రూపొందించారు. దీనికి తోటి విద్యార్థులు, విద్యార్థుల నుంచి అనూహ్యంగా మద్దతు లభిచింది.
 
 దీంతో అదే ఏడాది సెప్టెంబర్ 9న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు ఎ.రమేష్ అధ్యక్షునిగా 12 మంది సభ్యులతో చారిటబుల్ ట్రస్టును సొసైటీ చట్టం ప్రకారం రిజిస్టర్ చేశారు. ఆర్థిక పరిస్థితుల దృషాట్య చదువు కొనసాగించలేక మానేసే విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించాలని భావించారు. దీంతో సాంబమూర్తి బాలికల పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులకు వార్షిక ఫీజుకట్టడంతో సంస్థ సేవా ప్రస్థానం ప్రారంభమైంది.
 
  అపటి నుంచి ఇది అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. బాలలదినోత్సవం రోజు ఉమామనో వికాస కేంద్రంలోని విద్యార్థులకు ఆటపాట ఏర్పాటు చేసి బహుమతులివ్వడం, కలర్స్ యూత్ ఫెస్టివల్‌లో సమైక్య చారిటబుల్ సొసైటీ స్టాల్ ఏర్పాటు చేసి వారి భవిష్యత్తు కార్యాచరణను విద్యార్థులకు వివరించడం మొదలెట్టారు. ఫలితంగా మరింతమంది యువ ఇంజనీర్లు వీరితో జతకట్టారు.  పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పేద రోగులకు వైద్యం అందించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడం అనే మూడు నినాదాలతో ఈ సంస్థ సేవలు కొనసాగిస్తోంది.
 
 ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు
 2009లో ‘ప్రాజెక్టు సేస్ స్మైల్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే కార్యక్రమం చేపట్టి కాకినాడ నగరంలోని ఓ 20 దుకాణాలు, సూపర్‌మార్కెట్ల వద్ద డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశారు. వీటిద్వారా వచ్చే డబ్బుతో పేద, మెరిట్ విద్యార్థులకు తోడ్పాటును అందిస్తున్నారు.
 
  2009 అక్టోబర్‌లో వరదలతో నష్టపోయిన మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాలకు రూ.10 వేలను ఫ్లడ్ రిలీఫ్ ఫండ్‌కు అందించారు.  
 
 ఎందరో విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. వారిలో కొందరు కోర్సులూ పూర్తిచేసుకున్నారు.
 
 అంతేకాకుండా  2009, 15 సాధారణ ఎన్నికల్లో  ఓటు విలువ తెలియజేస్తూ ‘భారతావనికి మేలుకొలుపు’ పేరిట పదివేల కరపత్రాలు పంచారు.
 
  వీరి సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీనివల్ల మరిన్ని సంస్థలు ఈ సంస్థతో జతకలిశాయి. వాటిల్లో సహస్ర(హైదరాబాద్), ఆత్మీయ ఫౌండేషన్(హైదరాబాద్), సర్వే ది నీడి(విజయవాడ), సృజనవాణి(విశాఖ), ఏకోవే సొసైటీ, హెల్పింగ్ హార్ట్స్(హైదరాబాద్) ఉన్నారు.  
 
 విధ్యాభవిష్యనిధి
 సమైక్యచారిట్రబుల్ ట్రస్టు దేశవిదేశాల్లో స్థిరపడిన విద్యార్థుల నుంచి రూ.3లక్షల 25వేలను సేకరించి విద్యాభవిష్య నిధి పేరుతో జేఎన్టీయూకే ఎస్‌బీఐలో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. దీనిపై వచ్చే వడ్డీతో మత్స్యకార పిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తోంది.  
 
 ట్రస్టుకు మరింత సహకారం అవసరం
 విద్య, వైద్య, ఆరోగ్యం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్టుకు సహకారం మరింత అవసరం. పేద విద్యార్థులకు చేయ్యూతనివ్వాలనే ఆలోచన యువ ఇంజనీర్లలో రావడం చాలా సంతోషాన్నిచ్చింది. వారికి మద్దతుగా నావంతు సహాయాన్ని అందిచాను.  
 - ఆదిరెడ్డి రమేష్, సమైక్య చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు  
 
 సమాజానికి ఏదైనా చేయాలనే..
 ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత పుస్తకాలతోపాటు వైద్యశిబిరాలు నిర్వహించి మా వంతు సాయం చేస్తున్నాం. ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో స్ధిరపడినా.. ట్రస్టు అభివృద్ధికి కృషి చేస్తున్నాం.     - సుష్మసోమా, ట్రస్టు సభ్యులు
 
 చాలా సంతోషంగా ఉన్నది.
 ఉద్యోగంలో స్థిరపడ్డాక సమాజసేవ చేయాలనే ఆలోచన ఉండేది. అది ఇప్పుడు ఈ సమైక్య చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా నేరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ట్రస్టులకు మరింతమంది చేయ్యూతనివ్వాలని కోరుకుంటున్నా.
 - రాజేశ్వరి, ట్రస్టు మెంబర్

a

Advertisement
Advertisement