సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటించండి | Sakshi
Sakshi News home page

సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటించండి

Published Thu, Jan 9 2014 5:21 AM

Special casual leave time to strike Advertise

ఒంగోలు, న్యూస్‌లైన్: సీఎం కిరన్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదే అయితే  సమైక్యపోరాటంలో ఉద్యోగులు పాల్గొన్న కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవుగా తక్షణమే ప్రకటించి సమైక్యవాది అని నిరూపించుకోవాలని ఏపీఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌జీవో భవనంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నవారికి తమ మద్దతు నిత్యం ఉంటుందన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఇచ్చిన పిలుపునకు స్పందించి జిల్లాలో కూడా సమైక్య పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈనెల 10వ తేదీ హైదరాబాదులో నిర్వహించే సమైక్య సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కదులుతున్నట్లు తెలిపారు. ఐఆర్ ఇస్తే సరికాదని, పీఆర్‌సీని, హెల్త్ కార్డుల విషయంలో పెడుతున్న ఇబ్బందులను కూడా సీఎం పరిష్కరించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు రాజకీయ జేఏసీని కూడా ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్య ఎజెండాతో రాజకీయ జేఏసీలోకి రావాలన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు ఇస్తే ఈనెల 16 వ తేదీలోపు చలో అసెంబ్లీకి సైతం  సిద్ధమని ప్రకటించారు.


 జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర చాంపియన్ అని సీఎం ప్రకటించుకుంటే సరిపోదని, బచావత్ ట్రిబ్యునల్ వల్ల జరిగిన నష్టంతోపాటు అన్ని విషయాలపైనా సుదీర్ఘ చర్చ జరగాలని, టీనోట్‌ను ఏవిధంగా అయితే రాష్ట్రానికి కేంద్రం పంపిందో...అదే విధంగా తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌జీవో సంఘ ఎన్నికల్లో ఓటమిని తాము క్రీడాస్ఫూర్తిగా తీసుకుంటున్నామని, అశోక్‌బాబు నిర్ణయాలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరశింహారావు , ఎన్‌జీవో సంఘ నాయకులు శరత్‌బాబు, స్వాములు, మాలకొండయ్య, శ్రీనివాసరావు, చెంచయ్య, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement