విడిపోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకూ ఉంది | Sakshi
Sakshi News home page

విడిపోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకూ ఉంది

Published Mon, Sep 9 2013 2:00 AM

విడిపోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకూ ఉంది - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోవాలని కోరుకునేవాళ్లలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలూ ఉన్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు ఢిల్లీలో తిష్టవేసి రాష్ట్రాన్ని తెగ్గొట్టేయాలంటూ చెబుతున్నారన్న విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండు చోట్లా సీఎం పదవులుంటాయన్న దురుద్దేశంతో.. నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడదీసినా ఫరవాలేదన్నట్లుగా, పదవులకోసం గోతి కాడ నక్కల మాదిరి కాచుకొని కూర్చున్నారని మండిపడ్డారు. వారిని తలచుకుంటేనే తనకు బాధేస్తోందన్నారు. అయితే, ఆ నేతల పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. 
 
 విభజించాలంటూ ఉత్తరాలు రాసి పొలిట్‌బ్యూరో నిర్ణయాలను మార్చుకోకుండానే ప్రజల దగ్గరకు వె ళుతున్నారంటూ పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు. కేంద్ర హోంమంత్రి షిండే తాజా ప్రకటన ప్రజల్లో ఆందోళన రేకెత్తించేదిగా ఉందని లగడపాటి అన్నారు. హైదరాబాద్ విషయంలో తమ వద్ద రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూనే విభజన ప్రక్రియలో ముందుకెళుతున్నారని చెప్పారు. ఆంటోనీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామంటూనే తెలంగాణ విభజన నోట్ తయారవుతోందనడమేమిటన్నారు. పరిస్థితులు చూస్తోంటే రాష్ట్రంలో దాదాపు సగం ఆదాయాన్నిచ్చే హైదరాబాద్‌ను ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రాకు కాకుండా కేంద్రం తన్నుకుపోతుందేమోనన్న ఆందోళన తమలో ఉందన్నారు. 
 

Advertisement
Advertisement