భరోసా ఇవ్వని భవిత..! | Sakshi
Sakshi News home page

భరోసా ఇవ్వని భవిత..!

Published Mon, Mar 26 2018 10:09 AM

Special Needs Childrens Need Bhavitha Centres - Sakshi

ప్రత్యేక అవసరాల పిల్లలకు జిల్లాలోని భవిత కేంద్రాలు భరోసానివ్వలేకపోతున్నాయి. విద్యార్థులకు విద్యతో పాటు వారి శారీరక అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ చేయాలి. వినికిడిలోపం, బుద్ధిమాంద్యం, అంగవైకల్యం, దృష్టిలోపం ఉన్న చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో మానసిక స్థైర్యాన్ని నింపాలి. అయితే భవిత కేంద్రాల్లో చేపట్టాల్సిన నెలవారీ కార్యక్రమాలు, యాక్షన్‌ ప్లాన్‌ సరిగ్గా అమలు చేయకపోవడంతో ఆశించిన ఫలితాల్లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలో 22 భవిత కేంద్రాలు, 44 మినీ భవిత కేంద్రాలు సర్వశిక్షా అభియాన్‌ ద్వారా నడుస్తున్నాయి. అందులో 8,903 మంది విద్యార్థులున్నారు. 132 మంది వైద్యవిధానాల్లో శిక్షణ పొందిన శిక్షకులు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేయాల్సి ఉండగా, 103 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మానసిక, శారీరక ఇబ్బందులు గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి భవిత కేంద్రాలను స్థాపించారు. ప్రతి కేంద్రంలో వైద్యవిధానంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు (ఐఈఆర్‌టీ) ఉంటారు. పలు రకాల మానసిక సమస్యలతో ఉన్న పిల్లలకు భవిత కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి వారిని మామూలు పిల్లలుగా తయారు చేయాలి. అయితే జిల్లాలో ఎక్కడా అలా జరగడం లేదు. ఏదో వచ్చామా.. వెళ్లామా అన్నట్లు విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో సరైన సూచనలు ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జాడలేని ఫిజియోథెరపిస్టులు..
భవిత కేంద్రాల్లో పనిచేసే ఫిజియోథెరపిస్టులు కేంద్రానికి వచ్చి చిన్నారులకు వారంలో ఒకసారి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్ని మండలాల్లో ఉన్న భవిత కేంద్రాలలో ఫిజియోథెరఫిస్టులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అందులో కొంతమంది కేంద్రాలకు వచ్చి బయోమెట్రిక్‌ నమోదు చేసి వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి.

సకాలంలో నిర్వహించని క్యాంప్‌లు..
జిల్లాలోని అన్ని మండలాల్లో వినికిడి లోపం, గ్రహణమొర్రి లోపం ఉన్న విద్యార్థులను ఆరోగ్యశాఖ, సర్వశిక్షా అభియాన్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా గుర్తించే పిల్లలకు సర్వశిక్షా అభియాన్‌ నిధులతో వారికి అవసరమైన ఉపకరణాలను(మిషన్లు) క్యాంపులు నిర్వహించి అందించాలి. ఆపరేషన్లకు సిఫార్సు చేయాలి. అయితే ఆ కార్యక్రమాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా అధికారి నియామకం
సర్వశిక్షా అభియాన్‌లో వ్యవహారాలన్నింటిని చూడాల్సిన జిల్లా సహిత విద్య అధికారిని నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేక అనుభవం, ఏడాది ఎంఎస్సీలో జువాలజీ పూర్తి చేసి, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌పై ఏడాది పాటు కోర్సు చేసిన వారితో పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతంలో ఉన్న ఆ శాఖ పీఓ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సర్వశిక్షా అభియాన్‌ కార్యాలయానికి తెలియకుండా ఆ పోస్టు భర్తీ చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే పలు సమస్యలు ఎదురవుతున్నాయన్న వాదనలున్నాయి.

Advertisement
Advertisement