వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్

Published Sun, Feb 15 2015 3:38 AM

వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ - Sakshi

  • భూముల హక్కులు ధారాదత్తం
  • ఆగమేఘాలపై సర్కారు నిర్ణయం
  • నేడు గవర్నర్ ఆమోదానికి ఫైలు
  • భూసేకరణ బదులు కొత్త చట్టం
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను బలవంతంగానైనా సేకరిం చేందుకు తోడ్పడేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకుంది. భూసేకరణకు బదులుగా భూ వినియోగదారుల హక్కుల సేకరణకు వీలుగా ‘తెలంగాణ వాటర్ పైప్‌లైన్స్ (భూ వినియోగదారుల హక్కుల సేకరణ) ఆర్డినెన్స్-2015’ను రూపొందించింది.

    ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్...వాటర్‌గ్రిడ్‌కు అవసరమైన నిధులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరేందుకు ప్రధాని మోదీతో సోమవారం సమావేశమయ్యేలోగానే ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదముద్ర వేయించేందుకు ప్రభుత్వం శరవేగంగా ఫైళ్లు కదుపుతోంది. సీఎం ఆదేశాలతో శనివారం ఉదయమే ఆర్డినెన్స్ ఫైలును నోట్ రూపంలో అధికారులు మంత్రుల ఆమోదానికి పంపి సంతకాలు సేకరించారు. దీంతో ఆదివారం ఈ ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశముంది. తెలంగాణ వాటర్‌గ్రిడ్ అమలుకు దీన్ని నిర్దేశించినట్లు నోట్‌లో ప్రస్తావించారు.

    గుజరాత్ మోడల్‌లో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఆవాసాలు, పరిశ్రమల అవసరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ. 26 వేల కోట్ల అంచనా వ్యయంలో ఈ బృహత్తర ప్రాజెక్టు  నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో మొత్తం 36 నీటి వనరులను గుర్తించారు. దాదాపు 1.25 లక్షల కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.

    ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలంటే భూసేకరణ అత్యంత కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగం గుర్తించింది. కేవలం గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా పైపులైన్ వేసేందుకు వీలుగా... ఎటువంటి భూములకు సంబంధించిన హక్కులనైనా సేకరించేలా (రైట్ ఆఫ్ వే) చట్టం ఉండాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న భూసేకరణ అవరోధాలను అధిగమించేందుకు గుజరాత్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో తెచ్చిన  భూసేకరణ చట్టాన్ని నమూనాగా స్వీకరించాలని సూచించింది.

    గత ఏడాది నవంబర్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో జరిగిన సమావేశంలోనే ఈ చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు వీలైనంత తొందరగా చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని రెవెన్యూ విభాగాన్ని పంచాయతీరాజ్ విభాగం కోరింది. చట్టం తేవాలంటే బిల్లు ప్రవేశపెట్టేందుకు బడ్జెట్ సమావేశాల వరకు నిరీక్షించాలి. ఈలోగానే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉండటంతో సీఎం నిర్ణయం మేరకు అధికారులు ఆర్డినెన్స్‌కు సన్నాహాలు చేశారు. న్యాయ సలహా తీసుకొని గుజరాత్ చట్టం తరహాలోనే ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను రూపొందించారు.
     
    ఇష్టం లేకున్నా భూములివ్వాల్సిందే...

    కొత్త ఆర్డినెన్స్‌తో తమకు ఇష్టమున్నా.. లేకున్నా.. రేటు నచ్చినా నచ్చకపోయినా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, పైపులైన్లకు అవసరమైన భూములను యజమానుల నుంచి సర్కారు నిర్బంధంగా స్వాధీనం చేసుకుంటుంది. వీటిపై ఉన్న హక్కులన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం భూములను సేకరించాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. కానీ భూముల గుర్తింపు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మొదలు ఫైనల్ నోటిఫికేషన్, బహిరంగ విచారణ.. వివిధ దశల్లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.

    ఈ వ్యవధిలో ఎప్పుడైనా తన హక్కులకు భంగం కలిగినట్లుగా భావిస్తే సదరు భూ యజమానులు అభ్యంతరం తెలపటంతోపాటు కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు గిట్టుబాటు కాకపోయినా... అదనంగా చెల్లింపులు కోరే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే.. ఈ హక్కులన్నీ కాలరాసినట్లవుతుంది. ప్రాజెక్టుకు అవసరంగా ప్రభుత్వం గుర్తించిన భూములన్నీ కేవలం నెల వ్యవధిలోనే సర్కారు స్వాధీనం చేసుకోవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement