శ్రమజీవి శ్రీహరి | Sakshi
Sakshi News home page

శ్రమజీవి శ్రీహరి

Published Thu, Oct 10 2013 2:21 AM

శ్రమజీవి శ్రీహరి

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు  సినీప్రపంచంలో రియల్ హీరోగా సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు శ్రీహరి శ్రమజీవి. సినీ నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో ఎదిగారు. ఆయన పక్కా హైదరబాదీ. నగరంలోనే పుట్టి పెరిగారు. చిన్నాపెద్దా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా శ్రీహరన్నగా సిటీలోని పహిల్వాన్లకు చిరపరిచితులు. దేహదారుఢ్యంపై మొదటినుంచి ఆసక్తి ఉన్న శ్రీహరి మొదట నగరంలోని బాలానగర్‌లో ఓ జిమ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు అందులో శిక్షణ ఇచ్చేవారు. సినిమాల్లో  నటించాలనే అకాంక్షతో మొదటి నుంచి కూడా తన శరీరాకృతిపై శ్రద్దచూపేవాడు. నిత్యం వ్యాయామం చేస్తూ జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొనేవాడు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు దృష్టిలో పడడంతో ఆయన తన బ్రహ్మనాయుడు చిత్రంలో శ్రీహరికి అవకాశమిచ్చారు.
 
 సికింద్రాబాద్‌లో విద్యాభ్యాసం
 కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా మల్లకుర్లు గ్రామానికి చెందిన సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బాలానగర్‌లో స్థిరపడ్డారు. వీరి రెండో కుమారుడు శ్రీహరి. సత్యనారాయణ హెచ్‌ఏఎల్‌లో సివిల్‌కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. శ్రీహరి బోయిన్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలో పదవ తరగతి వరకు చదివారు. సికింద్రాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియెట్, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రాంగణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. నిజాం కళాశాలలో పీజీ చేశారు. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయకారిగా ఉండేందుకు చిన్నప్పుడు స్కూలుకు వెళ్తూనే ఇళ్లల్లో పాల ప్యాకెట్లు వేసేవారు. స్కూటర్ మెకానిక్ షెడ్డులో కూడా పనిచేశారు.
 
 కూతురు సమాధి పక్కనే..
 బాచుపల్లి గ్రామంలో శ్రీహరికి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులోనే శ్రీహరి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీహరి ఏకైక కూతురు అక్షర అంత్యక్రియలను కూడా బాచుపల్లిలోనే నిర్వహించారు. కూతురి మృతి తరువాత అక్షర పేరుమీద ఒక ఫౌండేషన్‌ను శ్రీహరి స్థాపించారు. ఫౌండేషన్ తరఫున రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న అనంతారం, లక్ష్మాపూర్ గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాం ట్లను ఏర్పరిచి తాగునీటి వసతి కల్పించారు. ఆ గ్రామాల ప్రజలు శ్రీహరి అకాల మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీహరి అకాల మరణంతో సినీ పరిశ్రమ కూడా దిగ్బ్రాంతికి లోనైంది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు, కార్మికులు గుర్తుచేసుకున్నారు.
 
 నెరవేరని కల
 సినీనటుడిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించిన రియల్‌స్టార్ శ్రీహరి రాజకీయ కల మాత్రం నెరవేరలేదు. పలుమర్లు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీహరి ప్రచారం కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుకున్నారు. శ్రీహరి యువసేన పేరుతో స్థానికంగా ఆయనకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement