పట్టణం నిద్రపోతున్న వేళ | Sakshi
Sakshi News home page

పట్టణం నిద్రపోతున్న వేళ

Published Wed, Dec 10 2014 2:06 AM

పట్టణం నిద్రపోతున్న వేళ

ఆకాశంలో నుంచి మేఘాలు కిందికి దిగుతున్నట్లు తెరలు తెరలుగా కమ్ముకుంటున్న మంచు. గాలులు బద్దకంగా కదులుతున్న సమయం. గువ్వలు కూడా గూటి బయటకు రాలేని వేళ. నిశ్శబ్దం రాజ్యమేలుతున్నప్పుడు కొందరు విధులు నిర్వహిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ రాత్రి విధులు నిర్వహించినా... శీతాకాలపు రాత్రులు మాత్రం చాలా కష్టంగా గడుస్తాయని వీరు చెబుతున్నారు. పట్టణమంతా నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు బొబ్బిలిలో విధులు నిర్వహిస్తున్న వారి గురించి తెలుసుకోవడానికి సాక్షి చేసిన ప్రయత్నం...        
 
 సమయం: 12.10 రాత్రి స్థలం : కోర్టు, పెట్రోలు బంకు జంక్షన్
 వీధి లైట్ల వెలుతురులో పోలీస్ కానిస్టేబుళ్లు నాగేశ్వరావు, మురళీకృష్ణలు విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ హై పవర్ లైట్ల నుంచి ఎంత వెలుగు వస్తుందో అంతే స్పీడుగా మంచు కూడా కురుస్తోంది. చేతిలో కర్ర, బీటు పుస్తకం పట్టుకొని వారు అదే మంచులో నించుని పరిశీలన చేస్తున్నారు. మధ్య మధ్యలో వాసిరెడ్డి సర్కిల్, రైల్వే స్టేషన్లవైపు వెళ్లి వస్తున్నారు.
 
 సమయం: 1.15స్థలం :  ప్రభుత్వ వైద్యశాల
 అర్ధరాత్రి సమయంలో ఒక సాధారణ ప్రసవం అవ్వగా, ఐదు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆపరేషన్లు ముగించుకొని వైద్యుల బృందం ఇంటికి వెళ్లగా అక్కడ సిబ్బంది ప్రసవం అయిన వారికి సపర్యలు చేస్తున్నారు. వార్డుల్లో ఉండే వారికి ఏఎన్‌ఎం ఇంజెక్షన్లు చేస్తూ విధి నిర్వహణలో ఉండగా స్టాప్‌నర్సు రికార్డులు రాయడంలో ఔట్ సోర్సింగు సిబ్బంది థియేటరు శుభ్రపరచడంలో నిమగ్నమై ఉన్నారు.
 
 సమయం: 12:25స్థలం : ఆర్టీసీ కాంప్లెక్సు
 నిర్మానుష్యంగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్సులో ఓ మూలన సంచార జీవులు నిండా ముసుగేసుకొని చలిని తట్టుకుంటూ ఓ మూలన పడుకుని ఉన్నారు. బస్సులు తప్పిపోయిన కొందరు వ్య క్తులు అక్కడే ఆదమరిచి నిద్రపోతున్నారు. గాలులు వణికిస్తుంటే అక్కడే వారు ముసుగులు కప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. సిబ్బంది కనిపించలేదు.
 
 సమయం : 1.30స్థలం :  దక్షిణ దేవిడి
 పోలీస్ స్టేషనులో క్రైం పార్టీగా ఉండే కానిస్టేబుళ్లు వై.మురళీకృష్ణ, ఎస్.రమణలు విజిల్స్ వేస్తూ టార్చ్‌లైట్ కొడుతూ దుకాణాల వద్ద పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి బొబ్బిలి వచ్చిన చిత్రకోటబొడ్డవలస గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అటుగా వస్తుండగా వారిని నిలిపివేసి విచారణ చేశారు. వారి వద్ద వస్తువులను తనిఖీలు చేస్తుండగా పట్టణంలోని అమ్మిగారి చెరువు గట్టుకు చెందిన ఓ తాపీ మేస్త్రీ కూడా రావడంతో అతనికి సంబంధించిన బ్యాగులు పరిశీలన చేశారు. వారికి సంబంధించిన చిరునామాలు తీసుకొని ఇక ఎప్పుడు బయటకు వచ్చిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని సూచించి పంపిచేశారు.
 
 సమయం 2.00స్థలం: ఎస్‌బీఐ జంక్షన్
 ఇది కూడా వ్యాపార సముదాయమే. స్టేట్‌బ్యాంకు, గ్రామీణ బ్యాంకుతో పాటు నాలుగైదు ఏటీఎంలు ఈ కూడలిలో ఉన్నాయి. ఆంధ్రా బ్యాంకు ఏటీఎం వద్ద ఆరుబయటే సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్నారు. చలిని తట్టుకుంటూ విధి నిర్వహణలో ఉండగా పోలీస్ స్టేషనుకు చెందిన కానిస్టేబుల్ వై.నాయుడు, హోంగార్డు శ్రీనులు అక్కడకు వచ్చారు. అప్పటికే అక్కడ నుంచి గుర్కా వాళ్లు విజిల్స్ వేసుకొని వెళ్లిపోయారు. స్టేట్‌బ్యాంకు వద్ద ఉండే బీటు పుస్తకాన్ని టార్చ్‌లైటు వెలుగులో వీరు పరిశీలన చేశారు. ఆ తర్వాత అటుగా వెళుతున్న ఆటోను నిలిపివేసి వివరా లు అడిగి తెలుసుకున్నారు.. ఇలా రాత్రంతా మంచులో తిరుగుతూ వీరు విధులు నిర్వహించారు.
 
 సమయం: 12.45స్థలం:  రైల్వే స్టేషను
 విశాఖ నుంచి రాయిపూర్ వెళ్లే పాసింజరు మరి కొద్ది సేపట్లో వచ్చే సమయం. పాసింజర్లు వస్తారేమోనన్న ఆశతో రిక్షా డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి దాటాక వస్తున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి నాలుగు రాళ్లు సంపాదించి తెల్లారి ఇంటికి ఇద్దామని వారి తాపత్రయం. రిక్షా డ్రైవర్ డి.వెంకటరమణతో పాటు మరో ఇద్దరు రిక్షా డ్రైవర్లు నిండా ముసుగేసుకొని మంచులో ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నారు. పెట్రోల్ బంకు జంక్షన్‌లో ఆటో డ్రైవరు రామకృష్ణతో పాటు రామభద్రపురానికి చెందిన ఓ ఆటో డ్రైవరు ఉన్నారు. అప్పటికే రైల్వే స్టేషను ఆరుబయట కొంత మంది యాచకులు చలికి తట్టుకుంటూనే నిద్రిస్తున్నారు.
 
 సమయం: 1.45స్థలం:  మెయిన్ రోడ్డు
 అప్పటికే ట్రాఫిక్ జీపులో హెచ్‌సీ నారాయణరావు డ్రైవరు రాంబాబుతో పాటు మెయిన్‌రోడ్డులో పహారా కాస్తున్నారు. అర్ధరాత్రి దాటాక అటువైపుగా వస్తున్న వాహనాలను నిలిపివేసి పరిశీలన చేస్తున్నారు. మండలంలోని పక్కి నుంచి మండపేటకు తరలివెళ్తున్న ధాన్యం లారీని నిలిపివేసి ప్రశ్నించారు. అనుమతులు అన్నీ ఉండడంతో అక్కడ నుంచి పంపించేశారు. మెయిన్‌రోడ్డులోనే బంగారు దుకాణాలు, వ్యాపార సముదాయాలు అన్నీ ఉండడంతో రాత్రంతా ఆ  రోడ్డులో పోలీసులు గస్తీని ఏర్పాటు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement