కొత్త పీఆర్సీ కొందరికి నష్టమే ! | Sakshi
Sakshi News home page

కొత్త పీఆర్సీ కొందరికి నష్టమే !

Published Tue, May 26 2015 1:34 AM

Some of the new larger PRC

శ్రీకాకుళం:రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రకటించిన కొత్త పీఆర్సీతో కొంతమంది పెన్షనర్లు, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడంతో కొందరు నష్టపోతుండగా, గతంలోని సమస్యలను పరిష్కరించే అంశాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించకపోవడంతో మరికొందరికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పీఆర్సీ అమలులో జాప్యం చేయాలనే ఇటువంటి మడతపేచీలను ప్రభుత్వం పెట్టిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ నెల జీతాన్ని మే నెలలో కొత్త పీఆర్సీ మేరకే అందుకుంటారని ప్రకటించినా అది అమలు కాలేదు. జూన్‌కు సైతం అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. సమగ్ర ఆర్థిక విధానం ద్వారా సమాచార సేకరణ జరిపిన తరువాతే కొత్త జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఆ సమాచార సేకరణకు అవసరమైన సాఫ్ట్‌వేర్ సాంకేతిక కారణాల వల్ల పని చేయడం లేదు. దీంతో జూలైకి కూడా కొత్త పీఆర్సీ అమలవుతుందా..లేదా అనే సందేహం కలుగుతోంది.
 
 తగ్గనున్న పింఛను మొత్తం
 కొత్త పీఆర్సీతో ఎక్కువ వయసున్న పెన్షనర్లకు గతం కంటే తక్కువ పింఛన్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి పెన్షనర్లకు వయసును బట్టి అధిక పెన్షన్‌ను మంజూరు చేశారు. 75 నుంచి 80 సంవత్సరాల వారికి 15 శాతం, 80 నుంచి 85 వారికి 20 శాతం, 85 నుంచి 90 వారికి 25 శాతం, 90 నుంచి 95 వయసు వరకు 30 శాతం, 95 నుంచి వందేళ్ల వారికి 35 శాతం, వందకు పైబడిన వయసు ఉన్న వారికి 50 శాతం అదనపు పింఛను ఇవ్వాలని గత పీఆర్సీలో నిర్ణయించారు. ప్రస్తుతం విడుదలైన పీఆర్సీల ఉత్తర్వుల్లో పింఛనుదారుల వయసును పట్టించుకోవద్దని పేర్కొనడంతో పెన్షనర్లు నష్టపోయే పరిస్థితి ఉంది. దీని వలన గతంలో పెన్షనర్లు తీసుకునే పింఛన్ కంటే ప్రతి రూ. పది వేలుకు రూ. 1700 నుంచి మూడు వేల రూపాయల వరకు తగ్గే పరిస్థితి ఉంటుంది.
 
 ఉదాహరణకు 80 ఏళ్ల వయసున్న పెన్షనర్ బేసిక్ పే రూ.10 వేలు అనుకుంటే కరువుభత్యం రూ. 7,790, ఐఆర్ రూ. 2,700, మెడికల్ అలవెన్స్ రూ. 200 పొంది రూ. 20,690 పింఛన్ వస్తుంది. 80 ఏళ్లు నిండిన ఇతనికి 20 శాతం అధిక పెన్షన్ ద్వారా రూ. రెండు వేలు, దానిపై కరువు భత్యం రూ. 1558 కలిపి 24,249 పింఛన్‌ను పొందుతారు. ప్రస్తుత పీఆర్సీ ద్వారా వయసును పరిగణలోనికి తీసుకోకుంటే బేసిక్‌పై రూ. పది వేలుకు, కరువు భత్యం రూ.6,334, 40 శాతం ఫిట్‌మెంట్ ద్వారా రూ. 4,300 పొంది రూ.20 635 వద్ద స్థిరీకరణ జరుగుతుంది. దీనికి కరువు భత్యం రూ.1839 కలుపుకొని 22,494 రూపాయలను మాత్రమే పెన్షన్‌గా పొందుతారు. ఈ లెక్కన 80 ఏళ్లు దాటిన పింఛన్ దారుడు ప్రతి రూ. పది వేలుకు 1754 రూపాయలను గతం కంటే తక్కువగా పొందుతాడు.
 
 డీఎస్సీ-08 ఉపాధ్యాయులకు తీవ్రనష్టం  
 డీఎస్సీ 2008లో ఉపాధ్యాయ పోస్టుకు అర్హత సాధించి, పోస్టులు లేని కారణంగా హామీపత్రాలు పొంది 2011లో ఉద్యోగం పొందిన వారికి కూడా కొత్త పీఆర్సీతో నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. డీఎస్సీ- 2012లో ఎంపికై ఉపాధ్యాయులుగా నియమించిన వారికి అప్రంటీస్ కాలం లేకపోవడంతో వారు నేరుగా రూ. 23,100 స్కేలు వద్ద జీతాలు పొందుతున్నారు. అంతకు ముందే డీఎస్సీ-08 వారు పోస్టింగ్‌లు పొందినా అప్రంటీస్ కాలం వలన 21,230 వద్ద స్థిరీకరణ జరిగి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లతో 22,460 రూపాయల స్కేల్ ద్వారా జీతాలు పొందుతున్నారు. కొత్త పీఆర్సీ ఉత్తర్వుల్లో సీనియర్ల కంటే జూనియర్‌లు తక్కువ వేతనం పొందుతున్నా సరిచేసే ప్రస్తావన లేకపోవడంతో హామీ పత్రాల ఉపాధ్యాయులు ఇక మీదట కూడా జూనియర్ల కంటే తక్కువ వేతనం పొందే అవకాశం ఏర్పడింది.
 
 ఒకే వేతనం వద్ద స్థిరీకరణతో నష్టం
 మాస్టర్స్ స్కేల్స్‌లో ఉన్న రూ. 53,060, రూ. 54,360, 55,660 రూపాయల వేతనం కలిగిన వారు ప్రస్తుత పీఆర్సీలో రూ.1,10,850 వేతనం దగ్గరే స్థిరీకరణ కాబడతారు. దీని వలన రూ. 54,360 వేతనం కలిగిన వారు 2,500 రూపాయలు, రూ. 55,660 వేతనం కలిగిన వారు రూ. 5 వేలకు పైబడి నష్టపోయే పరిస్థితి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement