ఎస్సీలకు ప్రత్యేక పాలిటెక్నిక్ | Sakshi
Sakshi News home page

ఎస్సీలకు ప్రత్యేక పాలిటెక్నిక్

Published Fri, Apr 11 2014 1:58 AM

నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల - Sakshi

 
 నూనెపల్లె, న్యూస్‌లైన్: నంద్యాలలో ప్రభుత్వ మోడల్ రెసిడెన్సియల్ పాలిటెక్నిక్(జీఎంఆర్‌పీ) కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ప్రత్యేకంగా ఎస్సీల కోసమే ఉద్దేశించిన ఈ కళాశాలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం జిల్లాలో 6 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి.

 ఇందులో శ్రీశైలం కళాశాల ఎస్టీలకు ఉద్దేశించింది. ఈ క్రమంలో ఎస్సీల కోసం మోడల్‌స్థాయి రెసిడెన్సియల్ కళాశాల ఏర్పాటుకు సంకల్పించిన ప్రభుత్వం రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ద్వారా న్యూ ఢిల్లీలోని ఏఐసీటీఈకు ప్రతిపాదనలు పంపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కాలేజికి అనుమతి లభించే అవకాశం ఉంద ని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఓఎస్‌డీ రామసుబ్బారెడ్డి తెలిపారు.  

 పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోనే భవన సముదాయం
 నంద్యాల రెవెన్యూ క్వార్టర్స్ ప్రాంతంలో 1960 నుంచి ప్రభుత్వం ఈపూరి శేషయ్య శెట్టి పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తోంది. ఇందులో వివిధ విభాగాల్లో 480 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఎస్సీలకు మెరుగైన ప్రమాణాలతో విద్యాబోధన కోసం జీఎంఆర్‌పీ కళాశాల ప్రారంభించనున్నారు.

 సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 120 మందికి అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ప్రస్తుత కళాశాల ఆవరణలోనే స్థలాన్ని కేటాయించి భవనసముదాయం నిర్మించే అవకాశం ఉంది. పాలిసెట్ - 2014లో అర్హులైనవారికి అవకాశం కల్పిస్తారు. అన్ని వసతులతో కూడిన ప్రత్యేక హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తారు.

Advertisement
Advertisement