త్వరలో గుంటూరులో ప్రి లిటిగేషన్ సెంటర్ | Sakshi
Sakshi News home page

త్వరలో గుంటూరులో ప్రి లిటిగేషన్ సెంటర్

Published Sun, Dec 21 2014 1:49 AM

త్వరలో గుంటూరులో  ప్రి లిటిగేషన్ సెంటర్

అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్
 
నూతన రాజధాని ఏర్పాటు క్రమంలో నేరాల అదుపునకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. ఇటీవల జిల్లాలో భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వాటి పరిష్కారానికి త్వరలో రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రార్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులతో కూడిన ప్రి లిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో    ప్రత్యేకంగా మాట్లాడారు. అర్బన్ జిల్లా పరిధిలో చేపడుతున్న మార్పులు, ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు, కేసుల దర్యాప్తు  వివరాలు.. తదితర అంశాల గురించి వివరించారు.    
 - గుంటూరు క్రైం
 
ప్రభుత్వానికి ప్రతిపాదనలు

రాజధాని ఏర్పాటు కారణంగా జనాభా రద్దీతోపాటు వీఐపీల భద్రత, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్‌స్టేషన్లు అన్నింటినీ అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపాం. నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నూతనంగా నాలుగు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, శాంతి  భద్రతల పరిరక్షణకు మరో మూడు పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపాం.
 
జనవరి 26 నుంచి స్పెషల్ వెబ్‌సైట్
 
పోలీసు సేవలను సులభతరం చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పోలీస్‌స్టేషన్లలో బాధితులు, సాక్షులకు ఎఫ్‌ఐఆర్ కాపీ వాంగ్మూలం, డ్రాఫ్ట్ చార్జిషీట్లను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీటన్నింటినీ జనవరి 26 నుంచి    ‘ఎస్పీఎస్ గుంటూరు అర్బన్’ అనే వెబ్‌సైట్‌లో ఉంచి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అన్ని వివరాలు పొందే వెసులుబాటు కల్పిస్తాం.
 
సీఎం పర్యటనకు  భారీ బందోబస్తు

ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. ఆ రోజున పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొంటారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచిలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావుతో రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణతో కలిసి శుక్రవారం సమావేశమై సమీక్ష జరిపామన్నారు. జిల్లా అధికారులతో సోమవారం సమావేశమై బందోబస్తుకు సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చిస్తామని వివరించారు.
 
 నేరాలకు పాల్పడితే రౌడీషీట్లే..
 
భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రి లిటిగేషన్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నాం. ఒకే స్థలాన్ని ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు చేయడం, ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకే స్థలాన్ని విక్రయించడం వంటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం. భూములు, స్థలాలను ఆక్రమించడం, మధ్యవర్తులుగా ఉండి మోసం చేయడం చేస్తే సస్పెక్టెడ్, రౌడీషీట్లు తెరుస్తాం. వీటిని వైట్ కాలర్ నేరాలుగా పరిగణిస్తాం.
 
కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ
 
అర్బన్ జిల్లాకు కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు మూడు అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. శిక్షణలో నేర్చుకున్న అంశాలతోపాటు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించే సందర్భాల్లో తీసుకోవాల్సిన మెలకువలు, సమయస్ఫూర్తిగా వ్యవహరించడాన్ని తెలియజేస్తాం.
 
 భూ వివాదంపై చర్యలు..
 గుంటూరు శ్యామలానగర్‌లోని సౌజన్యకుమార్‌కు చెందిన భూవివాదంలో అధికారుల పనితీరు తదితర అంశాలపై దర్యాప్తు వేగవంతం చేశాం. కొందరు పోలీస్ అధికారులు, న్యాయవాదుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా ఇప్పటికే గుర్తించాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదుచేస్తాం.
 
 

Advertisement
Advertisement