​‘రైల్వేలో మనకు మంచి వాటా దక్కింది’ | Sakshi
Sakshi News home page

​‘రైల్వేలో మనకు మంచి వాటా దక్కింది’

Published Wed, Feb 1 2017 6:22 PM

​‘రైల్వేలో మనకు మంచి వాటా దక్కింది’ - Sakshi

హైదరాబాద్‌: కేంద్ర ఆర్థికమం‍త్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన బడ్జెట్‌లో రైల్వేలకు చేసిన కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు వాటాలు పెరిగాయని జీఎం వినోద్ కుమార్‌ చెప్పారు. పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వివరాలు తెలియజేస్తూ 2017-18దక్షిణ మధ్య రైల్వే-తెలంగాణ బడ్జెట్‌ రూ.1,729 కోట్లు అని, అలాగే, ఏపీ బడ్జెట్‌ రూ.3,406కోట్లు అని తెలిపారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. యాత్రికులు, పర్యాటకులకోసం ప్రత్యేక రైళ్లు ఉంటాయని చెప్పారు.

ఆంద్రప్రదేశ్‌, తెలంగాణలతో దక్షిణ మధ్య రైల్వే జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సికింద్రాబాద్‌, విజయవాడ స్టేషన్లు మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. 20 స్టేషన్లలో 34 లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్‌లో కోచ్‌ మిత్ర సదుపాయాలు, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త శుద్ధి కేంద్రం పెడతామన్నారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2ను 2018కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

తిరుపతి నుంచి జమ్ము వరకు హమ్‌ సఫర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ఉంటుందని, విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్‌ నడుస్తాయని చెప్పారు. వెయిట్‌ లిస్టింగ్‌ ప్యాసింజర్ల కోసం వికల్ప్‌ సదుపాయం ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌-న్యూఢిల్లీ మధ్య నడిచే మూడు రైళ్లకు వికల్ప్ సదుపాయం, సికింద్రాబాద్‌ స్టేషన్లో ఎస్ఎంఎస్‌ చేస్తే కోచ్‌ పరిశుభ్రం చేసే సౌకర్యం ఏర్పడనుందని తెలిపారు.

Advertisement
Advertisement