కలెక్టర్ x డీఢీ | Sakshi
Sakshi News home page

కలెక్టర్ x డీఢీ

Published Wed, Jan 29 2014 3:11 AM

srikanth x vishwa mohan reddy

సాక్షి, నెల్లూరు: అంబేద్కర్ భవన్‌లోని గదుల కేటాయింపు విషయం రెండు శాఖల మధ్య చిచ్చు పెట్టింది. సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్, సాంఘిక సంక్షేమ శాఖ(సోషల్ వెల్ఫేర్) డీడీ విశ్వమోహన్‌రెడ్డి మధ్య విభేదాలకు దారితీసింది. డీడీ నిర్వాకానికి తాను కోర్టు బోనెక్కాల్సి వచ్చిందన్న ఆగ్రహంతో ఆయనపై చర్యలు చేపట్టేందుకు కలెక్టర్ సిద్ధమైనట్లు తెలిసింది.
 
 కలెక్టర్‌కు సమాచారం అందించిన తర్వాతే అంబేద్కర్ భవన్‌లోని గదుల కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు డీడీ చెబుతున్నారు. తనను నిందితుడిగా చేసి చర్యలు తీసుకుంటే కోర్టుకెళ్తానని ఆయన హెచ్చరిస్తున్నారు.
 
 ఇద్దరు ప్రధాన అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి దారితీసిన సంఘటన వివరాలు ఇవి.  నెల్లూరులోని కొండాయపాళెం గేటు సెంటర్‌లో 1984లో ప్రభుత్వం అంబేద్కర్ భవన్ నిర్మించింది. అందులోని రెండు గదులను అంబేద్కర్ మిషన్, ఎస్సీ సంక్షేమ సంఘాలకు (స్వచ్ఛంద సంస్థలు) కేటాయించింది. ఏళ్ల తరబడి ఆ గదులు ఆయా సంఘాల స్వాధీనంలోనే ఉన్నాయి. మె యిన్ హాలు మాత్రం సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో అద్దెకు ఇస్తున్నారు.
 
 గతేడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానటరింగ్ నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ క్రమంలో అక్టోబర్ 28న కలెక్టరేట్ ఆవరణలోని గోల్డెన్ జూబ్లీ హాలులో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ భవన్‌లోని రెండు గదులను తమకు కేటాయించాలని 12 మంది సభ్యులతో కూడి న అట్రాసిటీ కమిటీ ఆ సమావేశంలోనే కలెక్టర్‌ను కోరింది. గదులు కేటాయిస్తానంటూ కలెక్టర్ శ్రీకాంత్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం రెండు గదులను ఖాళీ చేయాలని అంబేద్కర్ మిషన్, ఎస్సీ సంక్షేమ సంఘాలకు అక్టోబర్ 30న సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఆ రెండు గదులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానటరింగ్ కమిటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉన్నఫళంగా గదులను ఎలా ఖాళీ చేస్తామని, కలెక్టర్ ఉత్తర్వులు లేకుండా నోటీసులు ఇవ్వడమేమిటని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పందించిన హైకోర్టు కలెక్టర్ ఆదేశాల మేరకు గదుల కేటాయింపు జరగాలని నవంబర్ 5న తీర్పు నిచ్చింది. అయితే గదుల కేటాయింపు విషయాన్ని అధికారులు తేల్చలేదంటూ, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిం చారంటూ అంబేద్కర్ మిషన్ సభ్యులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ శ్రీకాంత్ సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తనకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సమాచారం ఇవ్వలేదని కలెక్టర్ కోర్టుకు నివేదించినట్లు తెలిసింది. ఈ క్రమంలో డీడీపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ సిద్ధపడినట్లు సమాచారం. అయితే తాను స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు ఇచ్చే ముందు కలెక్టర్‌కు ఫైలు పంపానని, దానిని కలెక్టర్ చూడకపోవడం తన తప్పుకాదని విశ్వమోహన్‌రెడ్డి వాదిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి వచ్చిన సలహా మేరకే నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. తనపై అకారణంగా చర్యలకు  దిగితే తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.
 
 శాఖల మధ్య సమన్వయలోపం
 ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే జిల్లాలో అధికారుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. కలెక్టర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధ్య సమన్వయం లేకనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ ఏర్పాటు రెండేళ్ల ఆలస్యంగా జరిగిందనే విమర్శలు ఉన్నాయి.
 
 ఈ క్రమంలోనే అట్రాసిటీ కేసులు నిర్వీర్యమవుతున్నాయని ఇప్పటికే దళిత సంఘాలు ఎస్సీ,ఎస్టీ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశాయి. మరో వైపు సోషల్ వెల్ఫేర్ డీడీపై ఆరోపణల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానంగా నాల్గో తరగతి ఉద్యోగులు తమను డీడీ కులం పేరుతో తిడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 7 నగరంలోని ఏసీ మార్కెట్ సమీపంలోని బాలికల వసతి గృహాలకు చెందిన 50 మంది విద్యార్థినులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటనకు సంబంధిం చి మొక్కుబడిగా కమిటీలు వేయడం తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. శాఖల మధ్య సమన్వయలోపం నేపథ్యంలోనే చర్య లు తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement