జననేత వస్తాడని.. జనమంతా కనులై! | Sakshi
Sakshi News home page

జననేత వస్తాడని.. జనమంతా కనులై!

Published Tue, Nov 6 2018 8:22 AM

Srikakulam People Waiting For S jagan Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్‌ రాజశేఖరరెడ్డి... 2003 నాటికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కనీవినీ ఎరుగని కరువుకాటకాలు! తెలుగు నేల అతలాకుతలమైన విపత్కర పరిస్థితులు! ఇలాంటి పరిస్థితుల్లో కర్షక, కార్మిక, బడుగు వర్గాలను పలకరించి ఉపశమనం కల్పించాలని నాడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం మొదలైంది. 2003 ఏప్రిల్‌ 9న ప్రారంభమైన ఈ యాత్ర 68 రోజుల పాటు 1,470 కి.మీ. దూరం సాగింది. అడుగడుగునా ప్రజల కష్టాలు చూస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఈ పాదయాత్ర జిల్లాలోని ఇచ్ఛాపురంలో 2003 జూన్‌ 15వ తేదీన ముగిసింది!

వైఎస్‌ షర్మిల... 2012 నాటికి ప్రతిపక్షం టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను మరింత కష్టపెడుతున్న వైనం! జననేతగా ఎదుగుతున్న రాజన్న తనయుడు జననన్నను నేరుగా ప్రజల్లో ఎదుర్కోలేక అక్రమంగా కేసులు బనాయించిన కుతంత్రం! పద్నాలుగు నెలల పాటు బయటకు రానీయకుండా బంధించిన దుర్మార్గం! ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి వైఎస్సార్‌ ఆశయాలే ప్రాణంగా... జగనన్న వదిలిన బాణంగా... ప్రజల తోడుగా ప్రజల సాక్షిగా ప్రజల కోసం వైఎస్‌ షర్మిల తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర! అదో సంచలనం! 2012 అక్టోబరు 18న వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద నుంచి మొదలైన ఈ పాదయాత్ర 14 జిల్లాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3,112 కి.మీ. పాటు కొనసాగి ఇచ్ఛాపురంలోనే 2013 ఆగస్టు 4న ముగిసింది!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ఆరొందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా దోపిడీలతో పాలన చేస్తున్న వేళ! విభజనతో గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెడతానని చెప్పిన నేతలు మాటమార్చి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న నేపథ్యంలో ‘అన్న వస్తున్నాడు’ అని భరోసా ఇచ్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టినదే ప్రజాసంకల్ప యాత్ర! 2017 నవంబరు 6వ తేదీన వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఈ మహాకార్యం ప్రారంభమై నేటికి ఏడాది అయ్యింది. 12 జిల్లాల్లో 294 రోజుల పాటు 3,211.5 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ప్రజల జయజయధ్వానాల మధ్య జననేత మరో కొద్దిరోజుల్లో సిక్కోలు జిల్లాలో అడుగుపెడతారనగా పిడుగులాంటి వార్త! గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:     రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర కోసం సిక్కోలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో, పచ్చపార్టీ ప్రజాప్రతినిధుల పక్షపాత పాలనలో, జన్మభూమి కమిటీల అరాచకాలతో ప్రజలు విసిగివేశారిపోయారు. జగన్‌ జిల్లాలో అడుగుపెట్టగానే తమ కష్టాలను ఆయనకు వినిపించాలని, తమ భవిష్యత్తుకొక భరోసా పొందాలని ఆశిస్తున్నారు. ఒక దుండగుడి హత్యాయత్నంతో గాయపడిన తమ జననేత సత్వరమే కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు చేశారు. శాంతియాత్రలు చేశారు. ఆయన ఆరోగ్యం కోసం పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. వాస్తవానికి జగన్‌పై హత్యాయత్నం జరగకపోతే ఈ దీపావళికే ఆయన సిక్కోలు జిల్లాలో అడుగుపెట్టి ఉండేవారు. వైద్యచికిత్స తర్వాత డాక్టర్ల సూచనలతో తాత్కాలిక విరామం ఇచ్చినా త్వరలోనే పునఃప్రారంభమవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

సమస్యలపై సంపూర్ణ అవగాహన...
‘రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతంగా ఏడాది పాతయాత్ర చేశారు. హత్యాయత్నం దురదృష్టకరం. పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలు తెల్సుకున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా మంచి పాలన అందించేందుకు పాదయాత్రలో గుర్తించిన సమస్యలు దోహదపడతాయి. రాష్ట్రంలో చివరి దశకు చేరిన సంకల్పయాత్ర తప్పకుండా విజయవంతంగా పూర్తవుతుంది.’
– పి.రాజమనోహర్, విద్యార్థి,డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం.

జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి జగన్‌...
‘రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి యువనాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సుమారు ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం అందరి లక్ష్యం. ఇలాంటి నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు. –పేరాడ తిలక్, వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త

ప్రజాసమస్యలు తెలుసుకోవడంవల్ల ప్రయోజనాలు...
‘ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర వల్ల ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సమస్యలు తెలుకున్నాక, ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో నవరత్నాలు ప్రకటించారు. ప్రస్తుతం పాదయాత్ర అంటే ఇది ఒక్క యజ్ఞం వంటిది. ప్రజల సమస్యలు తెల్సిన నాయకుడే ప్రజలకు మేలుచేయగలరు.’
– ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య, పూర్వపు ఇన్‌చార్జి వీసీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం.

Advertisement
Advertisement