వ్యవసాయానికే ప్రాధాన్యం! | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికే ప్రాధాన్యం!

Published Mon, Apr 23 2018 6:09 AM

Srikakulam Collector Dhanunjaya Reddy Interview With Sakshi

కె.ధనంజయరెడ్డి.. కలెక్టర్‌గా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన అధికారి. పదవి చేపట్టి ఏడాదే అయినా సిక్కోలు భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఒక స్పష్టమైన అవగాహనతో పనుల్లో తన మార్క్‌ చూపించారు. వంశధార రెండో దశ ప్రాజెక్టు పనుల్లో కనిపిస్తున్న వేగం ఆయన తీసుకున్న చొరవే. జిల్లాలో ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆదివారం ‘సాక్షి’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు.  
– సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం

సాక్షి: జిల్లాలో వ్యవసాయమే ప్రజల ప్రధాన వ్యాపకం. ఈ రంగంలో అభివృద్ధికి మీరు తీసుకుంటున్న చర్యలేమిటి?
కలెక్టరు: ఖరీఫ్‌ పంటకాలం నవంబరు నాటికి పూర్తయితే తర్వాత రబీలోనూ సాగు విస్తీర్ణం పెంచేందుకు వీలవుతుంది. అంతేకాదు ఇది రైతుకు లాభదాయకం కూడా. రబీలో ఆరుతడి పంటల ను ప్రోత్సహించే విషయంలో సఫలమయ్యాం. మొక్కజొన్న, రాగి (చోడి) పంటల విస్తీర్ణం పెరి గింది. వాణిజ్య, ఉద్యాన, కూరగాయల సాగు పెంచేందుకు దృష్టి సారిస్తాం. జీడిమామిడి, కొబ్బరి తోటల్లో పసుపు, అల్లం తదితర అంతర పంటల సాగును ప్రోత్సహిస్తాం. అలాగే జిల్లాలో ని నీటి వనరుల్లో చేపలు పెంచేందుకు సీడ్‌ను మ త్స్యశాఖ ఇప్పటివరకూ బయటి నుంచే తెప్పించే ది. ఈ ఏడాది రూ.5 కోట్లతో జిల్లాలోనే సీడ్‌ను తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. 

సాక్షి: వచ్చే ఖరీఫ్‌ ప్రణాళిక ఏమిటి?
కలెక్టరు: ఖరీఫ్‌కు సంబంధించి మే 15వ తేదీ నాటికి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తాం. ఖరీఫ్‌ కాలాన్ని ముందుకు తెచ్చేవిధంగా రైతులను సన్నద్ధం చేస్తున్నాం. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు గతంలో జూన్‌ ఆఖర్లో లేదా జూలై నెలలో సాగునీరు విడుదల చేసేవారు. ఈ సారి జూన్‌ 7వ తేదీనే ముహూర్తం నిర్ణయించాం. గొట్టా బ్యారేజీ నుంచి వంశధార నీటిని అదే నెల 21వ తేదీన విడుదల చేస్తాం. దీనివల్ల రబీ సీజన్‌ ముందుకు జరుగుతుంది. నవంబరు 16వ తేదీ నుంచి మార్చి వరకూ ఆ సీజన్‌లో సాగునీరు అందించాలనేది మా ప్రయత్నం. గోదావరి జిల్లాల్లో మాదిరిగా రొటేషన్‌ విధానాన్ని తీసుకొస్తాం. 

సాక్షి: పెండింగ్‌ ప్రాజెక్టుల పరిస్థితి, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ఆధునికీకరణ ఎంతవరకూ వచ్చింది? 
కలెక్టరు: వంశధార రెండో దశ ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలో జూలై నాటికి 8 టీఎంసీల నీరు నింపాలనే లక్ష్యం మేరకు చు రుగ్గా పనులు చేయిస్తున్నాం. నిర్మాణ పనులు గతం కన్నా త్వరితగతిన సాగుతున్నాయి. అలాగే హైలెవల్‌ కెనాల్‌పై కొత్తగా ఐదు ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లు సిద్ధం చేస్తున్నాం. ఇవి సాకారమైతే మరో నాలుగైదు వేల ఎకరాల భూమికి నీరు అందుతుంది. జిల్లాలో అంతకుముందు 15 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు చేస్తే వాటిలో నాలుగు ప్రారంభమయ్యాయి. మరో ఆరు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తోటపల్లి పాత ఆయకట్టు, నారాయణపురం ఆయకట్టు ఆధునికీకరణకు ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు కూడా ఇటీవల కాలంలో పుంజుకున్నాయి. 

సాక్షి: జలసిరి పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల మాటేమిటి? 
కలెక్టరు: జలసిరి పథకం కింద 9 వేల బోర్లు వేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 1100 పూర్తి చేశాం. వాటిలో 300 పంపుసెట్లకు సోలార్‌ విద్యుత్తు వ్యవస్థను అనుసంధానం పూర్తికావడంతో అవి రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మిగతా రైతులు చూసి దరఖాస్తు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే బోరురిగ్‌లు వీలైనన్ని అందుబాటులో లేకపోవడం వల్ల తవ్వకం ఆలస్యమవుతోంది. తెలంగాణ ప్రాంతం నుంచి అదనపు రిగ్‌లను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. 

సాక్షి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్‌ఆర్‌ఈజీఏ) అమలు జిల్లాలో ఎలా ఉంది?
కలెక్టరు: జిల్లాలో 84 శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారు. వారి కుటుంబాలకు ఉన్నచోటే పని కల్పించడం ద్వారా వలసలు నివారించవచ్చు. మెటీరియల్‌ కాంపొనెంట్‌ పెంచడం వల్ల ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. 

సాక్షి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవ్వాడ న్యూక్లియర్‌ పార్కు పనులు ఎంతవరకూ వచ్చాయి?
కలెక్టరు: భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పనకు సంబంధించిన జాతీయ అణుసంస్థ (ఎన్‌పీసీఐఎల్‌) ఇప్పటికే రూ.500 కోట్ల నిధులు కేటాయించింది. భూసేకరణ దాదాపు కొలిక్కి వచ్చింది. మే 15వ తేదీనాటికి పూర్తవుతుంది. సుమారు రూ.19 కోట్ల వ్యయంతో 1878 నిర్వాసిత కుటుంబాలకు మోడ్రన్‌ కాలనీ నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన చర్యలు వేగవంతమయ్యాయి. అలాగే ఉద్యోగులకు టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం 390 ఎకరాల అటవీ భూమి గుర్తించాం. 

సాక్షి: జిల్లాలో మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య ఎక్కువగా ఉంది. దీని పరిష్కారానికి మీ ప్రణాళిక?
కలెక్టరు: జిల్లాలో ప్రస్తుతం 40 వేల మంది గర్భిణుల్లో 10,800 మందికి రక్తహీనత సమస్య ఉంది. దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రసూతి సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదం. ఐసీడీఎస్‌ ద్వారా గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ జరుగుతోంది. దీంతోపాటు చిరుధాన్యాలతో తయారైన బిస్కెట్లు, ఉండలు, వేరుశనగ ఉండలు వంటి బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి ఏటా రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుంది. ఆ ఆహారం తయారీ బాధ్యత స్వయంశక్తి సంఘాలకు అప్పగిస్తాం. వచ్చే నెల నుంచే ఇది ప్రారంభిస్తున్నాం.


సాక్షి: జిల్లాలో మరో ప్రధాన సమస్య కిడ్నీ వ్యాధులు. రోగులకు ఉపశమన చర్యలేమిటి?
కలెక్టరు: ఉద్దానంలో గత ఏడాది లక్ష మందికి నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో సీరమ్‌ క్రియాటిన్‌ 1.2 దాటినవారు 13 వేల మంది ఉన్నట్లు తేలింది. సామాజిక పరిస్థితుల వల్ల ఈ వైద్య పరీక్షలకు ముందుకురానివారు మరో 75 వేల మంది వరకూ ఉన్నారని అంచనా. వ్యాధి ప్రారంభంలో గుర్తించిన వెంటనే వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రూ.6.7 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించా. అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. 

సాక్షి: బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటిపై దృష్టి పెడుతున్నారా?
కలెక్టరు: బాల్య వివాహాల అరికట్టడంతో పాటు గర్భస్థ దశ నుంచి ఆడశిశువుల పరిరక్షణకు ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నాం. వెలుగు సిబ్బంది ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జూన్‌ 12 నాటికి రూ.14 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లలో నీటి (రన్నింగ్‌ వాటర్‌) సదుపాయం కల్పించే పనులు ప్రారంభించాం. విద్యార్థులకు దృష్టి పరీక్షలు చేయిస్తాం. జిల్లాలో దృష్టి సమస్య ఉన్న పిల్లలు 10 వేల మంది వరకూ ఉం టారని అంచనా. వారికి రూ.40 లక్షల వ్యయంతో కళ్లద్దాలు కూడా జూలై నెలాఖరు నాటికి అందజేయాలనేది నా ప్రయత్నం. 

సాక్షి: సేవల రంగంలో జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటి?
కలెక్టరు: జిల్లాకు టెంపుల్‌ టూరిజమే ప్రధానం. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను మాస్టర్‌ప్లాన్లతో అభివృద్ధి చేస్తున్నాం. శాలిహుండం బౌద్ధారామం, కళింగపట్నం బీజ్, ఏజెన్సీలోని జగతిపల్లి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జూన్‌ నెలాఖరు నాటికల్లా అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలనేది నా లక్ష్యం. 

Advertisement
Advertisement