Sakshi News home page

సుపరిపాలనే లక్ష్యం

Published Fri, Aug 16 2013 4:07 AM

sridhar babu know problems of villagers

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చె ప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంత్రి గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయజెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అధికారులు, పోలీసులకు ఉత్తమ సేవలకు ప్రశంసపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.
 
 సమస్యలు తెలుసుకునేందుకే ‘గ్రామసందర్శన’
 సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా జిల్లాలో ఈ నెల 9న గ్రామ సందర్శన కార్యక్రమం ప్రారంభించామని మంత్రి చెప్పా రు. ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఏర్పడిన మం డల, గ్రామస్థాయి బృందాలు ప్రతీ గురువారం ఓ గ్రామంలో పర్యటించి పరిశీలిస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో లోటుపాట్లు సమీక్షించి చర్యలు తీసుకుంటారన్నారు.
 
 ఈ కార్యక్రమం ద్వారా మార్చిలోగా జిల్లాలో 5 లక్షల వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసి జాతీయ అక్షరాస్యత పరీక్షకు హాజరయ్యేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 2లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకం కింద రెండు లక్షల కుటుంబాలకు వంద రోజుల పని కల్పన లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో  కనీసం 50వేల మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
 
 వ్యవసాయూభివృద్ధి... మరింత ప్రగతి
 జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి వ్యవసాయాభివృద్ధిలో మరింత ప్రగతి సాధిస్తామని మంత్రి అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం తుది దశ కు చేరుకుందని, ముంపునకు గురవుతున్న 12 గ్రామాల్లో 8 గ్రా మాలకు పునరావాస కాలనీలు పూర్తి చేసినట్లు తెలిపారు. మధ్యమానేరు ప్రాజెక్ట్ నిర్మాణం 2015లోగా పూర్తి చేస్తామని, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ముంపునకు గురైన 17 గ్రామాల ఇళ్లకు రూ.280 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. లోవోల్టేజీ నివారణకు ప్రభుత్వం 35 సబ్‌స్టేషన్లు మం జూరు చేసిందని చెప్పారు. నీలం తుఫాన్‌తో పంట నష్టపోయిన 33 వేల మంది రైతులకు పరిహారాన్ని వారి ఖాతాలకు జమచేసినట్లు వివరించారు. ఈ సీజన్‌లో రైతులకు రూ.1500 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చూస్తున్నామని తెలిపారు.
 ‘బంగారుతల్లి’కి బాసట
 ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టిందని శ్రీధర్‌బాబు చెప్పారు. తెల్లరేషన్‌కార్డు కలిగి 2013, మే 1 తర్వాత పుట్టిన ఆడబిడ్డలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రభుత్వం వివిధ దశల్లో మొత్తం రూ.2.16 లక్షల ఆర్థికసాయం అందిస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు లింకేజీ కింద రూ.599 కోట్ల 87లక్షలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.63 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. అన్ని డివిజన్లలో జన ఔషధ నిలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
 
 మనమే ముందు...
 రబీ సీజన్‌లో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 473 కొనుగోలు కేద్రాలు ఏర్పాటు చేసి 2లక్షల 69వేల 335 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానం నిలిచిందన్నారు. 20 సూత్రాల కార్యక్రమం అమలులో 2012-13లో రెండోసారి జిల్లా రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద జిల్లాలో రూ.17 కోట్ల 99 లక్షలతో 19 రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. నాబార్డు ద్వారా రూ.20.61 కోట్లతో 43.78 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు.
 
 గ్రామీణ తాగునీటి సరఫరాకు ఈ ఏడాది రూ.40.16 కోట్లతో 404 పనులు మంజూరు చేశామని తెలిపారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద జిల్లాలో 2 లక్షల 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. రెండో విడత రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మరో 93,183 కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ రవీందర్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్, డీఆర్వో కృష్ణారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వీసీ వీరారెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఆఫ్కాఫ్ చైర్మన్ చేతి ధర్మయ్య పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement