ఒంగోలులో పలు పీఎస్‌ల్లో ఎస్పీ తనిఖీలు | Sakshi
Sakshi News home page

ఒంగోలులో వివిధ పోలీసుస్టేషన్లలో ఎస్పీ తనిఖీలు

Published Thu, Apr 25 2019 1:36 PM

SP Sidhartha Kaushal Checking Prakasam Police Stations - Sakshi

ఒంగోలు: నగరంలోని పలు పోలీసుస్టేషన్లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బుధవారం తనిఖీలు చేశారు. ఒక్కో పోలీసుస్టేషన్‌లో దాదాపు గంట పాటు పోలీసు అధికారులు, సిబ్బందితో భేటీ అయ్యారు. గతంలో ఆ పోలీసుస్టేషన్‌ చరిత్ర, ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన వివాదాలు తదితరాలపై చర్చించారు. ఎంతమందిని బైండోవర్‌ చేశారు. బెట్టింగ్‌కు సంబంధించిన అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన హద్దులు అడిగి తెలుసుకున్నారు. వివాదాలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ను ఎస్పీ కౌశల్‌ ఆదేశించారు. ఒంగోలు టూటౌన్‌తో పాటు ఒన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లను ఆయన పరిశీలించారు.

కౌంటింగ్‌ రెండు రోజుల ముందునుంచే ప్రత్యేక బందోబస్తు
అనంతరం ఎస్పీ కౌశల్‌ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్‌ డివిజన్లలోని పోలీసుస్టేషన్లను పరిశీలించామని, సంబంధిత స్టేషన్లలోని పరిస్థితులపై ఒక అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో 45 శాతం మంది భద్రత సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. అయినా ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిర్వహించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కౌంటింగ్‌ను కూడా అత్యంత ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని అందరు పోలీసు అధికారులు, సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నామన్నారు. జిల్లా పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, ఒక వైపు ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లు పెరగ్గా భద్రత సిబ్బంది మాత్రం తగ్గారన్నారు. అయినా ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ఎన్నికలు అత్యంత కట్టుదిట్టమైన వాతావరణంలో జరిగాయన్నారు. బేసిక్‌ పోలీసింగ్, ట్రాఫిక్‌ సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. కలనూతలలో ఎడ్జాయినింగ్‌ పోలింగ్‌కు సైతం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బెట్టింగ్‌ జరుగుతుందన్న ప్రచారం తమ దృష్టికి కూడా వచ్చిందని, ప్రజలు ఎవరైనా ఇటువంటి సమాచారాన్ని గుర్తిస్తే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మొట్టమొదటి కారణం రాష్ట్రంలోనే అత్యధికంగా బైండోవర్లు చేయడమేనన్నారు.

దాదాపు 26 వేల మందిని బైండోవర్‌ చేయడంతో 99.6 శాతం మంది బైండోవరైన ఎటువంటి వివాదాల్లో తారసపడ లేదన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు దగ్గరగా ఉన్న తొలి అంచెలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సు, రెండో అంచెలో ఎపీఎస్పీ బెటాలియన్, మూడో అంచెలో స్థానిక పోలీసులు కాపలాగా ఉంటున్నారని, తాము కూడా అప్రమత్తంగా తనిఖీలు చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. అంతే కాకుండా ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు కూడా అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ సమయంలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల రోజు ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేపట్టామో అదే బందోబస్తు ఏర్పాట్లు కౌంటింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు నుంచి కొనసాగిస్తామన్నారు. కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ రోజు, కౌంటింగ్‌ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. కౌంటింగ్‌ సమయంలో కూడా బైండోవర్‌లు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 13 చోట్ల పోలీసు పికెట్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం వేసవి సీజన్‌ కావడంతో చాలామంది వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్తుంటారని, ఈ నేపథ్యంలో విలువైన వస్తువులు ఇళ్లల్లో ఉంచవద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఉస్‌)ను ఉచితంగా అందిస్తుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు బంధువుల ఇళ్లల్లో ఉంచుకోవడం లేదా లాకర్లలో పెట్టుకోవాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, అనుమానాస్పద వ్యక్తుల సంసరిస్తే పోలీసు శాఖ దృష్టికి తీసుకు రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

బైక్‌పై ఎస్పీ ప్రయాణం
టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ను పరిశీలించిన అనంతరం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొద్దిసేపు బైకుపై ప్రయాణం చేశారు. ఎస్పీ బైక్‌ నడుపుతుండగా ఒంగోలు టౌన్‌ డీఎస్పీ రాథేష్‌ మురళి వెనుక కూర్చున్నారు. స్టేషన్‌ నుంచి కమ్మపాలెం, గోపాలనగరం, గోరంట్ల కాంప్లెక్స్‌ జంక్షన్, కరుణా కాలనీ రోడ్డు మీదుగా ట్రంకు రోడ్డుకు చేరుకున్నారు.
అక్కడి నుంచి అద్దంకి బస్టాండు, మస్తాన్‌దర్గా సెంటర్, కొత్తపట్నం బస్టాండు, ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచి జంక్షన్, చర్చి సెంటర్‌ మీదుగా ఒన్‌టౌన్‌ వరకు బైక్‌ నడుపుకుంటూ నగరంలో ప్రయాణించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా గమనించారు.  

Advertisement
Advertisement