డీసీఎంఎస్ పీఠంపై శ్రవణ్‌కుమార్ | Sakshi
Sakshi News home page

డీసీఎంఎస్ పీఠంపై శ్రవణ్‌కుమార్

Published Sun, Sep 1 2013 12:57 AM

sravan kumar as dcms chairman

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్‌గా శ్రవణ్‌కుమార్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 10మంది డెరైక్టర్లలో 8మంది శ్రవణ్‌కే మద్దతుగా నిలవడంతో పోటీ ఏకపక్షమైంది. మరోవైపు ఉపాధ్యక్షుడిగా భీంరెడ్డిని ఎన్నుకున్నారు. మాజీ మంత్రి సబిత, మంత్రి ప్రసాద్‌కుమార్‌ల మధ్య తలెత్తిన అధిపత్య పోరు కారణంగా ఆర్నెల్ల క్రితం ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎన్నికల్లో సబితవర్గానిదే పైచేయి అయ్యింది. సహకార ఎన్నికల్లోనూ ఇరువర్గాలు విడిపోయిన సబిత, ప్రసాద్ తమ అనుయాయులను గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డారు. ఈ క్రమంలో ఆఖరికి డీసీసీబీ చైర్మన్  అభ్యర్థిగా సబిత ప్రతిపాదించిన లక్ష్మారెడ్డిని ఓడించేందుకు కూడా వైరివర్గం వెనుకాడలేదు. ప్రతిపక్ష పార్టీతో మిలాఖత్ అయి వెన్నుపోటుకు యత్నించారు.
 
  వ్యతిరేకవర్గం వ్యూహాలను ముందే పసిగట్టిన సబిత... లక్ష్మారెడ్డిని సలువుగా గెలిపించుకోగలిగారు. సబిత వర్గానికి డీసీసీబీ కుర్చీ కట్టబెట్టినా సరే.. తన వర్గానికి డీసీఎంఎస్ పీఠం దక్కాల్సిందేనని ప్రసాద్‌కుమార్ మొదట్నుంచి వాదిస్తున్నారు. ఈ తరుణంలోనే దారాసింగ్‌కు డీసీఎంఎస్ పగ్గాలు కట్టబెట్టాలని ప్రతిపాదించారు. మెజార్టీ డెరైక్టర్లు సబిత వర్గీయులు కావడంతో ప్రసాద్ పాచిక పారలేదు. ఈ నేపథ్యంలోనే అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తేవడం ద్వారా శ్రవణ్ నామినేషన్‌ను విత్‌డ్రా చేయించడంలో సఫలమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరిగినప్పటికీ సబిత మాత్రం పంతం వీడలేదు. గతంలో హామీ మేరకు బరిలో నిలిచి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకున్న శ్రవణ్‌కుమార్‌నే తమ అభ్యర్థిగా బరిలో దించారు.
 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది.  ప్రత్యర్థివర్గం అభ్యర్థిగా చెప్పుకుంటున్న దారాసింగ్, ఆయన మద్దతుదారు పెంటారెడ్డి మినహా మిగతా వారంతా శ్రవణ్‌కుమార్‌కే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రవణ్‌కుమార్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ప్రకటించారు. శ్రవణ్‌కుమార్ పాల్మాకుల సొసైటీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. వైస్ చైర్మన్‌గా గెలుపొందిన భీంరెడ్డి కుల్కచర్ల సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
 
 భంగపడ్డ ప్రసాద్‌కుమార్..!
 సహకార ఎన్నికల్లో మంత్రి ప్రసాద్‌కుమార్‌కు చుక్కెదురైంది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను తమ వర్గానికి ఇప్పించుకోవాలని ప్రసాద్, ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పావులు కదిపినప్పటికీ, సబిత ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదు. అధికారిక డీసీసీబీ చైర్మన్ అభ్యర్థిని ఓడించేందుకు తెరవెనుక మంత్రాంగం నెరిపినప్పటికీ ఫలితం లేకపోగా.. చివరకు డీసీఎంఎస్‌తోనైనా సంతృప్తి పడాలని భావించిన ప్రసాద్, కేఎల్లార్ వర్గీయులకు భంగపాటు తప్పలేదు. డీసీఎంఎస్ పదవిని తాను ప్రతిపాదించిన  దారాసింగ్‌కే సబిత వర్గం కూడా మద్దతు ఇచ్చేలా హైకమాండ్ పెద్దలతో గతంలో చె ప్పించినప్పటికీ, మారిన సమీకరణల నేపథ్యంలో ప్రసాద్ మాట చెల్లుబాటు కాలేదు. ఆఖరికి దారాసింగ్ సైతం తనకు అండగా నిలవాలని సబిత ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టినప్పటికీ ఫలితం దక్కలేదు.
 
  ప్రసాద్ మాత్రం చివరివరకు అధిష్టానం జోక్యంతో గట్టెక్కుతామని భావించారు. అయితే, సీబీఐ కేసులు, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సబిత ఆత్మరక్షణలో ఉన్నారని భావించిన వైరిపక్షానికి ఆమె చుక్కలు చూపించారు. జిల్లా రాజకీయాలు తన కనుసన్నల్లోనే నడుస్తున్నాయనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని రుజువు చేశారు. కాగా, సబిత మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అధికార కాంగ్రెస్‌లో తనదే ఏకచక్రాధిపత్యమని భావించిన ప్రసాద్‌కు తాజా పరిణామాలు మింగుడు పడడంలేదు. పదవిలో లేనప్పటికీ సబిత హవా కొనసాగుతుండడం.. డీసీఎంఎస్‌లో మెజార్టీ సభ్యులు ఆమె పక్షానే నిలబడడం ప్రసాద్‌ను డైలమాలో పడేసింది.
 
 అభివృద్ధికి సహకరిస్తా
 సహకార వ్యవస్థ పటిష్టానికి కృషి చేస్తా. సమృద్ధిగా ఎరువులు, విత్తనాలను రైతాంగానికి అందుబాటులో ఉంచుతాం. సహకార మార్కెట్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు పరుస్తా.  అందరి సహకారంతో డీసీఎంఎస్‌ను అభివృద్ది పథంలోకి తీసుకెళతా
 -శ్రవణ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్

Advertisement
Advertisement