ఆమెకు అండగా పోలీస్ నిఘా ! | Sakshi
Sakshi News home page

ఆమెకు అండగా పోలీస్ నిఘా !

Published Mon, Jan 12 2015 12:40 AM

ఆమెకు అండగా పోలీస్ నిఘా ! - Sakshi

 శ్రీకాకుళం క్రైం : మహిళలపై దాడులు జరగకుండా త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు శ్రీకాకుళం మహిళా పోలీస్‌స్టేషన్ విభాగం డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పబ్లిక్ పార్కులు, జనం గుమిగూడి ఉండే ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో కూడిన బృందాల నిఘా ఉంటుందన్నారు. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
 
 బాధితులు నేరుగా రావచ్చు
 శ్రీకాకుళం పరిధిలో రణస్థలం, పొందూరు, లావేరు, గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, జలుమూరు తదితర ప్రాంతాల్లో మహిళలపై జరిగే ఎలాంటి సంఘటన పైనైనా కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ తొలుత హోంగార్డులతో ప్రారంభమై ప్రస్తుతానికి డీఎస్పీ స్థాయికి ఎదిగినట్టు వివరించారు. మొదట్లో కేవలం భార్యభర్తల మధ్య తలెత్తే వివాదాలపై ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలిసి ఉండేలా ప్రయత్నించేవాళ్లమన్నారు. ఇప్పుడు తమ బాధ్యతలు పెరిగాయన్నారు. మహిళల్ని చిన్నచూపు చూడడం, గృహహింస, వరకట్న వేధింపులు, నిర్బంధం, చులకనగా మాట్లాడడం, హత్యలు, ఆత్మహత్యాయత్నాలు, మానభంగం, కొట్లాట వంటి కేసుల్ని శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్‌కు సమానంగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేస్తామన్నారు.
 
 నాలుగు రకాలుగా కౌన్సెలింగ్
 కేసు తీవ్రతను బట్టి నాలుగు రకాలుగా కౌన్సెలింగ్ చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. న్యాయవాదుల బృందం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, డీఆర్‌డీఏ పరిధిలోని బృందంతో పాటు పోలీసుల ద్వారా కౌన్సెలింగ్ చేస్తూ కుటుంబాల్లో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తుంటామన్నారు. ఇంకా తప్పదు అనుకుంటేనే కేసు నమోదు చేస్తామన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నందున.. అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా ఎస్‌ఐతో పాటు సిబ్బంది నియామకం, వాహనాల మంజూరుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డీఎస్పీ కోరారు. గతంలో కేవలం మహిళా పోలీస్‌స్టేషన్‌గా ఉంటూ శ్రీకాకుళం పరిధిలోనే కేసులు నమోదు చేసేవారమని, ఇప్పుడు పరిధి పెరగడంతో ఒత్తిడి తప్పడం లేదన్నారు. కేసు నమోదు, అరెస్టు, చార్జిషీటు తయారు చేయడం, శిక్ష పడేందుకు అవసరమైన పత్రాల్ని కోర్టుకు సమర్పించేందుకు మరికొంత మంది సిబ్బంది అవసరం ఉందన్నారు.
 
 త్వరలో చైతన్య సదస్సులు
 మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో త్వరలో చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛందసంస్థలు, విద్యార్థులు, కళాశాల, పాఠశాలల నిర్వహకులు, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల సహాయం అవసరమన్నారు. ప్రతీ వారం ఒక్కో చోట చట్టం, న్యాయం, పోలీసుల విధులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు తగ్గుతున్నా అక్కడక్కడా తీవ్ర నేరాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు పలుమార్లు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కేసుల నమోదు విషయంలో అలసత్వం వహించకుండా చర్యలు చేపడతున్నామన్నారు. కడియం నుంచి మొక్కల్ని తీసుకువచ్చి మహిళా పోలీస్‌స్టేషన్ ఆవరణలో గ్రీనరీ పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో టెక్కలి, పలాస వంటి ప్రాంతాల్లో సబ్ సెంటర్లు పెట్టే అవకాశం ఉందన్నారు. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించనున్నట్టు చెప్పారు.
 

Advertisement
Advertisement