కనులారా వైకుంఠ దర్శనం | Sakshi
Sakshi News home page

కనులారా వైకుంఠ దర్శనం

Published Wed, Dec 23 2015 2:02 AM

కనులారా  వైకుంఠ దర్శనం

సర్వదర్శనంలో కిక్కిరిసిన భక్తులు
వీఐపీ టికెట్లు రద్దు.. సామాన్యులకే దర్శనం
టీటీడీ ఈవోకు సీఎం చంద్రబాబు అభినందన

 
తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు వైభవంగా సాగాయి. మంగళవారం కూడా భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) ప్రదక్షిణతో ఆనందపరవశులయ్యారు. అంచనాలకు మించి జనం వచ్చినా అందరికీ దర్శనం, ఉత్తర ద్వార ప్రవేశం కల్పించడంలో టీటీడీ అధికారులు సఫలీకృతులయ్యారు.
 
రికార్డుస్థాయిలో 1.63 లక్షల మందికి ముక్కోటి దర్శనం
 ఏకాదశి రోజు సోమవారం 88,000 మందికి ముక్కోటి దర్శనం కల్పించింది.  ద్వాదశి రోజైన మంగళవారం వేకువజాము నుంచి సర్వదర్శనం ప్రారంభించారు. అప్పటి నుంచి అర్ధరాత్రి వరకు సుమారు 75 వేల మందికి దర్శనం కల్పించారు. అంటే రికార్డుస్థాయిలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో దాదాపుగా 1.63 లక్షల మందికి భక్తులకు ముక్కోటి దర్శనం కల్పించారు.
 
ద్వాదశిలోనూ వీఐపీ టికెట్లు రద్దు
 వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ టికెట్లను భారీగా కోత విధించారు.  మొత్తం 2,800 టికెట్ల భక్తులకు  రెండు గంటల్లోపే వీఐపీ దర్శనం ముగించారు. అనంతరం నిర్విరామంగా దర్శనం కల్పించారు. ద్వాదశిలో రోజు మంగళవారం కూడా వీఐపీ టికెట్లు రద్దుచేశారు. ప్రోటోకాల్ పరిధిలో వచ్చేవారికి కూడా ఎలాంటి టికెట్లు ఇవ్వలేదు. దీనివల్ల సామాన్య  భక్తులు మరింత హాయిగా, త్వరగా స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల క్యూల్లో భక్తుల మధ్య కొంత తోపులాటలు కనిపించాయి.  ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులకు క్యూల్లో అన్నప్రసాదాలు, వే డిపాలు, కాఫీ, టీ అందజేయడంలో టీటీడీ నిత్యాన్నప్రసాద విభాగం సఫలీకృతమైంది.
 
10,800 మందికి రూ.300 టికెట్ల భక్తులకు దర్శనం
 ద్వాదశి దర్శనంకోసం రూ.300 టికెట్ల ను రిజర్వు చేసుకున్న 10,800 మంది భక్తులకు మంగళవారం  సంతృప్తికరమైన దర్శనం లభించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారికి కేటాయించిన సమయాల్లో గంటకు 2500 మంది చొప్పున దర్శనానికి అనుమతించారు.
 
టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం
ఏకాదశితోపాటు ద్వాదశిలోనూ టీటీడీ ఉద్యోగులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. వీరికి ఇక్కడి టీబీసీ-73 ప్రవేశ మార్గం నుండి  భక్తులను అనుమతించారు. వారితోపాటు పోలీసులు, వారి కుటుంబ సభ్యులను దర్శనానికి అనుమతించారు.
 
టీటీడీ ఈవో,  జేఈవో స్వీయ పర్యవేక్షణ
టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సోమ, మంగళవారాల్లో  అన్ని క్యూల ను స్వయంగా పర్యవేక్షించారు. ఉద యం నుండి రాత్రి వరకు పలుమార్లు ఆలయంలోనూ, క్యూల్లోనూ కలియది రుగుతూ సామాన్య భక్తులకు దర్శనం కల్పించే చర్యలు వేగవంతం చేశారు.
 
టీటీడీకి సీఎం చంద్రబాబు అభినందనలు
 ఏకాదశి, ద్వాదశిలో సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం, మౌలిక సదుపాయాలు  కల్పిండటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ప్రత్యేకంగా అభినందించారు. ఈమేరకు ఈవో దొండపాటి సాంబశివరావుతో మాట్లాడారు. వారికి సహకరించిన జేఈవో కేఎస్‌శ్రీనివాసరాజు బృందానికి సీఎం అభినందనలు తెలిపారు.
 

Advertisement
Advertisement